వెండితెరపై ‘సోనియా’ ప్రస్థానం.. జగ్గారెడ్డి సినీ ప్రయోగం!
తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ వినూత్న శైలితో, సంచలన ప్రకటనలతో వార్తల్లో నిలిచే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరో ఆసక్తికర నిర్ణయంతో ముందుకు వచ్చారు. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ జీవిత ప్రస్థానాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు ఆయన నడుం బిగించారు. సోనియా గాంధీ రచించిన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ ఆధారంగా తెలుగులో బయోపిక్‌ను నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 25న జరగనున్న తన కుమారుడు భరత్ సాయిరెడ్డి వివాహ వేడుకకు పార్టీ శ్రేణులను ఆహ్వానించేందుకు ఏర్పాటు చేసిన ఈ వేదికను, ఆయన ఈ భారీ సినీ ప్రకటనకు ఉపయోగించుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
సాధారణంగా రాజకీయ నాయకుల బయోపిక్‌ల వెనుక బడా నిర్మాణ సంస్థలు లేదా కార్పొరేట్ శక్తులు ఉంటాయి. కానీ.. జగ్గారెడ్డి ఇందుకు భిన్నమైన, పూర్తిస్థాయి ప్రజాస్వామ్య పంథాను ఎంచుకున్నారు. ఈ చిత్రానికి సంగారెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, సామాన్య కార్యకర్తలే నిర్మాతలుగా వ్యవహరిస్తారని ఆయన వెల్లడించారు. సినిమా నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షించేందుకు 50 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, గాంధీభవన్ పీఆర్వో హరిప్రసాద్ దీనికి పర్యవేక్షకుడిగా ఉంటారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా క్లాప్ కొట్టించి త్వరలోనే షూటింగ్ ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పార్టీ క్యాడర్‌ను మానసికంగా, సంస్థాగతంగా అధిష్ఠానానికి మరింత చేరువ చేసే వ్యూహంలో భాగంగానే ఈ క్రౌడ్ ఫండింగ్ లేదా కార్యకర్తల భాగస్వామ్య నమూనాను ఎంచుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఇటలీలోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన సోనియా, రాజీవ్ గాంధీతో వివాహం తర్వాత భారతదేశాన్ని తన స్వస్థలంగా మార్చుకున్న తీరు ఎంతో నాటకీయమైనది. ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకంలో ఆమె తన ప్రేమ, వివాహం, ఇందిరా గాంధీతో అనుబంధం, రాజీవ్ గాంధీ హత్య తర్వాత ఎదురైన విషాదం, అనివార్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఘట్టాలను అత్యంత భావోద్వేగభరితంగా వివరించారు.
జగ్గారెడ్డి తన ప్రసంగంలో సోనియా గాంధీ వ్యక్తిత్వాన్ని ఆకాశానికెత్తారు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో బాధలు, రాజకీయంగా తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ, ఆమె అకుంఠిత దీక్షతో విజయవంతమైన నాయకురాలిగా ఎదిగారని కొనియాడారు. ముఖ్యంగా మూడుసార్లు ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం తలుపు తట్టినప్పటికీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆ పదవిని త్యాగం చేసిన ఘనత ఆమెకే దక్కుతుందని గుర్తుచేశారు. భారతదేశంలోని విభిన్న కులాలు, మతాలు, భాషలు, ప్రాంతీయ పరిస్థితులపై ఆమెకు ఉన్న లోతైన అవగాహన వల్లే, దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి సంక్షేమ కార్యక్రమాలు అమల్లోకి వచ్చాయని ఆయన విశ్లేషించారు. నేడు దేశ భవిష్యత్తు కోసం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ముందుండి నడిపిస్తున్న శక్తి సోనియా గాంధీయేనని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ పోషించిన చారిత్రక పాత్రను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ తన ప్రధాన బలంగా భావిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ సోనియమ్మ సెంటిమెంట్ పార్టీ విజయానికి దోహదపడింది. ఇప్పుడు ఆమె జీవిత చరిత్రను తెరపైకి తీసుకురావడం ద్వారా, కేవలం రాజకీయ ప్రసంగాలకే పరిమితం కాకుండా, దృశ్య మాధ్యమం ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్లాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఒకవేళ ఈ చిత్రం అనుకున్న సమయానికి, బలమైన కథనంతో పూర్తియితే, రాబోయే ఎన్నికల నుండి భవిష్యత్ రాజకీయ సమీకరణాల వరకు కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే అవకాశముంది. వెండితెరపై ఈ ప్రేమ, త్యాగాల ప్రయాణం ప్రేక్షకులను, ఓటర్లను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.







