రివ్యూ : మరోమారు రజినీ ఆరాతో ‘ జైలర్ 2 ’
తెలుగు టైమ్స్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ : సన్ పిక్చర్స్,
నటీ నటులు : రజని కాంత్, ఎస్.జే .సూర్య, మిథున్ చక్రవర్తి, సూరజ్ వెంజరాముడు, రమ్య కృష్ణ, విద్యా బాలన్,యోగి బాబు, మిర్నా,రిత్విక, జతిన్ శర్మ,భగవతి పేరుమల్, కొట్టాయం నజీర్, సునీల్ స్కంద, సుజీత్ శంకర్, హకీమ్ సజహన్ తది తరులు నటించారు.
స్పెషల్: మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, హృతిక్ రోషన్, జాకీ షరాఫ్, విజయ్ సేతుపతి, వినయకన్, వసంత్ రవి, పూర్ణ, రాజేష్ మాధవన్, నోర ఫహతే క్యామియో నటీ నటులుగా నటించారు.
సంగీతం : అనురిద్ రవిచందర్, సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్,
ఎడిటర్: ఆర్.నిర్మల్, ప్రొడక్షన్ డిజైన్: డాక్టర్ కే కిరణ్,
యాక్షన్: చేతన్ డిసౌజా, సౌండ్ డిజైన్: సురేన్, అలగైకూతన్
నిర్మాత: కళానిధి మారన్, దర్శకుడు: నెల్సన్ దిలీప్ కుమార్
విడుదల తేది: 15.10.2026
నిడివి : 2 ఘంటల 40 నిముషాలు
సూపర్ స్టార్ రజినీకాంత్,(Rajini Kanth) డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dileep Kumar) కాంబోలో ఆగస్ట్ 2023 లో వచ్చిన జైలర్ చిత్రం షుమారు 650 కోట్లు వసూలు చేసి భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో సీక్వెల్‌ని రెడీ చేశారు. ఈ దసరా సెలవుల్ని టార్గెట్ చేస్తూ సినిమాని రిలీజ్ చేశారు. పార్ట్ వన్‌లో ఉన్న కేమియోలతో పాటు కొత్త పాత్రల్ని కూడా నెలన్స్ తీసుకు వచ్చి మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడనిపిస్తోంది. తలైవా రజినీకాంత్ సినిమాలకు తెలుగులో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ ఆయన సినిమాలకు కలెక్షన్ల వర్షం కురుస్తుంటుంది. ఈ క్రమంలో ‘ జైలర్ 2 ’ని ఆయన నేడు (అక్టోబర్ 15) ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చారు. మరి ఈ చిత్రం మొదటి పార్ట్‌లానే విజయం సాధిస్తుందా? ఆ రికార్డుల్ని ఈ రెండో పార్ట్ బ్రేక్ చేస్తుందా? అన్నది చూడాలి. మరి ఈ మూవీ ఎలా ఉంది? కథ ఏంటి? అన్నది ఓ సారి సమీక్షలో చూద్దాం.
కథ:
టైగర్ ముత్తువేల్ పాండ్యన్ (రజినీకాంత్) తన కొడుకుని చంపిన విషయాన్ని ఇంట్లో తెలీకుండా మెయింటైన్ చేస్తాడు. ఏసీపీ అర్జున్ మరణం తర్వాత రిటైర్డ్ జైలర్ సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు. వర్మన్ గ్రూప్ మాఫియా నుంచి తన ఫ్యామిలీని రక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే మూర్తి అనే చిన్నపాటి గుండా చేతికి చిక్కిన ముత్తువేల్ పాండ్యన్ అతడి వద్ద డ్రైవర్‌గా కొనసాగుతుంటాడు. ఎవ్వరూ గుర్తు పట్టని ఓ ఊరికి తీసుకు వెళ్లి ఫ్యామిలీని కాపాడుకుంటూ ఉంటాడు. ఆ ఊర్లోని సూపర్ మార్కెట్లో సూపర్ వైజర్‌గా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో వర్మ మరణం తర్వాత పగ్గాలు చేపట్టిన దిలీప్ (సూరజ్ వెంజరమూడు) అనుచరుల నుంచి తన ఫ్యామిలీ, స్నేహితుల ఫ్యామిలీని కాపాడే ప్రయత్నంలో ఉంటాడు. చివరకు దిలీప్ పన్నిన ఉచ్చులో పడిన ముత్తువేల్ అతడి వెనుక ఉన్న ముఠా వివరాలు చెప్పమని రిక్వెస్ట్ చేస్తాడు. అయితే దిలీప్ అనూహ్యమైన పరిస్థితుల్లో బోధి కల్పక్ (సూర్య) చేతిలో మరణిస్తాడు. దాంతో ముత్తువేల్‌ను కల్పక్ ఫ్యామిలీలోని చక్రీ కల్పక్ (మిథున్), కాంత కల్పక్ (విద్యాబాలన్) టార్గెట్ చేస్తారు.
