రివ్యూ : నిజాయితీ గల ఆధ్యాత్మిక చిత్రం ‘హనుమాన్ అంశ్’
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థలు : స్వంభు మీడియా నెట్వర్క్, హోలీ కౌ హోం ప్రొడక్షన్స్,
నటీనటులు : శోబినావ్ సత్యా, చందన్ ఆనంద్, పూర్ణిమా తివారీ, విహాన్ శేడ్జి, అనిల్ రస్తోగి తదితరులు నటించారు.
సంగీతం :శ్రేయాస్ ధర్మాధికారి, సాధు సుషీల్ తివారి,రిషి పాఠక్, సునీల్ లోధి, ధీరేంద్ర ముల్కల్వార్, విశాల్ చతుర్వేది,
సినిమాటోగ్రఫీ : విశాల్ బావ, ఎడిటర్ : శంఖ్ రాజధ్యక్ష,
తెలుగు పంపిణిదారులు : హోమ్‌బాలే ఫిలిమ్స్,
నిర్మాతలు :రాగిణి సోన, అనుప్రియ ఏ నగర్, డా.విశాల్ చతుర్వేది,
రచన, దర్శకత్వం: డా.విశాల్ చతుర్వేది,
విడుదల తేది : 09.10.2026
నిడివి : 2 ఘంటల 30 నిముషాలు
‘నీమ్ కరోలీ బాబా'(Neem Karoli Baba) జీవిత చరిత్ర ఆధారంగా ఒక పుస్తకం రూపొందించాలని అనుకుని సినిమాగా కేవలం రూ. 2 కోట్ల చిన్న బడ్జెట్‌తో తెరకెక్కి, హిందీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 430 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన భక్తిరస చిత్రం ‘హనుమాన్ అంశ్’.(Hanuman Ansh) ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, సాక్షాత్తూ హనుమంతుని అవతారంగా భక్తులు కొలిచే ‘నీమ్ కరోలీ బాబా’ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ డివైన్ ఎమోషనల్ డ్రామా ఈ రోజు అక్టోబర్ 9 తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డాక్టర్ విశాల్ చతుర్వేది రచన, దర్శకత్వంలో ‘హనుమాన్ అంశ్’ తెరకెక్కింది. నీమ్ కరోలి బాబా పాత్రలో శోబినావ్ సత్యా నటించారు. చందన్ ఆనంద్, పూర్ణిమా తివారీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సాధు సుషీల్ తివారి సంగీతాన్ని అందించగా, రిషి పాఠక్ కూడా సంగీత దర్శకుడిగా క్రెడిట్ పొందారు. ఆధ్యాత్మికతతో నిండిన కథకు సంగీతం మరింత బలాన్ని చేకూర్చింది. హిందీ లో బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం.
కథ:
భారతదేశానికి స్వాతంత్య్రం రాక మునుపు జరిగే కథాంశంతో ఈ సినిమా ప్రారంభమవుతుంది. సైన్స్‌ను మాత్రమే నమ్ముతూ, దైవంపై ఏమాత్రం నమ్మకం లేని ఓ నాస్తికుడు అయితే, ఆయన జీవితంలో జరిగిన ఒక అనూహ్య సంఘటన తన నాస్తిక సిద్ధాంతాన్ని మార్చేస్తుంది. విప్లవకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అయిన డాక్టర్ రామ్ నందన్ భోంస్లే (చందన్ ఆనంద్) జీవితంలో చోటుచేసుకునే కొన్ని అనూహ్య సంఘటనలు ఆయన సిద్ధాంతాలను ఎలా మార్చేశాయనేది ఇందులో ఆసక్తికరం. ఇదే క్రమంలో అతనికి లక్ష్మీనారాయణ శర్మ (శోభినవ్ సత్య)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ లక్ష్మీనారాయణ శర్మే కాలక్రమంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను సంపాదించుకున్న ‘నీమ్ కరోలీ బాబా’గా ఎలా మారారు? ఆయన సాగించిన ప్రయాణంలో ఎందరి జీవితాల్లో వెలుగులు నింపారు అనేది ఈ సినిమా కథ.
