అమిత్ షా ‘మహా పాదయాత్ర’ వ్యూహామిదే!
ఎన్నికల కమిషన్ ను టార్గెట్ చేస్తూ ఇండియా కూటమి దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ వాటిపై పెద్దగా దృష్టి పెట్టని బీజేపీ, ఇప్పుడు రివర్స్ ఎటాక్ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఆ క్రమంలోనే హైదరాబాద్ లో నవంబర్ 2న మహా పాదయాత్ర చేపడుతోంది. ఇందులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా పాల్గొంటుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
నవంబర్ 2 మధ్యాహ్నం 3:00 గంటలకు బషీర్బాగ్లోని నిజాం కాలేజ్ సమీపంలో ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఈ మహా పాదయాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి ఈ యాత్ర నగరంలోని ప్రధాన మార్గాల గుండా సాగుతూ మొజంజాహీ మార్కెట్ చౌరస్తా వద్ద ముగియనుంది. ఈ ముగింపు సభలో అమిత్ షా పార్టీ శ్రేణులను, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కేవలం రాజకీయ నేతలు మాత్రమే కాకుండా, సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన నిపుణులు, వైద్యులు, న్యాయవాదులు, మేధావులు ఈ యాత్రలో పెద్ద ఎత్తున భాగస్వాములయ్యేలా బీజేపీ వ్యూహరచన చేసింది.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలపై, ముఖ్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ జాబితాల అంశంపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే ప్రధాన లక్ష్యంగా ఈ మహా పాదయాత్రను చేపడుతున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచందర్ రావు వెల్లడించారు. ప్రతిపక్షాలు కావాలనే తప్పుడు సమాచారంతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయని, దీనివల్ల సమాజంలో అరాచకం సృష్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ అబద్ధపు ప్రచారాన్ని ఎండగట్టడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి అజెండాను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం సాగనుంది.
హైదరాబాద్ కేంద్రంగా అమిత్ షా పర్యటన, మహా పాదయాత్ర కేవలం ఒక నిరసన ప్రదర్శన మాత్రమే కాదని, రాబోయే స్థానిక సంస్థలు, ఇతర ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేడర్లో జోష్ నింపేందుకు వేస్తున్న బలమైన అడుగుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటర్ జాబితాల సవరణ వంటి సున్నితమైన అంశాలను ప్రత్యర్థులు రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్న వేళ, నేరుగా ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలను వివరించాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. విద్యావంతులు, మేధావులను భాగస్వామ్యం చేయడం ద్వారా ఈ యాత్రకు మేధోపరమైన మద్దతును కూడగట్టాలని బీజేపీ వ్యూహం రచిస్తోంది. మొత్తానికి.. నవంబర్ 2న జరగనున్న ఈ మహా పాదయాత్ర తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.