అంతేకాకుండా నరసింహ(జాఫర్ సాదిక్) ఫ్యామిలీని కిడ్నాప్ చేసి ముత్తువేల్‌ను కిడ్నాప్ చేస్తారు. అయితే ఈ క్రమంలో ముత్తు ఓ చిన్న గొడవతో మూర్తి (నమో నారాయణ) వద్ద డ్రైవర్‌గా చేరాల్సి వస్తుంది. ఆ తర్వాత విగ్రహాల స్మగ్లింగ్ బిజినెస్‌లోకి మూర్తిని లాగుతాడు ముత్తు. కొడుకును ఎన్కౌంటర్ చేసిన తర్వాత ముత్తువేల్ పాండ్యన్ జీవితం ఎలా సాగింది? ముత్తువేల్‌ను మూర్తి ఎలా వేధించాడు? ముత్తువేల్ కోసం దిలీప్ అనుచరులు వేట ఎలా కొనసాగింది? కల్పక్ ఫ్యామిలీ అరాచకాలు ఎలా సాగాయి? ముత్తువేల్‌ను కల్పక్ ఫ్యామిలీ ఎలా బ్లాక్ మెయిల్ చేసింది? కల్పక్ ఫ్యామిలీకి ముత్తువేల్ ఎలాంటి గుణపాఠం నేర్పాడు? కల్పక్ కుటంబం ఎత్తులకు ముత్తువేల్ ఎలా పై ఎత్తులు వేశాడు? ముత్తువేల్‌కు రాడీ (హృతిక్ రోషన్), మ్యాథ్యూ (మోహన్ లాల్) ఎలా సహకారం అందించారు. కొడుకును తండ్రి చంపినట్టు తెలిసిన తర్వాత ముత్తువేల్ ఫ్యామిలీ రియాక్షన్ ఏమిటి? కొడుకును చంపిన విషయంలో తన కుటుంబాన్ని ముత్తువేల్ ఎలా కన్విన్స్ చేశాడు? అసలు కొడుకుని చంపిన విషయంలో ఇంట్లో భార్యకి, కోడలికి, మనవడికి తెలిస్తుందా? అనే ప్రశ్నలకు సమాధానమే జైలర్ 2 సినిమా కథ.
నటీనటుల హవబవాలు :
ఆర్టిస్టుల విషయానికి వస్తే… ముత్తువేల్ పాండ్యన్‌గా రజనీకాంత్ రజినీకాంత్ చూపులతోనే నడిపించేశాడు. షర్ట్ నలగకుండా అలా నడుచుకుంటూ వస్తూనే సినిమాని నిలబెట్టేశాడు. ఇందులో రజినీకాంత్ ఎక్కువగా కష్టపడలేదు. ప్రతీ సీన్లో ఎలివేషన్‌లో రజనీ తన ఆరాను చూపించాడు. కానీ సినిమా అంతా ఆయనే మోసినట్టు అనిపిస్తుంది. సూరజ్ వెంజరమూడు, ఎస్ జే సూర్య, మిథున్ చక్రవర్తి, విద్యా బాలన్, నమో నారాయణ, యోగి బాబు ఇలా అందరూ తమ తమ పాత్రల్లో మెప్పిస్తారు. ఇక ఈ సినిమాలో భాస్కర్, మూర్తి పాత్ర నుంచి ప్రతీ చిన్న పాత్ర మెప్పించేలా నటించారు. విద్యాబాలన్ విలన్ పాత్రలో పెర్ఫార్మెన్స్తోపాటు గ్లామర్‌తో కూడా పండించింది. ఎస్జే సూర్య, మిథున్ పాత్రలు హైలెట్‌గా ఉంటాయి. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు రమ్యకృష్ణకి స్క్రీన్ స్పేస్ తక్కువగానే ఉంటుంది. మిర్నా చేసిన ఫెర్ఫార్మెన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తాయి. శివరాజ్ కుమార్ పాత్ర చాలా బాగా రాశారు. ఎప్పటిలానే మోహన్ లాల్ తన మ్యాజిక్‌ను తెరపైన చూపించారు.
