పాత జ్ఞాపకాలకు మళ్లీ రెక్కలు.. 50 ఏళ్ల నాటి సినిమాను రీ-రిలీజ్ చేస్తున్న డిస్నీ!
ఒక సినిమా చూసిన యాభై ఏళ్ల తర్వాత కూడా ఆ ప్రపంచం మనల్ని వెంటాడుతుంటే.. ఆ సినిమాకు ఉన్న శక్తి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంతరిక్షంలో కొత్త ప్రపంచాలు, వింత గ్రహాలు, ఊహకందని యుద్ధాలు, జెడి యోధులు, లైట్సేబర్ కత్తుల మెరుపులు.. ఇవన్నీ కలిపి ప్రేక్షకులకు మరో ప్రపంచాన్నే పరిచయం చేసిన సినిమా ‘స్టార్ వార్స్’.
1977లో విడుదలైనప్పుడు సినిమా అంటే కేవలం కథ, నటన మాత్రమే కాదు.. ఊహాశక్తికి కూడా హద్దులు ఉండవని నిరూపించింది. అప్పట్లో థియేటర్లలో ఈ అద్భుతాన్ని చూసినవాళ్లకు ఆ అనుభూతి ఇప్పటికీ ప్రత్యేకమే. ఆ తర్వాతి తరాలకు కూడా ఈ ఫ్రాంచైజీ ఒక ప్రత్యేకమైన సినిమా ప్రపంచంగా మారిపోయింది. ఇప్పుడు అలాంటి సినిమాను మరోసారి పెద్ద తెరపై చూసే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? అది కూడా మొదటిసారి విడుదలైన 50 ఏళ్ల తర్వాత!
అభిమానులకు ఈ నోస్టాల్జిక్ అనుభూతిని తిరిగి అందించేందుకు డిస్నీ సిద్ధమైంది. 2027లో స్టార్ వార్స్ 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఒరిజినల్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేయడంతో పాటు, కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు, ప్రత్యేక కార్యక్రమాలతో భారీ వేడుకలకు ప్లాన్ చేసింది.
1977 నాటి మ్యాజిక్ మళ్లీ థియేటర్లలోకి!
ఈ వేడుకల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది ఒరిజినల్ ‘స్టార్ వార్స్’ రీ-రిలీజ్. 1977లో విడుదలైన మొదటి సినిమాను 2027 ఫిబ్రవరి 19న ప్రపంచవ్యాప్తంగా వేలాది థియేటర్లలో ప్రదర్శించనున్నారు. అప్పట్లో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన ఆ విజువల్ ప్రపంచాన్ని ఇప్పుడు ఆధునిక సాంకేతికతతో మరోసారి అనుభవించే అవకాశం కల్పించనున్నారు. IMAX 70mm, 35mm, 4DX, D-BOX వంటి ఫార్మాట్లలోనూ సినిమా ప్రదర్శనలు ఉండనున్నాయి.
ఇవి కూడా చదవండి
అప్పటి సినిమా పోస్టర్‌ను గుర్తుచేసేలా ప్రముఖ పోస్టర్ ఆర్టిస్ట్ మ్యాట్ ఫెర్గూసన్ ప్రత్యేక పోస్టర్‌ను రూపొందించారు. ఈ రీ-రిలీజ్ గురించి లూకాస్ఫిల్మ్ కో-ప్రెసిడెంట్ లిన్వెన్ బ్రెన్నన్ మాట్లాడుతూ.. సినిమా చరిత్రలో ఒక ముఖ్యమైన భాగాన్ని మరోసారి పెద్ద తెరపై ప్రేక్షకులు చూసేలా చేయడం 50వ వార్షికోత్సవానికి ఎంతో ప్రత్యేకమైన విషయమని పేర్కొన్నారు.
