గోల్ఫ్ కోర్సులతో ట్రంప్ మాస్టర్ ప్లాన్.. రూ.32 వేల కోట్ల పన్ను మినహాయింపు ఎలా సాధ్యం?
ఒక వ్యక్తి తన దగ్గరున్న భూమిని ప్రభుత్వానికో, పర్యావరణ సంస్థలకో విరాళంగా ఇస్తే ఏమవుతుంది? సాధారణంగా ఆ భూమిపై అతనికి ఉన్న హక్కులు తగ్గిపోతాయి. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో మాత్రం లెక్కలు కాస్త భిన్నంగా కనిపిస్తున్నాయి. తన గోల్ఫ్ కోర్సుల్లోని భూముల అభివృద్ధి హక్కులను విరాళంగా ఇచ్చినట్లు చూపిస్తూ, వాటిపై యాజమాన్యాన్ని మాత్రం తన దగ్గరే ఉంచుకుంటున్నారనే ఆరోపణలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఒక్క వ్యూహంతో ఇప్పటికే భారీగా పన్ను మినహాయింపులు పొందిన ట్రంప్.. ఇదే పద్ధతిని తన మిగతా గోల్ఫ్ కోర్సులకూ వర్తింపజేస్తే ఏకంగా 3 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ.25 వేల కోట్లకు పైగా) ప్రయోజనం పొందే అవకాశం ఉందని ఫోర్బ్స్ పరిశోధనాత్మక కథనం వెల్లడించింది.
భూమి ఇవ్వకుండానే విరాళం.. ఇదెలా సాధ్యమవుతుంది?
ఇక్కడ ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహాన్ని అర్థం చేసుకోవాలి. అమెరికాలో ఒక వ్యక్తి తన ఆస్తిపై ఉన్న అభివృద్ధి హక్కులను (Development Rights) ప్రభుత్వానికి లేదా గుర్తింపు పొందిన పర్యావరణ సంస్థలకు విరాళంగా ఇవ్వవచ్చు. అంటే ఒక భూమిలో భవిష్యత్తులో భవనాలు నిర్మించడం, కొత్త ప్రాజెక్టులు చేపట్టడం వంటి అవకాశాలను వదులుకున్నట్లు లెక్క. ఇలా విరాళం ఇచ్చినప్పుడు ఆ హక్కుల విలువ ఆధారంగా పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది.
ట్రంప్ కూడా తన గోల్ఫ్ కోర్సుల విషయంలో ఇదే మార్గాన్ని ఎంచుకున్నట్లు ఫోర్బ్స్ చెబుతోంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆయన విరాళంగా ఇస్తున్నది మొత్తం భూమి కాదు. దానిపై భవిష్యత్తులో అభివృద్ధి చేసుకునే హక్కులు మాత్రమే. దీంతో గోల్ఫ్ కోర్సుల యాజమాన్యం మాత్రం ఆయన దగ్గరే ఉంటుంది. అంటే భూమిని పూర్తిగా వదులుకోకుండానే, అభివృద్ధి హక్కులను విరాళంగా ఇచ్చినందుకు పన్ను ప్రయోజనాలు పొందుతున్నారన్నది ఈ కథనంలోని ప్రధాన అంశం. ఈ విధానం ద్వారా ఇప్పటివరకు ట్రంప్ సుమారు 1.2 బిలియన్ డాలర్ల పన్ను మినహాయింపులు పొందినట్లు ఫోర్బ్స్ అంచనా వేసింది.
ఇవి కూడా చదవండి
ఒక్క గోల్ఫ్ కోర్సుతోనే రూ.2,700 కోట్లకు పైగా ప్రయోజనం!
ఫ్లోరిడాలోని డోరల్లో ఉన్న ట్రంప్ గోల్ఫ్ కోర్సు ఈ వ్యవహారంలో ప్రత్యేకంగా నిలుస్తోంది. అక్కడి భూమి అభివృద్ధి హక్కులను ప్రకృతి పరిరక్షణ పేరుతో విరాళంగా ఇవ్వడం ద్వారా ట్రంప్‌కు సుమారు 323 మిలియన్ డాలర్ల పన్ను ప్రయోజనం లభించినట్లు నివేదిక పేర్కొంది. మన కరెన్సీలో చెప్పాలంటే ఇది దాదాపు రూ.2,700 కోట్లకు పైమాటే.
ఈ వ్యూహం వెనుక ట్రంప్ పర్యావరణ సలహా బృందం అధ్యక్షుడు ఎడ్వర్డ్ రుస్సో ఉన్నట్లు కథనం వెల్లడించింది. ఆయనే ఈ పన్ను విధానాన్ని ట్రంప్‌కు సూచించినట్లు పేర్కొంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ గోల్ఫ్ కోర్సును ప్రకృతి సంరక్షణ ప్రాంతంగా మార్చినప్పటికీ, అక్కడికి వచ్చే సందర్శకులకు ఒక్కొక్కరికి 625 డాలర్ల వరకు ఖర్చవుతుందని నివేదిక తెలిపింది. అంతేకాదు, ట్రంప్‌కు చెందిన మరో మూడు గోల్ఫ్ కోర్సుల్లోనూ ఇలాంటి పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు రుస్సో వెల్లడించారు.
ఇప్పుడు తండ్రి స్థానంలో కొడుకు.. అదే పన్ను వ్యూహం!
