ట్రంప్ తో చేసుకున్న ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘిస్తోంది..! జెలెన్ స్కీ ఆరోపణలు..!
రష్యాతో ఒప్పందం గేమ్ చేంజర్ అని అమెరికా అధినేత ట్రంప్ చెబుతుంటే.. పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఓ వైపు ఒప్పందంతో దాడులు ఆగుతాయని అందరూ భావించగా.. రష్యా సైనిక చర్యలు కొనసాగుతున్నాయి.ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు చేయకూడదన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ధ్వజమెత్తారు. కీవ్పై తాజాగా జరిగిన క్షిపణి దాడి నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో 21 మంది గాయపడ్డారు.
ఉక్రెయిన్ రాజధానిపై జరిగిన ఈ దాడిలో తొమ్మిది అంతస్తుల నివాస భవనం తీవ్రంగా దెబ్బతిన్నట్లు కీవ్ మేయర్ వెల్లడించారు. గాయపడిన వారిలో 16 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆ అపార్ట్మెంట్కు సమీపంలోనే ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్ను లక్ష్యంగా చేసుకునే రష్యా ఈ దాడికి పాల్పడిందని జెలెన్స్కీ ఆరోపించారు. భవిష్యత్తులో మరిన్ని దాడులు జరిగే ప్రమాదం ఉందని, అయితే ఈ విషయంలో పాశ్చాత్య దేశాల నుంచి తగిన ముందస్తు హెచ్చరికలు అందడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
నాలుగేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దం కొనసాగుతోంది. రష్యా .. కీవ్ పై ముప్పేట దాడులు చేస్తుంటే..ప్రతి వ్యూహాలతో జెలెన్ స్కీ సైన్యాన్ని ముందుకు నడిపిస్తున్నారు. యూరోపియన్ దేశాలు, అమెరికా నుంచి వస్తున్న సాంకేతికత సాయంతో .. రష్యాకు చెమటలు పట్టిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా అమెరికా అధినేత ట్రంప్.. రష్యాతో భారీగా చమురు ఒప్పందం చేసుకున్నారు. దీంతో పరిస్థితి అంతా సద్దుమణగుతుందన్నారు. అంతేకాదు.. జెలెన్ స్కీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.. ఉక్రెయిన్ అధ్యక్షుడిగా కొత్తవ్యక్తి రావాలని సూచించారు
మరోవైపు.. రష్యా-అమెరికా ఒప్పందంపై జెలెన్ స్కీ సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందంతో రష్యా.. తమపై మరిన్ని దాడులు చేస్తుందని ఆందోళనవ్యక్తం చేశారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో .. యుద్ధ క్షేత్రం మరింత భయానకంగా మారుతుందన్నారు.








