భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి.. అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించిన కేఎల్ రాహుల్..!
న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్(KL Rahul) అద్భుతమైన శతకంతో చరిత్ర సృష్టించాడు. శనివారం.. మూడో రోజు ఆటలో 207 బంతుల్లో తన 13వ టెస్ట్ సెంచరీని పూర్తి చేసుకున్న రాహుల్, సేనా (SENA – దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలన్నింటిలోనూ టెస్ట్ సెంచరీలు సాధించిన మొట్టమొదటి భారత ఓపెనర్‌గా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసియా క్రికెట్ చరిత్రలోనే కేఎల్ రాహుల్, పాకిస్థాన్ మాజీ ఓపెనర్ సయీద్ అన్వర్ మాత్రమే ఓపెనర్లుగా బరిలోకి దిగి ఈ నాలుగు కఠినమైన విదేశీ పిచ్‌లపై సెంచరీలు బాదిన ఘనత సాధించారు.
34 ఏళ్ల కేఎల్ రాహుల్ తన కెరీర్లో ఇప్పటివరకు సాధించిన మొత్తం 13 టెస్ట్ సెంచరీలలో ఏకంగా 10 విదేశీ గడ్డపైనే నమోదు చేయడం అతని క్లాస్ బ్యాటింగ్‌కు నిదర్శనం. ఓవరాల్‌గా సేనా దేశాల్లో టెస్ట్ శతకాలు సాధించిన ఐదో భారత బ్యాటర్‌గా, ఎనిమిదో ఆసియా ఆటగాడిగా నిలిచిన రాహుల్… సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ, మహ్మద్ అజారుద్దీన్, కుమార్ సంగక్కర, యూనిస్ ఖాన్ వంటి దిగ్గజాల సరసన చేరాడు. అలాగే భారత ఓపెనర్ల తరఫున అత్యధిక టెస్ట్ సెంచరీలు (12) చేసిన జాబితాలో మురళీ విజయ్ రికార్డును సమం చేశాడు.
ఇవి కూడా చదవండి
ఈ జాబితాలో సునీల్ గవాస్కర్ (33), వీరేంద్ర సెహ్వాగ్ (22) మాత్రమే రాహుల్ కంటే ముందున్నారు. 2021 నుంచి ఓపెనర్‌గా 7 టెస్ట్ సెంచరీలు చేసిన రాహుల్, ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (2025-27) సైకిల్లో అత్యధిక సెంచరీలు (4) చేసిన ఓపెనర్లలో టామ్ లాథమ్, ట్రావిస్ హెడ్లతో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే, బేసిన్ రిజర్వ్ మైదానంలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌటైంది.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (85), కేఎల్ రాహుల్ అదిరిపోయే శుభారంభాన్ని అందించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన రాహుల్, మూడో రోజు యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (53+) తో కలిసి రెండో వికెట్‌కు భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. లంచ్ విరామ సమయానికి 93 పరుగులతో ఉన్న రాహుల్, ఆ తర్వాత ఎంతో సంయమనంతో ఆడి తన చారిత్రక సెంచరీని పూర్తి చేసుకోవడంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.