ట్రంప్ వ్యాపార వ్యవహారాలను ప్రస్తుతం ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్ పర్యవేక్షిస్తున్నారు. తండ్రి నుంచి ఆర్థిక బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా ఈ పన్ను వ్యూహం కొనసాగుతున్నట్లు ఫోర్బ్స్ కథనం చెబుతోంది. గతేడాది ఫ్లోరిడాలోని జూపిటర్‌లో ఉన్న ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్ అభివృద్ధి హక్కులను ఎరిక్ విరాళంగా ఇచ్చారు. జార్జియాకు చెందిన ఓ లాభాపేక్షలేని సంస్థకు ఈ హక్కులు బదిలీ అయ్యాయి.
అయితే ఆ సంస్థ ఎంపికపైనా ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పన్ను మోసాలకు పాల్పడినట్లు ఐఆర్ఎస్ ఆరోపణలు ఎదుర్కొన్న డెవలపర్ల నుంచి విరాళాలు స్వీకరించిన సంస్థలతో దీనికి సంబంధాలున్నాయని ఫోర్బ్స్ తన పరిశోధనలో పేర్కొంది. అంటే ట్రంప్ కుటుంబం పన్ను మినహాయింపులు పొందేందుకు ఉపయోగిస్తున్న సంస్థల ఎంపిక కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పన్నుల విషయంలో ట్రంప్‌కు ఇది మొదటిసారి కాదు!
ట్రంప్ పన్నుల వ్యవహారం గురించి ఇప్పుడు కొత్తగా ఆరోపణలు రావడం లేదు. గతంలోనూ ఆయన పన్నులు ఎలా చెల్లించారు? ఎంత చెల్లించారు? అనే అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 2018లో న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన పరిశోధన ప్రకారం.. ట్రంప్ తల్లిదండ్రులు ఫ్రెడ్, మేరీ ట్రంప్ తమ పిల్లలకు ఒక బిలియన్ డాలర్లకు పైగా సంపదను బదిలీ చేసినప్పటికీ, దానికి సంబంధించి చెల్లించిన పన్నులు కేవలం 52.2 మిలియన్ డాలర్లుగా ఉన్నాయని వెల్లడించింది. ఈ సంపద బదిలీ కోసం ట్రంప్, ఆయన సోదరులు ఏర్పాటు చేసిన ఓ సంస్థను ఉపయోగించుకున్నారని ఆ కథనం ఆరోపించింది.
ఇక 2020 ఎన్నికలకు ముందు వచ్చిన మరో న్యూయార్క్ టైమ్స్ కథనం మరింత సంచలనం సృష్టించింది. ఎన్నికలకు ముందు 15 ఏళ్లలో 10 సంవత్సరాలు ట్రంప్ ఫెడరల్ ఆదాయపు పన్ను చెల్లించలేదని అందులో పేర్కొన్నారు. వ్యాపారాల్లో భారీ నష్టాలు వచ్చినట్లు చూపించడం ద్వారా పన్ను భారాన్ని తగ్గించుకున్నారని వివరించింది. 2010లో అప్పటి ఆర్థిక ఉద్దీపన చట్టంలోని ఓ నిబంధనను ఉపయోగించుకుని, గతంలో చెల్లించిన పన్నుల్లో దాదాపు 73 మిలియన్ డాలర్లను తిరిగి పొందినట్లు కూడా ఆ కథనం వెల్లడించింది.
ఇక ఈ ఏడాది తన పన్ను రిటర్నుల వివరాలు లీక్ కావడంపై ట్రంప్, ఆయన కుమారులు డొనాల్డ్ జూనియర్, ఎరిక్ కలిసి ఐఆర్ఎస్పై 10 బిలియన్ డాలర్ల దావా వేశారు. అయితే మే నెలలో ఆ కేసును స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్నారు. అనంతరం కుదిరిన సెటిల్మెంట్కు సంబంధించిన వివరాలు కూడా ఈ తాజా కథనంలో ప్రస్తావించారు.
12 గోల్ఫ్ కోర్సులు.. పన్ను మినహాయింపులు రూ.30 వేల కోట్లకు చేరతాయా?
ఇప్పటివరకు జరిగిన వ్యవహారం ఒక ఎత్తయితే, ట్రంప్ కుటుంబం ముందున్న అవకాశం మరో ఎత్తు. ప్రస్తుతం వారి ఆధీనంలో ఉన్న 12 గోల్ఫ్ కోర్సులకు కూడా ఇదే వ్యూహాన్ని వర్తింపజేస్తే 2.5 బిలియన్ డాలర్ల నుంచి 3.8 బిలియన్ డాలర్ల వరకు పన్ను ప్రయోజనం పొందవచ్చని ఫోర్బ్స్ అంచనా వేసింది. వాషింగ్టన్ డీసీ, కాలిఫోర్నియా, న్యూయార్క్, న్యూజెర్సీతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న గోల్ఫ్ కోర్సులు ఇందులో ఉన్నాయి. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.21 వేల కోట్ల నుంచి రూ.32 వేల కోట్ల వరకు ఉంటుంది.
ఈ లెక్కలు చూసిన ట్రంప్ ఆర్గనైజేషన్‌కు చెందిన ఓ వ్యక్తి ఫోర్బ్స్తో మాట్లాడుతూ.. ఈ మొత్తాలు నిజంగా భారీగా ఉన్నాయని వ్యాఖ్యానించినట్లు కథనం పేర్కొంది. అయితే ఈ ఆరోపణలపై వైట్‌హౌస్‌ను వివరణ కోరినా స్పందన రాలేదు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







