రివ్యూ : పొగబారిన ‘భోగి’
తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2/5
నిర్మాణ సంస్థ : శ్రీ సత్యసాయి ఆర్ట్స్
నటీనటులు: శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి, శరత్ లోహితస్వ,
అవినాష్, లాల్, ఆడుకాలం నరేన్, దయానంద్ రెడ్డి తదితరులు నటించారు.
సినిమాటోగ్రఫీ: కిషోర్ కుమార్ అరోకియా
సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ఎడిటర్ : తమ్మిరాజు,
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె, ఫైట్స్: దిలీప్ సుబ్బరాయన్,
సమర్పణ: లక్ష్మీ రాధామోహన్, నిర్మాత: కేకే రాధామోహన్,
రచన, దర్శకత్వం: సంపత్ నంది
విడుదల తేదీ:27.11.2026
నిడివి:2 ఘంటల 34 నిముషాలు
శర్వానంద్ ఇటీవల వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో `నారి నారి నడుమ మురారి`, `బైకర్` చిత్రాలతో అలరించారు. ఇప్పుడు `భోగి` అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. శ్రీ సత్య ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించారు. తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం నేడు శుక్రవారం(నవంబర్ 27)న విడుదలైంది. మరి మూవీ ఎలా ఉంది. శర్వానంద్ కి కమర్షియల్ బ్రేక్ దక్కిందా అనేది రివ్యూలో చూద్దాం.
కథ :
ఒక గ్రామం, ఒక క్రూరమైన పటేల్, ఆయన ఆధిపత్యంలో నలిగిపోయే ప్రజలు, ఆ అన్యాయాలను ఎదిరించే ఒక సాధారణ యువకుడు. ఈ కథా నేపథ్యానికి బలమైన భావోద్వేగాలు జోడిస్తే మంచి గ్రామీణ యాక్షన్ డ్రామా తయారవుతుంది. ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ జీవన విధానం, అప్పటి సామాజిక పరిస్థితులు, ఆచారాలు, కుటుంబ బంధాలు, అణచివేతకు వ్యతిరేకంగా జరిగే పోరాటం వంటి అంశాలతో ఈ కథ నడుస్తుంది.
1960ల నాటి తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గులగుట్ట అనే కల్పిత గ్రామం ఈ సినిమాకు ప్రధాన వేదిక. ఊర్లల్లో పటేల్ వ్యవస్థ రాజ్యమేలుతున్న రోజులు. ఆ గ్రామంలో ఊరి పటేల్‌దే రాజ్యం. ఆయన చెప్పిందే చట్టం. ఆయన నిర్ణయమే గ్రామస్తులకు శాసనం. ఎదురు మాట్లాడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోననే భయంతో గ్రామస్తులు బతుకుతుంటారు. ఓసారి చెరువు కట్ట తెగి ఊరంతా కొట్టుకుపోతుంది. ఇలాంటి విపత్తుల నుంచి బయటపడాలంటే అమ్మోరికి పండగా చేయాలని ఊరి పెద్ద పటేల్(శరత్ లోహితస్వ) నిర్ణయిస్తారు. ఆ రోజు రాత్రి ఊర్లో కొందరు పాలేగాళ్లు అర్థరాత్రి అమ్మాయిలను కిడ్నాప్ చేసి అడవుల్లో వదిలేస్తారు. ఇలా వరుసగా ఊర్లల్లో అమ్మాయిలు రాత్రిళ్లు పడుకున్నోళ్లు పడుకున్నట్టుగానే మాయమవుతుంటారు. అదొక మిస్టరీగా ఉంటుంది. అలాంటి గ్రామంలో కష్టపడి పనిచేసే సాధారణ శ్రామికుడిగా కమ్మరి గంగ (శర్వానంద్) తన కుటుంబమే ప్రపంచంగా జీవిస్తుంటాడు. తనే వాళ్లకి అమ్మా నాన్న. ఆ పక్కనే మరదలు సులోచన రాణి (అనుపమా పరమేశ్వరన్) ఉంటుంది. ఆమెని చిన్నప్పట్నుంచి ప్రేమిస్తాడు గంగా.
