ట్రంప్ ది గందరగోళపు పాలన..! జనవరి నుంచి మార్పు వస్తుందన్న డెమొక్రాట్లు..!
అమెరికా (USA) అధ్యక్షుడు ట్రంప్ (Trump) గందరగోళ పాలనతో దేశ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశారని విపక్ష డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు. యుద్ధాలు.. ట్రేడ్‌వార్‌లతో ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నారని మండిపడ్డారు. మరీ ముఖ్యంగా మిత్రదేశాలపై తాజాగా టారిఫ్‌లు విధించడంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మధ్యంతర ఎన్నికల ఓటమితో డబుల్ లేమ్‌డక్ అధ్యక్షుడిగా మారిన ట్రంప్ చర్యలను తప్పుపట్టారు.
డెమోక్రటిక్ పార్టీకి చెందిన సెనెటర్ చక్ షూమర్ తాజా టారిఫ్‌లపై కొంచెం ఘాటుగానే స్పందించారు. ‘‘డొనాల్డ్ ట్రంప్ ఎప్పటికీ నేర్చుకోరు. ఇక్కడ అసలు సమస్య చైనా. దానిని పట్టించుకోవడం మానేశారు. మిత్రులను దూరం చేసుకొంటూ.. అమెరికా కుటుంబాలపై భారం మోపుతూ.. కార్మికులకు ఉపయోగపడని నిర్ణయాలు తీసుకొంటున్నారు. అసలు షరతులు నిర్ణయించే అధికారం చైనాకే ఇస్తున్నారు. జనవరిలో ఈ పరిస్థితి మారుతుంది’’ అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
పెన్సిల్వేనియా గవర్నర్ జాష్ షాపిరో కూడా ఎక్స్ వేదికగా ట్రంప్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ట్రంప్ గందరగోళపు టారిఫ్‌లు అమెరికన్ల చేతి చమురు వదిలిస్తాయనడానికి మరో ఉదాహరణ ఇది. చైనా అనైతిక వాణిజ్య విధానాలను మనం అడ్డుకోలేకపోతున్నామన్న విషయాన్ని ఆయన గమనించడం లేదు. చివరికి మన మిత్ర దేశాలపై ఘోరంగా టారిఫ్‌లు విధిస్తున్నాం. దీని ఫలితం ఏమిటంటే.. మిత్రదేశాల నుంచి దూరంగా జరిగి అమెరికా ఏకాకిగా మారిపోవడం. సొంత దేశంలోనే అమెరికన్ల ఖర్చు భారీగా పెరగడం’’ అని పేర్కొన్నారు.
వాణిజ్య ఒప్పందం చేసుకోకపోతే భారత్‌పై అమెరికా ఏకపక్షంగా 25% శాతం సుంకాలను విధించాలని నిర్ణయించడాన్ని ‘ది ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ)’ తప్పు పట్టింది. ఒప్పందం కుదిరితే టారిఫ్‌లు 17% తగ్గుతాయని యూఎస్టీఆర్ వెల్లడించిన నేపథ్యంలో అమెరికా ప్రతి చర్యలు తీసుకోవాలని లేఖ రాయనున్నట్లు సంస్థ ఛైర్మన్ బ్రిజేశ్ గోయల్ వెల్లడించారు. భారత్ నుంచి ఔషధాలు, వస్త్రాలు, మెడికల్ సప్లైలు, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వస్తువు, సీఫుడ్స్, ముత్యాలు, లోహాలు, తోళ్లు వంటివి ఎగుమతి చేస్తున్నారు. అలానే అమెరికా భారత్‌కు పప్పుదినుసులు, మినరల్స్, బేవరేజస్, ఆహారం వంటివి ఎగుమతి చేస్తోందన్నారు. వీటిపై 25% ప్రతీకార సుంకాలు విధించాలని కోరారు.







