బ్రిటన్ నుంచి 12 నెలల్లో 85 వేల మంది మనవాళ్లు వెనక్కి.. అసలేం జరుగుతోంది?
విదేశాలకు వెళ్లి సెటిల్ అవ్వాలని కలలు కనే భారతీయ యువతకు బ్రిటన్ ఎప్పుడూ ఒక ఫేవరెట్ డెస్టినేషన్. ముఖ్యంగా ఉన్నత చదువులు, మంచి ఉద్యోగం, మెరుగైన జీవితం కోసం వేలాది మంది యూకే బాట పడుతుంటారు. కానీ ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్న గణాంకాలు చూస్తుంటే ఒక విషయం మాత్రం షాక్ ఇస్తోంది. గడిచిన 12 నెలల్లో ఏకంగా 85 వేల మంది భారతీయులు బ్రిటన్ను విడిచిపెట్టారు! అసలు ఇంతమంది ఎందుకు వెనక్కి వచ్చారు? చదువు కోసం వెళ్లినవాళ్లే ఎక్కువగా వెనక్కి వస్తున్నారా? ఉద్యోగాల పరిస్థితి మారిందా? లేక బ్రిటన్ వలస విధానాలే దీనికి కారణమా?
85 వేల మందిలో విద్యార్థులే ఎక్కువ!
బ్రిటన్ను విడిచిన భారతీయుల సంఖ్యలో విద్యార్థుల వాటా ఎక్కువగా ఉండటం ఇప్పుడు ప్రత్యేకంగా చర్చకు వస్తోంది. 2026 జూన్‌తో ముగిసిన 12 నెలల కాలంలో మొత్తం 85 వేల మంది భారతీయులు ఆ దేశాన్ని విడిచిపెట్టినట్లు బ్రిటన్ జాతీయ గణాంకాల కార్యాలయం (ONS) వెల్లడించింది. వీరిలో ఏకంగా 55 వేల మంది స్టడీ వీసాలపై వెళ్లిన విద్యార్థులే.
మరో 28 వేల మంది ఉద్యోగ వీసాలపై అక్కడికి వెళ్లినవారు కాగా, మిగిలిన 2 వేల మంది ఇతర వీసా కేటగిరీలకు చెందినవారు. అంటే బ్రిటన్ను వీడిన ప్రతి పది మంది భారతీయుల్లో ఆరుగురికి పైగా విద్యార్థులే ఉన్నారు. చదువు పూర్తయిన తర్వాత స్వదేశానికి తిరిగి రావడం, ఉద్యోగ అవకాశాల కోసం ఇతర దేశాలకు వెళ్లడం వంటి కారణాలు ఈ సంఖ్యలో భాగమై ఉండవచ్చు.
మరి బ్రిటన్‌కు వెళ్లేవాళ్లు లేరా?
ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది. ఒకవైపు 85 వేల మంది భారతీయులు బ్రిటన్ను విడిచిపెడుతుంటే, మరోవైపు కొత్తగా అక్కడికి వెళ్లేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అదే 12 నెలల కాలంలో బ్రిటన్ ప్రభుత్వం భారతీయులకు 77 వేల స్టడీ వీసాలు, 40 వేల వర్క్ వీసాలు మంజూరు చేసింది. అంటే కొంతమంది భారతీయులు బ్రిటన్ నుంచి బయటకు వస్తుంటే, మరికొంతమంది కొత్తగా అక్కడికి వెళ్తున్నారు. కాబట్టి భారతీయులకు బ్రిటన్‌పై ఆసక్తి పూర్తిగా తగ్గిపోయిందని చెప్పలేం. అయితే అక్కడికి వెళ్లడం, అక్కడే స్థిరపడటం అనే రెండు విషయాల మధ్య తేడా ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
బ్రిటన్‌లో తగ్గుతున్న వలసల సంఖ్య!
భారతీయుల విషయంలోనే కాదు.. మొత్తంగా బ్రిటన్‌లోకి వచ్చే విదేశీయుల సంఖ్య కూడా తగ్గుతోంది. 2026 జూన్‌తో ముగిసిన ఏడాది కాలంలో 7.38 లక్షల మంది బ్రిటన్‌కు వలస వచ్చారు. అంతకుముందు ఏడాది ఈ సంఖ్య 8.93 లక్షలుగా ఉండేది. అంటే ఏకంగా 1.55 లక్షల మేర తగ్గుదల నమోదైంది. మరోవైపు బ్రిటన్ను విడిచివెళ్లిన వారి సంఖ్య కూడా 6.89 లక్షల నుంచి 6.61 లక్షలకు తగ్గింది.
ఈ రెండు లెక్కల మధ్య తేడానే నెట్ మైగ్రేషన్. అంటే ఒక దేశంలోకి వచ్చినవారి సంఖ్య నుంచి బయటకు వెళ్లినవారి సంఖ్యను తీసివేస్తే మిగిలేది నెట్ మైగ్రేషన్. బ్రిటన్‌లో ఈ సంఖ్య 2026 జూన్‌తో ముగిసిన ఏడాది కాలానికి 77 వేలకు పడిపోయింది. 2025 నవంబర్ నుంచి ఈ తగ్గుదల కొనసాగుతోంది. భారత్, చైనా, నైజీరియా, పాకిస్థాన్ వంటి దేశాల నుంచి వలసల సంఖ్య తగ్గడం కూడా ఇందుకు ఒక కారణంగా కనిపిస్తోంది.
చిన్న పడవల్లో అక్రమంగా ప్రవేశాలు.. మరోవైపు ఆందోళన!
చట్టబద్ధమైన వలసలు తగ్గుతున్నప్పటికీ, అక్రమంగా బ్రిటన్‌లోకి ప్రవేశించే వారి సమస్య మాత్రం పూర్తిగా తగ్గలేదు. 2026 సెప్టెంబర్‌తో ముగిసిన ఏడాది కాలంలో సుమారు 31 వేల మంది అక్రమంగా బ్రిటన్‌లోకి ప్రవేశించినట్లు ఆ దేశ హోం శాఖ గణాంకాలు వెల్లడించాయి. వీరిలో 86 శాతం మంది ఇంగ్లీష్ ఛానల్ మీదుగా చిన్న పడవల్లో ప్రయాణించి బ్రిటన్‌కు చేరుకున్నారు. దీంతో అక్రమ వలసలను అడ్డుకోవడం కూడా ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.
వలసలను 92 శాతం తగ్గించామంటున్న ప్రభుత్వం!
బ్రిటన్‌లో వలసల నియంత్రణ ఇప్పుడు ప్రభుత్వానికి కీలకమైన అంశంగా మారింది. అధిక వలసల కారణంగా ఆర్థిక వ్యవస్థ, ప్రజా సేవలపై ఒత్తిడి పెరుగుతోందన్న ఆందోళనలు అక్కడ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హోం మంత్రి షబానా మహమూద్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో గరిష్ఠ స్థాయికి చేరిన నెట్ మైగ్రేషన్‌ను తమ ప్రభుత్వం 92 శాతం తగ్గించిందని వెల్లడించారు. వలసల సంఖ్యను మరింత తగ్గించేందుకు చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







