కవిత చదివి సుందర్ పిచాయ్ ఫుల్ హ్యాపీ.. ఏముందా కవితలో.. అంత ఆనందం ఎందుకు?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
గూగుల్ వంటి ప్రపంచ టెక్ దిగ్గజానికి సీఈఓగా ఉన్న వ్యక్తి.. వేల కోట్ల రూపాయల వ్యాపార నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉన్న సుందర్ పిచాయ్ ఓ చిన్న కవిత చదివి ఫుల్ హ్యాపీ అయ్యారు! ఆ కవితలో ఏదో గొప్ప సాహిత్యం ఉందనుకుంటే పొరపాటే. కేవలం మూడు పంక్తులే ఉన్నాయి. ప్రేమ గురించి లేదు.. ప్రకృతి అందాల గురించి లేదు.. మనుషుల భావోద్వేగాల ప్రస్తావనే లేదు. మరి అలాంటి కవిత చదివి సుందర్ పిచాయ్ ఎందుకంత ఆనందపడ్డారు? ఆ కవిత మేటర్ ఏమిటి
అంతరిక్షం నుంచి వచ్చిన ఆ మూడు పంక్తులు ఏమిటి?
గూగుల్ తాజాగా చేపట్టిన Project Suncatcherలో భాగంగా ఈ నెల ప్రారంభంలో ఓ ప్రయోగాత్మక శాటిలైట్‌ను అంతరిక్షంలోకి పంపించింది. ఇందులో నాలుగు ప్రత్యేకమైన Tensor Processing Units (TPUs)ను అమర్చింది. ఇవి ఏఐ వ్యవస్థలకు అవసరమైన క్లిష్టమైన లెక్కలను వేగంగా నిర్వహించడానికి గూగుల్ రూపొందించిన ప్రత్యేక చిప్స్. భూమిపై ఉన్న గూగుల్ డేటా సెంటర్లలోనూ వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు అదే టెక్నాలజీని అంతరిక్షంలోకి తీసుకెళ్లి పరీక్షిస్తోంది.
ఈ శాటిలైట్‌లో Gemma 4 అనే ఏఐ మోడల్‌ను కూడా ఏర్పాటు చేశారు. తాజాగా భూమి నుంచి దానికి ఓ ప్రాంప్ట్ పంపించారు. అంతరిక్షంలో జీవితం గురించి ఓ హైకూ కవిత రాయాలని అడిగారు. ఆ తర్వాత శాటిలైట్‌లోని ఏఐ తనంతట తానే మూడు పంక్తుల కవితను తయారు చేసింది. నార్వేలోని స్వాల్బార్డ్ ప్రాంతం మీదుగా శాటిలైట్ ప్రయాణిస్తున్న సమయంలో అక్కడి గ్రౌండ్ స్టేషన్‌కు ఆ కవిత చేరింది.
ఆ కవితలోని భావం ఇదీ..
Blue marble below
Data streams in silent grace
Starlight feeds my core.
అంటే.. కింద నీలి రంగులో కనిపిస్తున్న భూమి.. నిశ్శబ్దంగా ప్రవహిస్తున్న డేటా.. నక్షత్రాల వెలుగుతో నడుస్తున్న నా ఉనికి.. అనే భావనతో ఆ ఏఐ కవిత రాసింది. కవితలోని పదాల కంటే, దాన్ని రాసిన పరిస్థితులే ఇక్కడ అసలైన విశేషం.
సుందర్ పిచాయ్ ఎందుకంత సంతోషించారు?
ఓ ఏఐ మోడల్ కవిత రాయడం ఇప్పుడు పెద్ద విషయమేమీ కాదు. మన ఫోన్లోనే ఏఐని అడిగితే క్షణాల్లో కవితలు రాసిస్తుంది. మరి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ మూడు పంక్తుల కవితకు ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు? ఇక్కడే అసలు విషయం ఉంది.
ఇప్పటివరకు ఏఐ వ్యవస్థలు పనిచేయాలంటే భూమిపై ఉండే డేటా సెంటర్లు, భారీ కంప్యూటింగ్ వ్యవస్థలపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు భూమికి దూరంగా అంతరిక్షంలో తిరుగుతున్న శాటిలైట్లోనే ఏఐ మోడల్‌ను పనిచేయించి, దాని నుంచి సమాధానాన్ని తిరిగి భూమికి తీసుకురాగలిగారు. అంటే అంతరిక్షంలోనే ఏఐ కంప్యూటింగ్ సాధ్యమవుతుందనే దిశగా గూగుల్ కీలకమైన ముందడుగు వేసింది.
గూగుల్ ఈ విజయాన్ని ‘Hello World’ మైలురాయిగా అభివర్ణించింది. సాంకేతిక ప్రపంచంలో కొత్త ప్రోగ్రామ్ విజయవంతంగా పనిచేస్తున్నట్లు నిర్ధారించడానికి సాధారణంగా ఉపయోగించే పదమే Hello World. ఇప్పుడు అంతరిక్షంలో పనిచేస్తున్న డేటా సెంటర్ స్థాయి TPU నుంచి తొలి ఏఐ స్పందన రావడంతో గూగుల్ ఈ పదాన్ని ఉపయోగించింది. అందుకే సుందర్ పిచాయ్‌కు ఈ చిన్న కవిత అంత ప్రత్యేకంగా మారింది.
భూమిపై డేటా సెంటర్లు ఉండగా.. అంతరిక్షంలో ఎందుకు?
