“రామాయణం” వస్తోంది.. గాడ్జిల్లా వెనక్కి తగ్గింది! ఇది భయమా.. బాక్సాఫీస్ లెక్కా?
కొన్ని యుద్ధాలు మొదలయ్యాక గెలుపోటములు తేలుతాయి. మరికొన్ని యుద్ధాలు అసలు మొదలుకాకముందే ఎవరి వ్యూహం ఏమిటో బయటపెడతాయి. ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర జరగబోతున్నది కూడా అలాంటిదే! నవంబర్‌లో ఒకవైపు రణబీర్ కపూర్ ‘రామాయణం’గా ప్రేక్షకుల ముందుకు వస్తుంటే.. మరోవైపు జపాన్ నుంచి గాడ్జిల్లా తన విధ్వంసంతో థియేటర్లను షేక్ చేయడానికి సిద్ధమైంది. రెండు సినిమాల లక్ష్యం ఒక్కటే.. ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించడం. కానీ ఈ రెండు సినిమాల మధ్య అసలు పోటీ కలెక్షన్ల దగ్గర కాదు.. ప్రేక్షకుడికి అత్యుత్తమ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే దగ్గర..ఈ నేపధ్యంలో ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ తన ఇండియా రిలీజ్ డేట్‌ను మార్చుకుంది. అసలేంటి ఈ రిలీజ్ డేట్ మార్పు వెనక ఉన్న భాక్సాఫీస్ వ్యూహం?
ఒకే సమయంలో రెండు భారీ సినిమాలు.. కానీ స్క్రీన్లు ఎన్ని?
మొదట నవంబర్ 6న ఇండియాలో విడుదల కావాల్సిన ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ ఇప్పుడు నవంబర్ 20కి మారింది. అంటే నవంబర్ 5న విడుదల కానున్న ‘రామాయణం పార్ట్ 1’కు గాడ్జిల్లా నేరుగా పోటీ ఇవ్వడం లేదు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన మార్పా? లేక ముందుగానే వేసుకున్న బాక్సాఫీస్ వ్యూహమా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఎందుకంటే ఈ రెండు సినిమాలకూ IMAX స్క్రీన్లు చాలా కీలకం. ‘రామాయణం’కు విడుదలైన మొదటి రెండు వారాల పాటు IMAX స్క్రీన్లపై గట్టి పట్టు ఉంటుందనే అంచనా. మరోవైపు ఇండియాలో IMAX స్క్రీన్ల సంఖ్య పరిమితం. ఒకే సమయంలో రెండు భారీ సినిమాలు వస్తే వాటి మధ్య స్క్రీన్ల పంపకం తప్పనిసరి అవుతుంది. అంటే ప్రేక్షకుల దగ్గరకు వెళ్లకముందే సినిమాల మధ్య థియేటర్ల కోసం పోటీ మొదలవుతుంది. ఈ పరిస్థితిలో గాడ్జిల్లా రెండు వారాలు వెనక్కి వెళ్లడం వెనుక థియేట్రికల్ లెక్కలు ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రపంచానికి ముందే కనిపించే గాడ్జిల్లా.. ఇండియాకు మాత్రం ఆలస్యంగా!
గాడ్జిల్లా ప్రపంచ ప్రయాణం మాత్రం ఇప్పటికే మొదలవుతోంది. జపాన్‌లో నవంబర్ 3న, నార్త్ అమెరికాలో నవంబర్ 6న సినిమా విడుదల కానుంది. ఇండియన్ ప్రేక్షకులకు మాత్రం నవంబర్ 20 వరకు వెయిటింగ్ తప్పదు. ప్రపంచంలోని కొన్ని ప్రధాన మార్కెట్లలో సినిమా విడుదలైన తర్వాత మన దగ్గరకు రావడం మరో ఆసక్తికరమైన పరిణామం.
రెండేళ్ల ప్రశాంతత.. ఆ తర్వాత మళ్లీ విధ్వంసం!
ఇక సినిమా కథలోకి వెళ్తే.. గతంలో వచ్చిన ‘గాడ్జిల్లా మైనస్ వన్’ కథ ముగిసిన రెండేళ్ల తర్వాత ఈ సినిమా మొదలవుతుంది. సంవత్సరం 1949. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ తనను తాను తిరిగి నిర్మించుకునే ప్రయత్నంలో ఉంటుంది. యుద్ధం మిగిల్చిన గాయాలు ఇంకా పూర్తిగా మానలేదు. అయినప్పటికీ ప్రజలు కొత్త జీవితంపై ఆశలు పెట్టుకుంటారు.
అలాంటి సమయంలో మళ్లీ గాడ్జిల్లా వస్తుంది. గతంలో జరిగిన విధ్వంసం ఒక పీడకలగా మిగిలిపోయిందనుకుంటే.. ఇప్పుడు అంతకంటే పెద్ద ప్రమాదం ఎదురవుతుంది. గాడ్జిల్లా తిరిగి రావడంతో షికిషిమా కుటుంబం మరోసారి భయంకరమైన పరిస్థితుల్లోకి నెట్టబడుతుంది. గతంలో ఎదుర్కొన్న విషాదం నుంచి బయటపడటమే ఒక పోరాటమైతే.. ఇప్పుడు ప్రాణాలతో నిలబడటం మరో యుద్ధంగా మారుతుంది.
ఆస్కార్‌తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన దర్శకుడు.. ఇప్పుడు మరో ప్రయోగం!
దర్శకుడు తకాషి యమజాకి ఈ సినిమాను తెరకెక్కించారు. ర్యూనోసుకే కమికి, మినామి హమాబే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జపనీస్ సినిమా చరిత్రలో IMAX కోసం చిత్రీకరించిన తొలి నిర్మాణంగా ఈ సినిమా ప్రత్యేకత సంపాదించుకుంది.
గతంలో వచ్చిన ‘గాడ్జిల్లా మైనస్ వన్’ కేవలం మాన్స్టర్ మూవీగా మిగిలిపోలేదు. యుద్ధం, మనుషుల జీవితాలు, కుటుంబ భావోద్వేగాలను గాడ్జిల్లా విధ్వంసంతో కలిపి చూపించింది. అంతేకాదు, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్‌ను గెలుచుకుని ప్రపంచ సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. అందుకే ఇప్పుడు సీక్వెల్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఫైనల్ గా ….
గాడ్జిల్లా సినిమాలో మనుషులు ఒక రాక్షస జీవితో పోరాడాలి. కానీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మాత్రం సినిమాలు మరో రకమైన పోరాటం చేస్తున్నాయి. అక్కడ గాడ్జిల్లా విధ్వంసం సృష్టిస్తుంటే.. ఇక్కడ IMAX స్క్రీన్ల కోసం లెక్కలు మారుతున్నాయి. నవంబర్ 20న గాడ్జిల్లా థియేటర్లలోకి వచ్చినప్పుడు అసలు విధ్వంసం స్క్రీన్‌పై ఎంత కనిపిస్తుందో.. బాక్సాఫీస్ దగ్గర ఎంత ప్రభావం చూపిస్తుందో చూడాలి! ఈలోగా రామాయణం సైలెంట్ గా తన సత్తా ఏమిటో చూపించుకుని సెటిల్ అవుతుంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







