అమెరికాలోని విదేశీ ఉద్యోగులకు ఐబీఎం షాక్..!
టెక్ దిగ్గజం ఐబీఎం.. అమెరికాలోని తన ఉద్యోగులకు గట్టి షాకిచ్చింది.తమ కన్సల్టింగ్ విభాగంలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు వర్క్ వీసా, గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్లను నిలిపివేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ నిర్ణయంతో ప్రభావితమైన ఉద్యోగులు.. ఈ ఏడాది చివరి నాటికి అమెరికా వెలుపల ఉన్న ఐబీఎం శాఖకు బదిలీపై వెళ్లడం లేదా కంపెనీని వీడడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ప్రధానంగా హెచ్-1బీ వీసాలపై పనిచేస్తున్న భారతీయ టెక్కీలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
ఐబీఎంలో అతిపెద్ద విభాగమైన కన్సల్టింగ్ యూనిట్లో ప్రపంచవ్యాప్తంగా 1,50,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. తాజా నిర్ణయం వల్ల ఎంతమంది ఉద్యోగులపై ప్రభావం పడుతుందనే కచ్చితమైన సంఖ్యను కంపెనీ వెల్లడించలేదు. ప్రభావిత ఉద్యోగులతో వ్యక్తిగతంగా సమావేశాలు నిర్వహించి, ఈ విషయాన్ని తెలియజేసింది.
దేశం విడిచి వెళ్లడానికి లేదా కంపెనీలోనే మరో దేశంలోని ప్రాజెక్టుకు మారడానికి కేవలం మూడు వారాల గడువు ఇచ్చింది. బదిలీని నిరాకరించి, కంపెనీని వీడేవారికి మూడు నెలల వేతనాన్ని పరిహారంగా చెల్లించనున్నట్లు తెలిపింది. డిసెంబర్ 31, 2026 వారి చివరి పనిదినంగా ఉంటుందని పేర్కొంది.
ఈ నిర్ణయంపై ఐబీఎం ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. “ప్రతిభావంతుల కొరతను అధిగమించడానికి గతంలో అమెరికా హై-స్కిల్డ్ వీసా ప్రోగ్రామ్లను ఉపయోగించుకున్నాం. కానీ కొన్ని సంవత్సరాలుగా వాటి వినియోగం తగ్గుతూ వస్తోంది. నైపుణ్యాల లభ్యత, క్లయింట్ల అవసరాలు మారినందున, కన్సల్టింగ్ విభాగంలో చాలా వరకు పోస్టులకు వీసా, గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ను నిలిపివేయాలని నిర్ణయించాం” అని వివరించారు. అయితే, ఈ విధానం ఐబీఎంలోని అన్ని విభాగాలకు వర్తించదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం అమెరికా వెలుపల ఉన్న కన్సల్టింగ్ ఖాళీల్లో ఎక్కువ భాగం భారత్లోనే ఉన్నాయి. నవంబర్ 19 నాటికి ఐబీఎం కెరీర్స్ పోర్టల్లో విదేశాల్లో 1,278 ఖాళీలు ఉండగా, అందులో 1,125 ఉద్యోగాలు భారత్లోనే ఉన్నాయి. సింగపూర్, యూకేలలో కొన్ని ఖాళీలు ఉన్నాయి. అయితే, భారత్కు బదిలీపై వెళితే జీతాల్లో భారీగా కోత పడుతుందని, దాదాపు 80 శాతం వరకు తగ్గుదల ఉండొచ్చని ఉద్యోగుల్లో ఒక అంచనా ప్రచారంలో ఉంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ధృవీకరించలేదు.