ఇక్కడే గూగుల్ అసలు ప్లాన్ ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పుడు ఏఐ వినియోగం పెరుగుతున్న కొద్దీ దానికి అవసరమైన కంప్యూటింగ్ పవర్ కూడా విపరీతంగా పెరుగుతోంది. చాట్‌జీపీటీ, జెమినీ వంటి ఏఐ సేవలు పనిచేయడానికి భారీ సంఖ్యలో కంప్యూటర్ చిప్స్ నిరంతరం పనిచేయాలి. వీటి కోసం గూగుల్ వంటి కంపెనీలు భారీ డేటా సెంటర్లను నిర్మిస్తున్నాయి.
అయితే ఈ డేటా సెంటర్లను నిర్వహించడం అంత సులభం కాదు. వేలాది చిప్స్ నిరంతరం పనిచేయడంతో విపరీతమైన వేడి పుడుతుంది. వాటిని చల్లబరచడానికి ప్రత్యేక కూలింగ్ వ్యవస్థలు అవసరం. వీటిని నడపడానికి భారీగా విద్యుత్ ఖర్చవుతుంది. ఏఐ వినియోగం పెరిగే కొద్దీ ఈ అవసరాలు కూడా పెరుగుతున్నాయి. అందుకే భూమిపై డేటా సెంటర్లపై ఆధారపడకుండా మరో మార్గం వెతుకుతోంది గూగుల్.
అంతరిక్షంలో సూర్యరశ్మి నుంచి సౌరశక్తిని ఉపయోగించుకునే అవకాశం ఉంది. అక్కడ ప్రత్యేకమైన శాటిలైట్లను ఏర్పాటు చేసి, వాటిలో ఏఐ చిప్స్ అమర్చి, వాటన్నింటినీ ఒకదానితో మరొకటి అనుసంధానించగలిగితే భారీ కంప్యూటింగ్ పనులను అంతరిక్షంలోనే నిర్వహించవచ్చనేది గూగుల్ ఆలోచన. అంటే భవిష్యత్తులో ఏఐ కోసం భూమిపై భారీ డేటా సెంటర్లను నిర్మించడానికి బదులుగా అంతరిక్షంలోనే అలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయగలమా అని పరిశోధిస్తోంది.
15 నిమిషాలే పనిచేస్తున్న ఏఐ.. ఇంకా చాలా సవాళ్లున్నాయి!
అయితే ఇప్పుడే గూగుల్ అంతరిక్షంలో పూర్తిస్థాయి ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేసిందని అనుకోవద్దు. ప్రస్తుత ప్రయోగం చాలా పరిమితమైనది. శాటిలైట్‌లోని చిప్స్ వేడిని నియంత్రించడంలో ఉన్న పరిమితుల కారణంగా ఏఐ మోడల్‌ను సుమారు 15 నిమిషాల పాటు మాత్రమే పనిచేయించగలుగుతున్నారు. ప్రస్తుతం సాధారణమైన చిన్న చిన్న పనులనే చేయగలుగుతోంది.
ఇంకో పెద్ద సమస్య రేడియేషన్. అంతరిక్షంలో ఉండే అధిక శక్తి కలిగిన కణాలు కంప్యూటర్ చిప్స్‌లోని సమాచారాన్ని దెబ్బతీయవచ్చు. దీన్నే Bit Flip అంటారు. కంప్యూటర్లోని 0, 1 విలువలు అనుకోకుండా మారిపోతే డేటాలో తప్పులు వస్తాయి. అందుకే గూగుల్ తదుపరి ప్రయోగాల్లో చిప్స్‌పై రేడియేషన్ ప్రభావాన్ని, తీవ్రమైన ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్థ్యాన్ని పరీక్షించనుంది.
2027లో రెండు శాటిలైట్లు.. గూగుల్ తదుపరి లక్ష్యం!
ప్రస్తుతం ఒక శాటిలైట్‌తో ప్రయోగం చేసిన గూగుల్.. 2027లో ఒకదానితో మరొకటి అనుసంధానమయ్యే రెండు శాటిలైట్లను పరీక్షించాలని ప్రణాళికలు రూపొందించింది. ఈ రెండూ పరస్పరం సమాచారాన్ని మార్పిడి చేసుకుంటూ కంప్యూటింగ్ పనులను నిర్వహించగలవా అనేది పరిశీలించనుంది.
ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో అనేక శాటిలైట్లను ఒక నెట్వర్క్లా అనుసంధానించి, అంతరిక్షంలోనే భారీ ఏఐ కంప్యూటింగ్ వ్యవస్థలను నిర్మించే అవకాశం ఉంటుంది. అయితే దానికి ఇంకా సాంకేతికంగా ఎన్నో అడ్డంకులు దాటాల్సి ఉంది.
మొత్తానికి సుందర్ పిచాయ్‌ను సంతోషపెట్టింది ఆ కవితలోని సాహిత్యం కాదు.. ఆ కవిత పుట్టిన ప్రదేశం! భూమిపై ఉన్న కంప్యూటర్లో కాకుండా అంతరిక్షంలో తిరుగుతున్న శాటిలైట్‌లో ఏఐ పనిచేసి సమాధానం పంపించడం గూగుల్‌కు అసలైన విజయం. ఇప్పుడు ఆ మూడు పంక్తుల కవితతో మొదలైన ప్రయోగం రేపు అంతరిక్షంలోనే ఏఐ డేటా సెంటర్ల నిర్మాణానికి దారితీస్తుందేమో చూడాలి!