ఇంతలో గంగా అన్న మాయదారి రోగంతో మంచానపడతాడు. ఊర్లో చాలా మంది జనం ఇలాంటి రోగాల బారిన పడుతుంటారు. దీనికి మరోసారి అమ్మోరుకి పండగా చేయాలని నిర్ణయిస్తాడు పటేల్. కనిపిస్తాడు. ఆ రోజు రాత్రి ఎప్పటిలాగే అమ్మాయిల కిడ్నాప్ కోసం పాలెగాళ్లు వెళ్తారు. తన అన్న స్థానంలో గంగా వెళ్లాల్సి వస్తుంది. అప్పటి వరకు వీళ్లు ఏం చేస్తున్నారనేది ఆయనకు తెలియదు. అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్న విషయం తెలిసి వాళ్లని అడ్డుకొని ఆ అమ్మాయిలను కాపాడతాడు. దీంతో తన పటేల్ చేయాల్సి యాగం భగ్నం అవుతుంది. అతన్ని చంపేయాలని పటేల్ ఆదేశిస్తాడు. కానీ అంతలోనే గంగా అన్న చనిపోతాడు. గంగ జీవితంలోకి వచ్చే కొన్ని అనూహ్య సంఘటనలు అతడి కుటుంబాన్ని, గ్రామాన్ని కుదిపేస్తాయి. ఊరి పటేల్ ఆధిపత్యం, గ్రామంలో జరిగే దారుణాలు, కొన్ని ఆచారాల వెనుక దాగి ఉన్న రహస్యాలు గంగ జీవితాన్ని మరో మలుపు తిప్పుతాయి. గ్రామంలో జరిగే అన్యాయాలను ప్రశ్నించే స్థాయికి గంగ ఎలా చేరుకున్నాడు? పటేల్‌కు ఎదురుగా నిలబడి ఎలా తిరుగుబాటు చేశాడు? తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? గ్రామాన్ని పట్టిపీడిస్తున్న చీకటి కోణం ఏమిటి? అనేదే మిగతా కథ.
ఇవి కూడా చదవండి
నటీనటుల హావభావాలు:
ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ శర్వానంద్ మాస్ అవతారం. ఇప్పటివరకు ఎక్కువగా క్లాస్, కుటుంబ కథా చిత్రాల్లో కనిపించిన ఆయన ఈసారి కమ్మరి గంగ పాత్ర కోసం పూర్తిగా రస్టిక్ లుక్‌లోకి మారారు. పొడవాటి జుట్టు, గడ్డం, తెలంగాణ యాస, శరీర భాషలో మార్పు కనిపిస్తాయి. పాత్ర కోసం ఆయన చేసిన శ్రమ తెరపై కనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాల్లో శర్వానంద్ ఎనర్జీ బాగుంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లోనూ తన నటనతో మెప్పించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మాస్ సన్నివేశాల్లో ఆయన చూపించిన తీవ్రత బాగుంది. అయితే ఒక నటుడికి మంచి పాత్ర, బలమైన సన్నివేశాలు కూడా అవసరం. శర్వానంద్ తనవంతు ప్రయత్నం చేసినా, దర్శకుడు ఆయనకు గుర్తుండిపోయే సన్నివేశాలు ఇవ్వలేకపోయారు. మంచి నటనకు సరైన కథనం తోడైతే ఫలితం మరోలా ఉండేది. అనుపమ పరమేశ్వరన్ సులోచన రాణి పాత్ర ఆమె కు ప్రాధాన్యత ఉన్నట్లు అనిపించినా, కథనం ముందుకు సాగుతున్న కొద్దీ ఆ పాత్ర ప్రభావం తగ్గుతుంది. పాత్రకు మరింత బలమైన సన్నివేశాలు, భావోద్వేగాలు ఉండాల్సింది. అనుపమ తనవంతుగా నటించినా, ఆమె పాత్ర ప్రేక్షకుడి మనసులో నిలిచిపోయేలా లేదు. డింపుల్ హయతి మందారం పాత్రలో కనిపించారు. ఆమె పాత్రను పరిచయం చేసిన తీరు కొంత ఆసక్తిని కలిగించినా, కథలో దాని ఉపయోగం ఆశించిన స్థాయిలో లేదు. పాత్రకు సరైన ప్రాధాన్యత, బలమైన మలుపులు లేకపోవడంతో డింపుల్ నటన కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఊరి పటేల్ పాత్రలో శరత్ లోహితస్వ కనిపించారు.