సాంకేతిక వర్గం పనితీరు :
నెల్సన్ దిలీప్ కుమార్ రాసిన కథ, సన్నివేశాలు, డైలాగ్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. సున్నితమైన అంశాలతో భాస్కర్, మూర్తి ఎపిసోడ్స్‌ను రాసిన విధానం, వినోదాన్ని పండించిన తీరు హైలెట్. ఫస్టాఫ్‌ను కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కలిపి చేసిన సన్నివేశాలు నెల్సన్ ప్రతిభకు అద్దం పట్టాయి. ఇక రజనీకాంత్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని ఆయన క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన తీరు, ఆయన పాత్రకు ఇచ్చిన ఎలివేషన్స్ అదిరిపోయాయి. విజువల్స్, బీజీఎం నెక్ట్స్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అయితే పాటలు మాత్రం అంతగా చెవికి ఎక్కకపోవచ్చు. పార్ట్ 1లో క్లిక్ అయినట్టుగా ఒక్క పాట కూడా ఈ దఫా థియేటర్లో మోతమోగించలేకపోయాయి. డైలాగ్స్, రజినీ ఆరా, నెల్సన్ మేకింగ్, అనిరుధ్ బీజీఎం సినిమాకి ప్రధాన బలం. ఎడిటింగ్, క్యాస్టూమ్, సెట్ వర్క్, టెక్నికల్‌గా సినిమా హై స్టాండర్డ్‌లో ఉంటుంది. సన్ పిక్చర్స్ (Sun Pictures) ప్రొడక్షన్ వ్యాల్యూస్ అన్నీ బాగుంటాయి.
విశ్లేషణ :
ఫస్టాఫ్ మాత్రం కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలు, ఎమోషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. దిలీప్‌తో ఇంటర్వెల్ సీన్‌తో సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లి సెకండాఫ్‌పై అంచనాల పెంచాడు. ఇక సెకండాఫ్‌లో కల్పక్ ఫ్యామిలీని ఎంట్రీ ఇవ్వడంతో ముత్తువేల్తో ఆడించిన గేమ్ సినిమాకు హైలెట్. కాంత కల్పక్గా విద్యాబాలన్ పాత్రను రాసుకొన్న తీరు.. కథను ఆమె క్యారెక్టర్ ద్వారా నడిపించిన తీరుతో మరోసారి నెల్సన్ కేక పెట్టించాడు. సెకండాఫ్‌లో సూర్యతో కొడుకును ముత్తువేల్ చంపారని కుటుంబానికి చెప్పే సీన్ హృదయానికి హత్తుకొనేలా చేస్తుంది. ఇక కొడుకు విషయంలో ముత్తువేల్ చేసిన పనిని విద్యాబాలన్‌తో చెప్పించిన తీరు ఆ పాత్రను మరింత ఎత్తుకు ఎదిగేలా చేసింది. ఊహకందేలా సాగే కథనం, రొటీన్ కమర్షియల్ ఫార్మాట్లో తెరకెక్కించడం కాస్త మైనస్ అని చెప్పుకోవచ్చు. అయినా కూడా విజిల్స్ వేయించే మూమెంట్స్ ఉండటంతో ఎక్కడా కూడా బోర్ కొట్టదు. ఈ సారి కూడా బాక్సాఫీస్ వద్ద ఈ ముత్తువేల్ పాండ్యన్ రికార్డులు క్రియేట్ చేసేలానే ఉన్నాడు. జస్ట్ రజినీ ఆరా ని ఎక్స్‌పీరియెన్స్ చేయాలంటే సినిమా తప్పక చూడాల్సిందే!








