మియాపూర్ భూ వివాదం.. మైలేజ్ కోసం ఎత్తులు పైఎత్తులు!
తెలంగాణ రాజకీయాల్లో మయాపూర్ భూముల వివాదం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. సుమారు 60,000 కోట్ల రూపాయల విలువైన 550 ఎకరాల మయాపూర్ భూములపై ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇదిప్పుడు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. ఈ భూముల అంశాన్ని రెండు పార్టీలూ ఆధిపత్య పోరుకు, క్రెడిట్ వార్‌కు ప్రధాన అస్త్రంగా మలుచుకుంటున్నాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఈ భూములపై న్యాయపోరాటం జరిగిందని మాజీ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్ వాదనల ఫలితంగానే సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు వచ్చిందని ఆయన చెప్తున్నారు. 2015 నుంచి 2023 వరకు తమ ప్రభుత్వం పట్టువీడకుండా ఈ కేసును నడిపించిందని, రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడింది తామేనని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. కానీ, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూములను మానిటైజ్ చేసి, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు రియల్ ఎస్టేట్ ఏజెన్సీలా వ్యవహరిస్తోందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.
మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వాదనలను తీవ్రంగా తిప్పికొట్టారు. గత పాలకులు కేవలం మయాపూర్ మాత్రమే కాకుండా, మంచిరేవులలో రూ. 10,000 కోట్ల విలువైన 143 ఎకరాలు, భూపాలపల్లిలో రూ. 400 కోట్ల విలువైన 106 ఎకరాల అటవీ భూములను అన్యాక్రాంతం చేసేందుకు ప్రయత్నించారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కొత్తగూడలో మరో 600 ఎకరాలను ఆక్రమించేందుకు కేసీఆర్, ఆయన అనుచరులు యత్నించారని సీఎం మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో చట్టపరమైన రక్షణ కల్పించడంలో వైఫల్యం చెందారని, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును తమ ఖాతాలో వేసుకునేందుకు అనవసర డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.
ఈ భూ వివాదం ఇప్పుడు కేవలం ఆస్తుల పరిరక్షణ పరిధి దాటి, పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం పావులు కదుపుతున్న అంశంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో విలువైన ప్రభుత్వ భూములను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ అంటుంటే, తాము కాపాడుకుంటూ వచ్చిన భూములను ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు పరస్పరం అవినీతి ఆరోపణలు, ల్యాండ్ గ్రాబింగ్ విమర్శలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. ప్రజాధనం, ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో సాగుతున్న ఈ రాజకీయం రాబోయే రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.








