ఏడుకొండల స్వామికి ఏలూరు వారి సాయి గణేష్ బృందంచే అన్నమ స్వరార్చన
అన్నమాచార్య భావనా వాహిని ఆధ్వర్యంలో ఈ శనివారం అన్నమయ్యపురంలో నిర్వహించిన వారాంతపు అన్నదానం–అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 గంటల వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.
సాయంత్రం 5 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీ లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ అన్నమాచార్య అష్టోత్తరం, అన్నమ గాయత్రి పారాయణాలతో కార్యక్రమం ప్రారంభమైంది.
అనంతరం ఏలూరుకు చెందిన సాయిగణేశ్ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ గురువు సాయి గణేష్ చారి వారి సంగీత సంస్థ బృందం తరఫున శ్రీమతి బి.కె. బిందు అన్నమయ్య సంకీర్తనలను భక్తిభావంతో ఆలపించారు. “నారాయణ”, “మత్స్య కూర్మ వరాహ”, “దీన రక్షకుడా”, “తిరుమలగిరి రాయ”, “తగునయ్య హరి నీకు”, “ఇటువంటివాడవు”, “కదిరి నృసింహుడు”, “వెంకటాచల నిలయం”, “క్షీరాబ్ధి కన్యకకు”, “చిత్తడి చెమటమిది” తదితర సంకీర్తనలతో స్వామివారికి స్వరార్చన సమర్పించారు. ఈ కార్యక్రమానికి సాయిగణేశ్ చారి కీబోర్డుపై, నాగరాజు మృదంగంపై వాద్య సహకారం అందించారు.
సాయంత్రం 7 గంటలకు పద్మశ్రీ డా. శోభారాజు గారు అన్నమాచార్య సంకీర్తనలలో ఒక సంకీర్తనకు భావార్థ వివరణ అందించి, వాటిలోని భక్తి, తాత్విక సందేశాలను వివరించారు.
అనంతరం శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళహారతి సమర్పించి, భక్తులకు ప్రసాద వితరణతో కార్యక్రమం ముగిసింది.
ఇటువంటి కార్యక్రమాలు సంవత్సరం పొడవునా నిర్వహిస్తూ అన్నమయ్య సంకీర్తనలను సంగీతం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తూ కళాకారులను ప్రోత్సహిస్తున్న అన్నమాచార్య భావనా వాహిని వారి రానున్న కార్యక్రమాల్లో భక్తులు, సంగీతాభిమానులు పాల్గొనాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.








