శ్రీవారి అన్న ప్రసాదానికి 14 టన్నుల కూరగాయలను అందించిన ఎన్నారై భక్తుడు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అన్న ప్రసాదాల తయారీకి ఉపయోగించేందుకు 14 టన్నుల కూరగాయలను ఎన్నారై భక్తుడు కుల్లా అశోక్ విరాళంగా అందించారు.ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని కొల్లావారిపాళెం ఆయన స్వస్థలం. కొల్లా అశోక్ తన పుట్టిన రోజు సందర్భంగా ఈ భారీ విరాళాన్ని అందజేశారు.ఈ మేరకు ఆయన అందజేసిన కూరగాయలను బుధవారం టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి చేతుల మీదుగా అన్న ప్రసాదం అధికారులకు అందజేశారు.

న పుట్టినరోజు సందర్భంగా బుధవారం తిరుమలకు వచ్చిన అశోక్.. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో వంటకాల తయారీకి ఉపయోగించేలా మొత్తం 14 టన్నుల కూరగాయలను సమర్పించారు. ఇందులో తొమ్మిది రకాల కూరగాయలు ఉన్నాయి. తిరుమలకు వచ్చే భక్తులకు నిత్యం అన్నప్రసాదాలు అందించే కార్యక్రమానికి తన వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ విరాళం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమంతో జరుపుకోవాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

శ్రీవారి సన్నిధిలో భక్తులకు అన్నప్రసాదం అందించడం ఎంతో పవిత్రమైన సేవగా భావిస్తున్నానని అశోక్ తెలిపారు. తిరుమలకు వచ్చే సామాన్య భక్తుల నుంచి వృద్ధులు, చిన్నారుల వరకు అందరికీ నాణ్యమైన అన్నప్రసాదాలు అందించడంలో భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నారు.







