Tyson Review: బాక్సింగ్ లెజెండ్ వెనుక ఇంత చీకటి కథ ఉందా?
బాక్సింగ్ రింగ్‌లోకి దిగారంటే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే మైక్ టైసన్.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో వివాదాలు, విషాదాలతో పోరాడిన సంగతి తెలిసిందే. ప్రపంచాన్ని తన పంచ్‌లతో ఊపేసిన ఈ మాజీ హెవీవెయిట్ ఛాంపియన్ కథను ఇప్పటికే ఎన్నో సార్లు అనేక మాధ్యమాల్లో వింటూ, చూస్తూ తెలుసుకుంటూ వచ్చాం. అయితే తాజాగా నెట్‌ఫ్లిక్స్ ‘టైసన్’ పేరుతో నాలుగు ఎపిసోడ్ల డాక్యుసిరీస్గా మన ముందుకు తెచ్చింది. మరి ఈ సిరీస్ మనకి ఒక కొత్త అనుభూతిని ఇస్తుందా? లేక ఇప్పటికే అందరికీ తెలిసిన కథనే మళ్లీ చెబుతుందా?
కథేంటి?
మైక్ టైసన్ జీవితాన్ని ఆయన స్వయంగా చెప్పే అనుభవాలు, పాత వీడియోలు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచర బాక్సర్ల ఇంటర్వ్యూలతో ఈ డాక్యుసిరీస్ రూపొందించారు. దర్శకుడు ఫ్లాయిడ్ రస్ కథను నాలుగు భాగాలుగా విభజించారు. ప్రతి ఎపిసోడ్ టైసన్ జీవితంలోని కీలకమైన మలుపును పరిచయం చేస్తుంది.
మొదటి ఎపిసోడ్ – Power:
న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో పేదరికం, హింస మధ్య గడిచిన టైసన్ బాల్యంతో కథ మొదలవుతుంది. చిన్న వయసులోనే ఆయన అనేక సార్లు నేరాలకు సంబంధించిన కేసుల్లో చిక్కుకుంటారు. బాలనేరస్థుల కేంద్రానికి వెళ్లిన సమయంలో బాక్సింగ్‌లోని తన ప్రతిభను గుర్తిస్తారు. అక్కడి నుంచి ప్రముఖ శిక్షకుడు కస్ డి’అమాటో పరిచయం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కస్ కేవలం శిక్షకుడిగానే కాకుండా, టైసన్‌కు తండ్రిలాంటి వ్యక్తిగా మారతారు. క్రమశిక్షణ, శిక్షణతో టైసన్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతారు. 1986లో, కేవలం 20 ఏళ్ల వయసులోనే ట్రెవర్ బెర్బిక్ను ఓడించి ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్‌గా నిలవడంతో ఈ ప్రయాణం చారిత్రాత్మక విజయాన్ని అందుకుంటుంది.
రెండో ఎపిసోడ్ – Greed:
ఛాంపియన్‌గా ఎదిగిన తర్వాత టైసన్ జీవితం మరో మలుపు తిరుగుతుంది. భారీ ఆదాయం, ప్రపంచవ్యాప్త గుర్తింపు, వ్యక్తిగత సంబంధాలు.. ఇవన్నీ ఆయన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. నటి రాబిన్ గివెన్స్‌తో వివాహం, ఆ బంధంలో ఎదురైన సమస్యలు, ప్రమోటర్లతో విభేదాలు, వ్యక్తిగత అలవాట్లు ఆయన బాక్సింగ్ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపించాయో ఈ భాగం వివరిస్తుంది. 1990లో బస్టర్ డగ్లస్ చేతిలో టైసన్ ఎదుర్కొన్న అనూహ్య ఓటమి ఆయన అజేయుడనే ఇమేజ్ను దెబ్బతీస్తుంది. విజయాల శిఖరంపై ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఎలా కిందకు పడిపోయాడో ఈ ఎపిసోడ్ చూపిస్తుంది.
మూడో ఎపిసోడ్ – Trust:
ఓటమి తర్వాత తిరిగి తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని టైసన్ ప్రయత్నిస్తారు. అయితే, ఆయన వ్యక్తిగత జీవితంలోని వివాదాలు మరింత తీవ్రమవుతాయి. డిజైరీ వాషింగ్టన్ చేసిన అత్యాచారం ఆరోపణల కేసులో 1992లో టైసన్ దోషిగా తేలి జైలు శిక్షకు గురవుతారు. టైసన్ ఈ ఆరోపణను ఇప్పటికీ ఖండిస్తున్నారు. ఈ కేసు ఆయన కెరీర్‌ను, ప్రజల్లో ఆయనకున్న ప్రతిష్ఠను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. జైలు జీవితం, కోల్పోయిన అవకాశాలు, తిరిగి బాక్సింగ్‌లో తన స్థానాన్ని సంపాదించుకోవాలనే తపన ఈ భాగంలో కీలకంగా నిలుస్తాయి.
