రబాడ క్రేజీ రికార్డ్.. అత్యంత వేగంగా 350 వికెట్లు..!
సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కాగిసో రబాడ(Kagiso Rabada) టెస్ట్ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ చివరి రోజున ఆయన ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే వేసిన బంతుల పరంగా అత్యంత వేగంగా 350 వికెట్ల మార్క్‌ను చేరుకున్న బౌలర్‌గా రబాడ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. ఆసీస్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ వికెట్ పడగొట్టడం ద్వారా రబాడ ఈ మెగా రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
రబాడ కేవలం 13,808 బంతుల్లోనే 350 టెస్ట్ వికెట్లను పూర్తి చేసి, ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న తన దేశానికే చెందిన దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్ (14,719 బంతులు) రికార్డును బద్దలు కొట్టాడు. వీరి తర్వాత పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ వకార్ యూనిస్ (14,905 బంతులు), వెస్టిండీస్ లెజెండ్ మాల్కమ్ మార్షల్ (16,285 బంతులు) ఉన్నారు. ఇక మ్యాచ్‌ల పరంగా చూస్తే.. రబాడ తన 75వ టెస్టులో ఈ ఘనత సాధించాడు. ఫాస్ట్ బౌలర్ల కేటగిరీలో అత్యంత వేగంగా ఈ మార్క్‌ను అందుకున్న జాబితాలో మాల్కమ్ మార్షల్‌తో కలిసి ఆయన సంయుక్తంగా నాల్గో స్థానంలో నిలిచాడు.
ఈ లిస్టులో రిచర్డ్ హ్యాడ్లీ, డేల్ స్టెయిన్ 69 మ్యాచ్‌లతో టాప్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో 288 పరుగుల టార్గెట్‌ను డిఫెండ్ చేస్తున్న క్రమంలో ఐదో రోజు ఉదయమే రబాడ ఆస్ట్రేలియా టీమ్‌కు గట్టి షాక్ ఇచ్చాడు. తాను వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే మాట్ రెన్షా, మార్నస్ లబుషేన్‌లను వరుసగా అవుట్ చేసి సౌతాఫ్రికాకు అదిరిపోయే స్టార్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత కుదురుగా ఆడుతున్న ట్రావిస్ హెడ్‌ను గల్లీలో మార్కో జాన్సెన్ చేతికి చిక్కేలా చేసి తన కెరీర్లో అత్యంత విలువైన 350వ టెస్ట్ వికెట్‌ను ఖాతాలో వేసుకుని సంబరాల్లో మునిగిపోయాడు.








