ముస్లిం విద్యార్థులకు షరియా రుణాలు పై వివాదం, ఎందుకని?
బ్రిటన్లోని కొన్ని ప్రముఖ యూనివర్సిటీల వెబ్సైట్లలో ఇప్పుడు ఒక కొత్త రకం విద్యా రుణానికి సంబంధించిన సమాచారం కనిపిస్తోంది. సాధారణంగా విద్యార్థులు బ్యాంకులు లేదా ప్రభుత్వ సంస్థల నుంచి తీసుకునే లోన్ల గురించి వింటుంటాం. కానీ ఇప్పుడు అక్కడ మరో రకమైన ఫైనాన్సింగ్ విధానం తెరపైకి వచ్చింది. దీనిపై రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం కూడా మొదలైంది. కొందరు దీన్ని విద్యార్థులకు కొత్త అవకాశంగా చూస్తుంటే, మరికొందరు మాత్రం బ్రిటన్ విద్యా వ్యవస్థలోనే కొత్త విభజనకు ఇది దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఇంతకీ ఈ కొత్త లోన్లలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ప్రభుత్వం వీటిని ఎందుకు తీసుకొస్తోంది? వీటికి సాధారణ విద్యా రుణాలకు మధ్య అసలు తేడా ఎక్కడ ఉంది?
అసలు ఈ కొత్త విద్యా రుణం ఏమిటి?
బ్రిటన్ ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తున్న ఈ కొత్త పథకం పేరు Alternative Student Finance (ASF). పేరులోనే ఉన్నట్లుగా ఇది విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం అందించే మరో విధానం. అయితే దీనికి సాధారణ విద్యా రుణాలకు మధ్య ఒక కీలకమైన తేడా ఉంది. సాధారణంగా విద్యార్థులు ప్రభుత్వ రుణాలు తీసుకుంటే వాటిపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ కొత్త పథకాన్ని ఇస్లామిక్ ఆర్థిక సూత్రాలకు అనుగుణంగా రూపొందిస్తున్నారు. ఇస్లాంలో వడ్డీ తీసుకోవడం, చెల్లించడం (Riba) నిషేధం. అందుకే వడ్డీ ఆధారిత రుణాలను తీసుకోవడానికి ఇష్టపడని విద్యార్థులకు ప్రత్యామ్నాయంగా దీన్ని తీసుకొస్తున్నారు.
అంటే విద్యార్థులు యూనివర్సిటీ ఫీజులు, చదువుకునే సమయంలో అవసరమైన ఖర్చుల కోసం ఆర్థిక సహాయం పొందుతారు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేసి సంపాదించే ఆదాయాన్ని బట్టి తిరిగి చెల్లింపులు చేస్తారు. అయితే సాధారణ రుణాల్లో మాదిరిగా వడ్డీ విధానం కాకుండా, ఇస్లామిక్ ఫైనాన్స్లోని పరస్పర సహకార సూత్రం ఆధారంగా ఈ పథకం పనిచేయనుంది.
ఈ పథకంలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, విద్యార్థులు తిరిగి చెల్లించే డబ్బు భవిష్యత్తులో ఇతర విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడానికి ఉపయోగపడుతుంది. అంటే ఒక తరం విద్యార్థులు చెల్లించిన మొత్తంతో మరో తరం విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పించాలన్నది ఈ విధానం వెనుక ఉన్న ఆలోచన.
యూనివర్సిటీలు చెబుతున్నదేంటి?
ఈ పథకం గురించి బ్రిటన్లోని కొన్ని ప్రముఖ యూనివర్సిటీలు తమ వెబ్సైట్లలో సమాచారం ఇవ్వడం ప్రారంభించాయి. బ్రిస్టల్ యూనివర్సిటీ దీన్ని ఇస్లామిక్ ఫైనాన్స్ సూత్రాలకు అనుగుణమైన వడ్డీ రహిత ప్రభుత్వ విద్యా రుణంగా పేర్కొంది. లీడ్స్ యూనివర్సిటీ కూడా 2026-27 విద్యా సంవత్సరంలో ఇవి అందుబాటులోకి రావచ్చని విద్యార్థులకు తెలిపింది.
UCL, సిటీ సెయింట్ జార్జ్, న్యూకాజిల్ యూనివర్సిటీలు కూడా ఈ పథకంపై తమ వెబ్సైట్లలో వివరాలు పొందుపరిచాయి. అయితే అన్ని యూనివర్సిటీలు ఒకే విధంగా దీన్ని వివరించడం లేదు. ఉదాహరణకు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మాత్రం ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాధారణ విద్యా రుణాలను కూడా కొందరు ఇస్లామిక్ పండితులు అనుమతిస్తున్నారని సూచిస్తోంది.