నటీనటుల హావభావాలు :
భక్తి, బయోపిక్ సినిమాలకు బలమైన భావోద్వేగాలే ప్రాణం. ఆ విషయంలో ‘హనుమాన్ అంశ్’ ఖచ్చితంగా మెప్పిస్తుంది. సినిమా ఆద్యంతం ఒక దైవికతతో కొనసాగుతూ చూసే ప్రేక్షకునిని బాబాతో ప్రయాణం చేస్తున్నట్టుగా లీనం అయ్యేలా చేస్తుంది. ఎలాంటి రాజకీయ అజెండాలు, అనవసర ప్రచారాలు జోడించకుండా కేవలం బాబా వ్యక్తిత్వం, ఆయన నిస్వార్థ కరుణపైనే దృష్టి సారిస్తూ దర్శకుడు కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. బాబాగా నటుడు శోభినవ్ సత్య నటన హుందాగా, సహజంగా సాగింది. ఎక్కడా అతి నాటకీయత లేకుండా ఆయన చూపిన పరిపక్వత సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.
సాంకేతికవర్గం పనితీరు :
ఇక దర్శకుడు విశాల్ చతుర్వేది విషయానికి వస్తే.. ఎలాంటి కమర్షియల్, రాజకీయ అజెండాలు లేకుండా కేవలం బాబా నిస్వార్థ కరుణ, ఆయన చేసిన అద్భుతాల చుట్టే కథను నడిపించిన తీరు ప్రశంసనీయం. తన టీం తో కలిసి తాను ఒక మరపురాని ఆధ్యాత్మికతతో కూడిన భావోద్వేగ ప్రయాణంలోకి ఆడియెన్స్ ని కూడా లీనం అయ్యేలా చేశారు. కేవలం కొన్ని స్లో మూమెంట్స్ పక్కన పెడితే తన మ్యూజిక్ టేస్ట్, బాబా కోసం చేసిన రీసెర్చ్ తాను ప్రెజెంట్ చేసిన విధానం చాలా నిజాయితీగా అనిపిస్తాయి. సినిమాలోని సంగీతం, నేపథ్య సంగీతం సన్నివేశాలను మరింత ఎలివేట్ చేశాయి. రైలులో బ్రిటిష్ అధికారితో జరిగే సంభాషణ, పార్వతి ఇంట్లో భోజనం చేసే సన్నివేశం, ఇంటర్వెల్ ముందు అండర్‌గ్రౌండ్ టన్నెల్లో వచ్చే శివుని ప్రతిరూప దృశ్యం ఇంకా మరెన్నో ఊహాతీత ఘటనల దృశ్యాలు, బాబా బాల్యం ప్రేక్షకులలో బలమైన ముద్ర వేస్తాయి. ఇందులో కెమెరా వర్క్, సంగీతం మంచి ఇంపాక్ట్ చూపించాయి. ఎడిటింగ్ విషయంలో మరింత దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది. ఈ చిత్రానికి నిర్మాణ విలువలు కేవలం 2 కోట్ల బడ్జెట్ లో చూపించిన విజువల్స్ కి ఆడియెన్స్ కూడా ఎక్కువ ఆశించడానికి లేదు. ఉన్న పరిధిలో డీసెంట్ గా రాణించారు. అయితే ప్రొడక్షన్ డిజైన్ మాత్రం సినిమాలో చాలా బాగుంది. పూర్తిగా ఒకప్పటి పరిస్థితులనే చూస్తున్నాం అన్నట్టుగా తెరకెక్కించారు.
విశ్లేషణ :
‘హనుమాన్ అంశ్’ బలమైన భావోద్వేగాలతో కూడిన నిజాయితీగల ఆధ్యాత్మిక చిత్రం. నటుడు శోభినవ్ సత్య హుందాతనంతో కూడిన నటన, అద్భుతమైన నేపథ్య సంగీతం, బాబా విషయంలో కొన్ని అబ్దుతమైన సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అయితే, నేటి వేగవంతమైన సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షకులకు ఈ చిత్ర కథనం నెమ్మదిగా సాగినట్లు అనిపించవచ్చు. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు రిపీటెడ్ గా అనిపించడం ఆడియన్స్ సహనానికి పరీక్ష అవుతాయి. నీమ్ కరోలీ బాబా గురించి ముందుగా తెలిసిన వారికి ఈ కథ మరింతగా కనెక్ట్ అవుతుంది. నీమ్ కరోలీ బాబా భక్తులకే కాకుండా ఆధ్యాత్మిక చిత్రాలను ఇష్టపడే సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం ఒక దైవికతను నింపి ఆడియెన్స్ ని బయటకి పంపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, మనసుకు ప్రశాంతతను ఇచ్చే ఇలాంటి నిజాయితీ గల ఆధ్యాత్మిక చిత్రం చూడాలనుకుంటే కుటుంబ సమేతంగా థియేటర్లలో చూడొచ్చు.








