వెన్నునొప్పికి చెక్ పెట్టాలంటే.. రోజూ ఈ 5 యోగా ఆసనాలు చేయండి!
వెన్నునొప్పికి 5 యోగా ఆసనాలు!
మనలో చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో వెన్నునొప్పి (Back Pain) ఒకటి. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేయడం, ఎక్కువసేపు మొబైల్ చూడటం, శారీరక శ్రమ లేకపోవడం, సరైన భంగిమలో కూర్చోకపోవడం వంటి కారణాలతో ఈ సమస్య వస్తోంది. కొందరికి ఉదయం నిద్రలేచిన వెంటనే వెన్ను పట్టేసినట్లు అనిపిస్తుంది. మరికొందరికి ఎక్కువసేపు కూర్చున్నా, నిలబడినా నొప్పి మొదలవుతుంది. ఇలాంటి సమస్యను తగ్గించుకోవడానికి రోజువారీ జీవితంలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడంతో పాటు యోగా కూడా సహాయపడుతుంది. ఇంట్లోనే ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరం లేకుండా కొన్ని సులభమైన ఆసనాలను ప్రయత్నించవచ్చు.
వెన్నెముక కదలికలు మెరుగుపరిచే క్యాట్ కౌ, బాలాసనం!
ముందుగా క్యాట్ కౌ పోస్ (Cat-Cow Pose) గురించి తెలుసుకుందాం. ఈ ఆసనం వెన్నెముక కదలికలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ముందుగా చేతులు, మోకాళ్లపై నేలకు ఆనుకుని ఉండాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ తలను కొద్దిగా పైకి ఎత్తి, పొట్టను కిందకు వంచాలి. శ్వాస వదులుతూ వీపును పైకి లేపి తలను కిందకు వంచాలి. ఇలా నెమ్మదిగా 8 నుంచి 10 సార్లు చేయవచ్చు.
తర్వాత బాలాసనం (Child’s Pose) ప్రయత్నించవచ్చు. ముందుగా మోకాళ్లపై కూర్చుని, శరీరాన్ని ముందుకు వంచాలి. రెండు చేతులను ముందుకు చాపి నుదుటిని నేలకు ఆనించాలి. ఈ స్థితిలో కొన్ని సెకన్ల పాటు ఉండాలి. ఇది వెన్ను కండరాలకు విశ్రాంతిని అందించడంలో సహాయపడుతుంది.
ఇవి కూడా చదవండి
వెన్ను కండరాలకు విశ్రాంతి, బలం ఇచ్చే ఆసనాలు!
మకరాసనం (Crocodile Pose) కూడా సులభంగా చేయగలిగే ఆసనం. ముందుగా బోర్లా పడుకుని, రెండు చేతులను మడిచి వాటిపై తలను ఆనించాలి. శరీరాన్ని పూర్తిగా వదులుగా ఉంచి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదలాలి. ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారికి ఈ విశ్రాంతి భంగిమ ఉపయుక్తంగా ఉంటుంది.
సేతు బంధాసనం (Bridge Pose) చేయడం ద్వారా నడుము, తుంటి ప్రాంతంలోని కండరాలకు బలం చేకూరుతుంది. ముందుగా వెల్లకిలా పడుకుని మోకాళ్లను వంచాలి. పాదాలను నేలపై ఉంచి, నెమ్మదిగా తుంటి భాగాన్ని పైకి ఎత్తాలి. కొన్ని సెకన్ల పాటు అలాగే ఉండి తిరిగి సాధారణ స్థితికి రావాలి.
వెన్నునొప్పి తగ్గేందుకు సుప్త మత్స్యేంద్రాసనం.. పాటించాల్సిన జాగ్రత్తలు!
అలాగే సుప్త మత్స్యేంద్రాసనం (Supine Spinal Twist) వెన్నెముక చుట్టూ ఉన్న కండరాలను సున్నితంగా సాగదీయడానికి ఉపయోగపడుతుంది. వెల్లకిలా పడుకుని మోకాళ్లను వంచి, వాటిని నెమ్మదిగా ఒకవైపు వంచాలి. భుజాలు నేలకు ఆనించి ఉంచాలి. కొద్దిసేపటి తర్వాత మరోవైపు కూడా ఇదే విధంగా చేయాలి.
ఈ ఆసనాలను తొందరపడకుండా, శరీరానికి ఇబ్బంది కలగని విధంగా చేయాలి. మొదట్లో 5 నుంచి 10 నిమిషాలు సాధన చేస్తే సరిపోతుంది. అయితే నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు బలవంతంగా వ్యాయామాలు చేయకూడదు. కాళ్లలో తిమ్మిర్లు, బలహీనత, నొప్పి కాళ్ల వరకు వ్యాపించడం, మూత్ర విసర్జనలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. గర్భిణులు, వెన్నెముక సమస్యలు ఉన్నవారు నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఆసనాలు చేయాలి. సరైన భంగిమ, క్రమమైన నడక, తగిన విశ్రాంతితో పాటు యోగా సాధన వెన్నునొప్పి సమస్యను నియంత్రించుకోవడంలో తోడ్పడుతుంది.