అసలు ఈ షరియా లోన్లు ఎందుకు తీసుకొస్తున్నారు?
బ్రిటన్లో ప్రస్తుతం యూనివర్సిటీ విద్య కోసం ప్రభుత్వం అందించే విద్యా రుణాలపై వడ్డీ వర్తిస్తుంది. అయితే ఇస్లామిక్ మత విశ్వాసాల ప్రకారం వడ్డీ తీసుకోవడం, చెల్లించడం (Riba) నిషేధం. దీంతో కొంతమంది ముస్లిం విద్యార్థులు సాధారణ విద్యా రుణాలు తీసుకోవడానికి ఇష్టపడరు. ఉన్నత విద్య చదవాలనే ఆసక్తి ఉన్నప్పటికీ, మత విశ్వాసాలకు విరుద్ధంగా వెళ్లకూడదనే ఉద్దేశంతో రుణాలకు దూరంగా ఉంటున్నారు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు బ్రిటన్ ప్రభుత్వం Alternative Student Finance (ASF) అనే కొత్త పథకాన్ని రూపొందిస్తోంది. ఇస్లామిక్ ఆర్థిక సూత్రాలకు అనుగుణంగా విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం దీని ఉద్దేశం. ప్రభుత్వం చెబుతున్న ప్రకారం, ఇది ప్రపంచంలో ఇస్లామిక్ ఫైనాన్స్ సూత్రాలకు అనుగుణంగా రూపొందిస్తున్న తొలి ప్రభుత్వ మద్దతు ఉన్న విద్యా రుణ పథకాలలో ఒకటి.
వడ్డీకి బదులుగా మరో విధానం.. అసలు ఎలా పనిచేస్తుంది?
ఈ పథకం వెనుక ఉన్న అసలు ఆలోచన ‘తకాఫుల్’ (Takaful) అనే ఇస్లామిక్ ఆర్థిక విధానం. ఇది పరస్పర సహకారం, ఉమ్మడి నిధి అనే సూత్రాలపై పనిచేస్తుంది. ఒక సమూహంలోని సభ్యులు ఒక ఉమ్మడి నిధికి తమ వంతు మొత్తాన్ని అందిస్తారు. అవసరమైన వారికి ఆ నిధి నుంచి ఆర్థిక సహాయం అందుతుంది.
ఈ విధానాన్ని విద్యా రుణాలకు అన్వయించాలని బ్రిటన్ ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థులు Student Finance England ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. సాధారణ రుణం తీసుకునే బదులు, ట్యూషన్ ఫీజులు, చదువుకునే సమయంలో అవసరమైన జీవన ఖర్చుల కోసం ప్రత్యామ్నాయ ఆర్థిక సహాయం పొందుతారు.
చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం చేసి సంపాదించే ఆదాయాన్ని బట్టి ఈ నిధికి తిరిగి చెల్లింపులు చేయాలి. విద్యార్థులు చెల్లించిన డబ్బు ప్రభుత్వ సాధారణ ఖజానాలో కలిసిపోదు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తకాఫుల్ నిధిలోనే ఉంటుంది. ఆ డబ్బును భవిష్యత్తులో ఈ పథకం ద్వారా చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడానికి ఉపయోగిస్తారు.
ఈ రెండు రకాల విద్యా ఆర్థిక వ్యవస్థలను Student Loans Company అనే ప్రభుత్వ సంస్థ నిర్వహిస్తుంది. అయితే ఈ పథకం ప్రస్తుతం అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకే వర్తిస్తుంది. మాస్టర్స్, డాక్టరల్ కోర్సులు చదివేవారికి ఈ అవకాశం ఉండదు.
‘రెండు రకాల విద్యా వ్యవస్థలు’ అంటూ రాజకీయ విమర్శలు!
ఈ పథకం ఇప్పుడు బ్రిటన్లో రాజకీయ వివాదానికి కూడా కారణమైంది. Reform UK పార్టీ విద్యా వ్యవహారాల ప్రతినిధి సుయెల్లా బ్రేవర్మన్ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు.
ఇది బ్రిటన్కు వ్యతిరేకమైన పథకమని, విద్యా వ్యవస్థలో రెండు వర్గాలను సృష్టించి సమాజాన్ని విభజించే ప్రమాదం ఉందని ఆమె విమర్శించారు. ఒక మతానికి అనుగుణంగా ప్రత్యేక విద్యా ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయడం ఎందుకని ప్రశ్నించారు.
మరోవైపు విద్యార్థులు తీసుకున్న రుణాలను పూర్తిగా తిరిగి చెల్లించలేకపోతే ఆర్థిక భారాన్ని చివరకు పన్ను చెల్లింపుదారులే భరించాల్సి వస్తుందని కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