గ్రామాన్ని తన ఆధీనంలో ఉంచుకుని, ప్రజల్లో భయాన్ని నింపే వ్యక్తిగా ఆయన పాత్రను రూపొందించారు. కథలో గంగకు ఎదురుగా నిలిచే ప్రధాన సంఘర్షణకు ఈ పాత్ర కీలకం. అయితే పటేల్ పాత్రను మరింత శక్తివంతంగా, భయంకరంగా తీర్చిదిద్దాల్సింది. ఆయన ఆధిపత్యం, నిర్ణయాలు, గ్రామస్తులపై చూపించే ప్రభావం ప్రేక్షకుడికి బలంగా అనిపించాలి. కానీ పాత్రలోని క్రూరత్వాన్ని, దాని వెనుక ఉన్న మానసిక స్వభావాన్ని మరింత లోతుగా చూపించాల్సిన అవసరం ఉంది. శరత్ లోహితస్వ తన పాత్ర పరిధిలో నటించినప్పటికీ, రచనలోని లోపాలు పాత్ర ప్రభావాన్ని తగ్గించాయి. లాల్, ఆడుకాలం నరేన్, అవినాష్, దయానంద్ రెడ్డి తదితరులు తమ పాత్రల పరిధిలో నటించారు. అయితే బలమైన పాత్రల రచన లేకపోవడంతో వీరిలో ఎవరికీ ప్రత్యేకంగా గుర్తుండిపోయే అవకాశం లభించలేదు.
సాంకేతికవర్గం పనితీరు :
విజువల్‌గా సినిమా బాగుంది. గ్రాండియర్ గా ఉన్నాయి. లొకేషన్లు బాగున్నాయి. కలర్ టోన్ కూడా గ్రాండియర్నెస్ని తీసుకొచ్చింది. ఇక భీమ్స్ సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకున్నాయి. నర్సిరెడ్డి పాడిన పాటలు, అన్నా చెల్లెళ్లలపై వచ్చే పాట, మాంటేజ్ సాంగ్ ఆకట్టుకునేలా ఉన్నాయి. కాకపోతే అవి ఇంకా బాగా ఎలివేట్ కావాల్సింది. బీజీఎం అదిరిపోయింది. బీజీఎం రేంజ్లో సీన్లు లేకపోవడంతో చాలా సీన్లు తేలిపోయాయి. ఎడిటింగ్ ఫర్వాలేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
సినిమా రిచ్‌గా ఉంది. రాజీ లేకుండా నిర్మించారు. కానీ అనవసరమైన భారీతనం అని చెప్పొచ్చు. దర్శకుడు సంపత్ నంది మంచి కథని ఎంచుకున్నాడు. కథనం విషయంలో మిస్ ఫైర్ అయ్యాడు. డైలాగ్స్ అదిరిపోయాయి. పాత్రల పేర్లు, డైలాగుల, పోయెటిక్ నెస్, రైటింగ్ బాగుంది. కొన్ని సీన్లకి లింక్ చేసిన తీరు బాగుంది. కానీ ఎగ్జిక్యూషన్‌లోనే ఆయన సక్సెస్ కాలేకపోయారు. తలాతోక లేని సినిమాని తీసిన ఫీలింగ్‌ని కలిగించారు.
విశ్లేషణ:
తెలంగాణ బ్యాక్ డ్రాప్లో సినిమాలు వస్తూనే ఉన్నాయి. తెలంగాణ మాండలీకం, ప్రాంతం, కల్చర్‌ని ఆవిష్కరించడం విశేషం. ఇలాంటి చిత్రాలు విశేష ఆదరణ పొందుతున్నాయి. కానీ వీటిలో సరైన కథాబలం లేకుండా చాలా సినిమాలు వస్తున్నాయి. ఇటీవల వచ్చిన `ప్యారడైజ్` అలాంటిదే, ఇప్పుడు వచ్చిన `భోగి` కూడా ఆ కోవకు చెందినదే. యాక్షన్, రా అండ్ రస్టిక్ అంశాలను తెలంగాణ బ్యాక్ డ్రాప్‌ని మేళవించి చేసిన ప్రయత్నం ఈ చిత్రం. కానీ ఆ స్థాయిలో ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా, ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడంలో మాత్రం మేకర్స్ ఫెయిల్ అయ్యారు. సినిమాని ప్రారంభంలో చాలా ఇంట్రెస్టింగ్గా ప్రారంభించారు. సస్పెన్స్ అంశాలతో, భారీతనంతో కథని ఓపెన్ చేసిన తీరు బాగుంది. సినిమాపై అంచనాలను పెంచింది. పటేల్ వ్యవస్థ, దానికిచ్చిన హైప్ బాగుంది. కానీ ఆ తర్వాత ఆ స్థాయిలో లేదు. క్రమంగా గ్రాఫ్ పడిపోతూ వస్తుంది. మూఢనమ్మకాలతో చేసే నరబలి ఎంత ప్రమాదకరం అనేది తెలియజేసే చిత్రమిది. దానికి తెలంగాణ పటేల్ వ్యవస్థ నేపథ్యాన్ని మేళవించి రూపొందించిన తీరు బాగున్నా, దాన్ని తెరపై ఆవిష్కరించడంలో, ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది అని చెప్పొచ్చు.







