ఇండియాలో లాగా.. అమెరికాలోనూ ఎన్నికల ప్రచారంలో నేతల పాట్లు
భారత దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా… ఆయా పార్టీల అభ్యర్థులు చేయని ఫీట్లంటూ వుండవు. కొందరు దేవాలయాలకు వెళ్తారు, మరి కొందరు షాపుల్లోకి వెళ్లి సేవలు చేస్తారు, మరి కొందరు పిల్లలకు స్నానాలు పోస్తారు, మరి కొందరు హోటల్స్ కి వెళ్లి, దోసలు, బజ్జీలు పోస్తారు… ఇలా… రకరకాల ఫీట్లు చేస్తుంటారు. ఇది మన భారత దేశంలో కనిపిస్తున్నదే.
అచ్చు ఇలాంటి సీనే అమెరికాలో కూడా జరుగుతోందన్న విషయం మీకు తెలుసా. నిజమే.. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అక్కడి ఆయా పార్టీల అభ్యర్థులు కూడా ఆలయాలను సందర్శించడం, దోశలు వేస్తూ కనిపిస్తున్నారు. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జేమ్స్ తలారికో డాలస్ శివారు ప్రాంతంలోని ఓ హోటల్ లో దోశలు వేశారు. ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో భారతీయ అమెరికన్లు నివసిస్తున్నారు.

ఈ సందర్భంగా జేమ్స్ తలారికో నల్లటి సూట్, తెల్లటి షర్టు ధరించి, గిన్నెతో దోశపిండిని తీసుకొని, దోశ వేసి, అందులో బంగాళదుంప కూరతో స్టఫింగ్ చేసి, పళ్లెంలో వడ్డించారు. దీంతో అక్కడున్న వారంతా చప్పట్లు కూడా కొట్టారు.
ఇదిలా వుంటే… అక్కడి అభ్యర్థులు అక్కడి హిందూ దేవాలయాలను కూడా సందర్శిస్తున్నారు. భారతీయుల ఉత్సవాలకు కూడా హాజరవుతున్నారు. ఇందులో భాగంగా మరోసారి పదవిని చేపట్టాలని పోటీ చేస్తున్న కనెక్టికట్ గవర్నర్ నెడ్ లామోంట్, తన డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జెన్నిఫర్ బరహోనాతో కలిసి స్టేట్ క్యాపిటల్లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.ఓహియోకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు గ్రెగ్ లాండ్స్మన్, షారన్విల్లేలోని BAPS స్వామినారాయణ ఆలయంలో జరిగిన 11వ పాటోత్సవంలో పాల్గొని, ఆ ఆలయ ప్రతిష్ఠా వార్షికోత్సవ వేడుకల్లో భాగమయ్యారు.
న్యూజెర్సీకి చెందిన యూఎస్ సెనేటర్ కోరీ బుకర్ అక్షరధామ్ ఆలయంలో దీపావళి వేడుకల్లో పాల్గొనగా, కాంగ్రెస్ సభ్యులు రాండీ ఫైన్ మరియు స్కాట్ పెర్రీ సమాజ సేవలో భాగంగా పెన్సిల్వేనియాలోని హారిస్బర్గ్లో ఉన్న ఒక ఆలయానికి హాజరయ్యారు.కాంగ్రెస్ సభ్యుడు జాన్ జేమ్స్ మిచిగాన్లోని స్వామినారాయణ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన ఆ ప్రార్థనా స్థలానికి సంబంధించిన సంప్రదాయాల గురించి తెలుసుకోవడంతో పాటు, హిందూ అమెరికన్ సమాజానికి మూలస్తంభంగా ఉన్న సేవా దృక్పథాన్ని దగ్గరగా పరిశీలించారు.కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్, ఇల్లినాయిస్, పెన్సిల్వేనియా మరియు జార్జియా వంటి రాష్ట్రాలలో భారతీయ-అమెరికన్ సమాజం బలంగా ఉంది.