జనవరిలోనే మొదలుకానున్న సందడి.. ‘అహ్సోకా 2’
సినిమా రీ-రిలీజ్ కోసం ఫిబ్రవరి వరకు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. అంతకంటే ముందే జనవరి 20న ‘అహ్సోకా’ రెండో సీజన్ డిస్నీ+లోకి రానుంది. రోసారియో డాసన్ మరోసారి అహ్సోకా టానో పాత్రలో కనిపించనున్నారు. ఈసారి ఆమెకు ఎదురయ్యే ప్రధాన సవాలు గ్రాండ్ అడ్మిరల్ థ్రాన్. అతడితో అహ్సోకా చేసే పోరాటమే కొత్త సీజన్లో కీలకంగా ఉండనుంది.
ర్యాన్ గోస్లింగ్‌తో మరో కొత్త స్టార్ వార్స్ ప్రపంచం
ఈ వేడుకల్లో మరో ఆకర్షణ ‘స్టార్ వార్స్: స్టార్‌ఫైటర్’. ర్యాన్ గోస్లింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు షాన్ లెవీ దర్శకత్వం వహిస్తున్నారు. 2027 మే 28న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ప్రేక్షకులకు పరిచయమైన పాత్రలు, కథలనే మళ్లీ చూపించకుండా పూర్తిగా కొత్త కాలం, కొత్త పాత్రలు, కొత్త ప్రదేశాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అంటే స్టార్ వార్స్ కథా ప్రపంచంలో మరో కొత్త అధ్యాయాన్ని పరిచయం చేయబోతున్నారు.
1977లో సినిమా ఎలా తెరకెక్కిందో చూపించే డాక్యుమెంటరీ
స్టార్ వార్స్ అభిమానులకు మే 4 ప్రత్యేకమైన రోజు. దీనినే ‘స్టార్ వార్స్ డే’గా జరుపుకుంటారు. 2027లో ఈ సందర్భంగా డిస్నీ+లో ‘ది హీరో అవేకెన్స్’ పేరుతో ప్రత్యేక డాక్యుమెంటరీ విడుదల కానుంది. ఆర్.జే. కట్లర్ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీలో 1977లో ఒరిజినల్ సినిమా నిర్మాణ సమయంలో చిత్రీకరించిన పాత వీడియోలు, అప్పట్లో రికార్డ్ చేసిన ఆడియోలను ఉపయోగించారు. సినిమా వెనుక జరిగిన ఆసక్తికరమైన సంఘటనలు, అప్పటి చిత్రబృందం అనుభవాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఇవి కూడా చదవండి
జాన్ విలియమ్స్ సంగీతంతో ప్రత్యేక వేడుకలు
స్టార్ వార్స్ గురించి మాట్లాడేటప్పుడు జాన్ విలియమ్స్ సంగీతాన్ని మర్చిపోలేం. ఆ సంగీతం వినిపించగానే సినిమాలోని ఎన్నో సన్నివేశాలు అభిమానులకు గుర్తుకొస్తాయి. అందుకే 50వ వార్షికోత్సవంలో సంగీతానికి కూడా ప్రత్యేక స్థానం కల్పిస్తున్నారు. ఏప్రిల్ 2, 3 తేదీల్లో లాస్ ఏంజెలెస్‌లోని హాలీవుడ్ బౌల్లో ‘స్టార్ వార్స్ ఇన్ కాన్సర్ట్: ది స్కైవాకర్ సాగ’ కార్యక్రమం జరగనుంది. ఆంథోనీ డేనియల్స్ ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.
అంతేకాదు.. ఏప్రిల్ 1 నుంచి 4 వరకు లాస్ ఏంజెలెస్ కన్వెన్షన్ సెంటర్లో ‘స్టార్ వార్స్ సెలబ్రేషన్’ నిర్వహించనున్నారు. మార్చి నుంచి కాస్మ్ సంస్థ వేదికల్లో సినిమాను ఇమర్సివ్ ‘షేర్డ్ రియాలిటీ’ ఫార్మాట్లో ప్రదర్శించనున్నారు. డిస్నీ థీమ్ పార్కులు, క్రూయిజ్ షిప్లలోనూ ప్రత్యేక స్టార్ వార్స్ అనుభవాలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
యాక్షన్ ఫిగర్స్, లెగో సెట్స్.. అభిమానులకు ప్రత్యేక కానుకలు
సినిమాలు, సిరీస్‌లతో పాటు స్టార్ వార్స్‌కు సంబంధించిన ప్రత్యేక వస్తువులను కూడా మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. హ్యాస్బ్రో, లెగో, అడిడాస్, మార్స్, ఆస్టన్ మార్టిన్, స్టెయిన్వే వంటి అంతర్జాతీయ బ్రాండ్లు ఈ వేడుకల్లో భాగస్వాములయ్యాయి. హ్యాస్బ్రో ఇప్పటికే 1977 సినిమాలోని పాత్రల ఆధారంగా ప్రత్యేక యాక్షన్ ఫిగర్స్‌ను పరిచయం చేసింది. వీటి ప్రీ-ఆర్డర్లు నవంబర్ 13 నుంచి ప్రారంభమవుతాయి.
అప్పట్లో కెనర్ సంస్థ తయారు చేసిన ఒరిజినల్ స్టార్ వార్స్ బొమ్మలను గుర్తుచేసేలా 3.75 అంగుళాల రెట్రో ఫిగర్స్‌ను కూడా హ్యాస్బ్రో తీసుకొస్తోంది. ఇవి 2027 వసంతకాలంలో అమెరికాలోని టార్గెట్ స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. లెగో కూడా ఏడు ప్రత్యేక యానివర్సరీ సెట్స్‌ను సిద్ధం చేసింది. స్టార్ వార్స్ కోసం రాల్ఫ్ మెక్‌క్వారీ రూపొందించిన కాన్సెప్ట్ ఆర్ట్ ఆధారంగా ఈ సెట్స్‌లో మినీఫిగర్స్ను తయారు చేశారు. వీటి అమ్మకాలు 2027 జనవరి 1 నుంచి ప్రారంభం కానున్నాయి.
50 ఏళ్ల ప్రయాణానికి ప్రత్యేక లోగో
ఈ వేడుకల కోసం డిస్నీ, లూకాస్ఫిల్మ్ ప్రత్యేక 50వ వార్షికోత్సవ లోగోను రూపొందించాయి. దీనికి జాన్ విలియమ్స్ కొత్తగా ఆర్కెస్ట్రేట్ చేసిన సంగీతాన్ని జతచేయనున్నారు. ఈ ఏడాది చివరి నుంచి 2027 వరకు మరిన్ని బ్రాండ్ భాగస్వామ్యాలు, ప్రత్యేక కార్యక్రమాల వివరాలను ప్రకటించనున్నారు.
ఒకప్పుడు ప్రేక్షకుల ఊహాశక్తికి కొత్త రెక్కలు తొడిగిన ‘స్టార్ వార్స్’.. ఐదు దశాబ్దాల తర్వాత కూడా తన ప్రత్యేకతను నిలబెట్టుకోవడం విశేషం. అప్పట్లో థియేటర్లలో చూసినవాళ్లకు పాత జ్ఞాపకాలు, ఇప్పటివరకు చూడని కొత్త తరానికి సినిమా చరిత్రలోని ఓ అద్భుతాన్ని పెద్ద తెరపై చూసే అవకాశం.. ఈ రెండింటినీ కలిపేలా డిస్నీ 2027 వేడుకలను సిద్ధం చేస్తోంది. 50 ఏళ్ల క్రితం మొదలైన ఆ అంతరిక్ష ప్రయాణం.. మరోసారి థియేటర్లలో మొదలుకాబోతోంది!
—సూర్య ప్రకాష్ జోశ్యుల