నాలుగో ఎపిసోడ్ – Human:
జైలు నుంచి విడుదలైన తర్వాత టైసన్ మళ్లీ బాక్సింగ్‌లోకి అడుగుపెట్టి తన కెరీర్‌ను పునర్నిర్మించుకునే ప్రయత్నం చేస్తారు. 1996లో ఇవాండర్ హోలీఫీల్డ్ చేతిలో ఓడిపోయిన తర్వాత, 1997లో జరిగిన రీమ్యాచ్‌లో హోలీఫీల్డ్ చెవిని కొరికిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ సంఘటన టైసన్ కెరీర్లో అత్యంత వివాదాస్పద ఘట్టంగా మిగిలిపోతుంది. ఆ తర్వాత బాక్సింగ్‌కు దూరమవడం, ఆర్థిక సమస్యలు, వ్యసనాలతో పోరాటం, కుటుంబంలో ఎదురైన విషాదాలు.. వీటన్నింటి మధ్య తన జీవితాన్ని తిరిగి చక్కదిద్దుకునే ప్రయత్నాలను ఈ ఎపిసోడ్ చూపిస్తుంది. వయసు పెరిగిన తర్వాత తన గతాన్ని వెనక్కి తిరిగి చూసుకునే టైసన్ ఆలోచనలు కూడా ఇందులో భాగమవుతాయి.
డాక్యుసిరీస్ ఎలా ఉందంటే?
ఈ సిరీస్‌కు అసలైన ఆకర్షణ మైక్ టైసన్ వ్యక్తిత్వమే. ఒక క్షణంలో నవ్వుతూ సరదాగా మాట్లాడే ఆయన, మరుక్షణంలోనే తీవ్ర భావోద్వేగానికి గురవుతారు. తన జీవితంలో జరిగిన విషయాలను ఓపెన్‌గా చెబుతూనే, నచ్చని ప్రశ్నలు ఎదురైనప్పుడు చాలా చాకచక్యంగా దాటవేస్తారు. కొన్ని సన్నివేశాల్లో అయితే దర్శకుడికే ‘ఇది కాదు, వేరే ప్రశ్న అడుగు’ అని సూచించడం ఆయనలోని ముక్కుసూటితనాన్ని చూపిస్తుంది.
అయితే, టైసన్ జీవితం గురించి ఇప్పటికే చాలామందికి తెలిసి ఉండటంతో ఈ సిరీస్‌లో కొత్తగా తెలిసే విషయాలు పెద్దగా ఏమీ కనిపించవు. కాకపోతే టైసన్ స్వయంగా ఇచ్చిన ఇంటర్వ్యూలు, కుటుంబ సభ్యుల మాటలు, పాత బాక్సింగ్ వీడియోలు కొంత ఆసక్తిని కలిగిస్తాయి. ముఖ్యంగా బస్టర్ డగ్లస్, లెన్నాక్స్ లూయిస్ వంటి బాక్సర్లతో సాగే సంభాషణలు చాలా బాగున్నాయి. తండ్రితో తమకు ఉన్న అనుబంధంలోని మంచి చెడులను ఆయన పిల్లలు పంచుకోవడం మనసును తాకుతుంది. ఆయన మాజీ మేనేజర్ రోరీ హాలోవే చెప్పిన విషయాలు టైసన్ జీవితంలో మరో కోణాన్ని పరిచయం చేస్తాయి.
అయితే, దర్శకుడు కథను సాదాసీదాగా ఒక క్రమబద్ధమైన పద్ధతిలోనే నడిపించడంతో కథనంలో పెద్దగా కొత్తదనం అనిపించదు. ఎక్కువ భాగం పాత వీడియోలు, సాధారణ ఇంటర్వ్యూలతోనే సరిపెట్టేశారు. టైసన్ జీవితాన్ని అప్పటి అమెరికా సామాజిక పరిస్థితులు, జాతి వివక్ష, క్రీడా సంస్కృతితో ముడిపెట్టి మరింత లోతుగా విశ్లేషించి ఉంటే బాగుండేది. ఆ ప్రయత్నం ఇక్కడ పూర్తిస్థాయిలో జరగలేదనిపిస్తుంది.
వివాదాల విషయంలో అసంపూర్ణత!
టైసన్ జీవితంలోని వివాదాస్పద అంశాలను సిరీస్‌లో చూపించినప్పటికీ, చాలా చోట్ల కేవలం టైసన్ వర్షన్ వివరణకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా అత్యాచారం కేసుకు సంబంధించిన అంశాల్లో అవతలి పక్షం వాదనలకు తగిన స్థానం దక్కలేదనే భావన కలుగుతుంది. దీనివల్ల టైసన్ జీవితాన్ని అన్ని కోణాల్లో సమగ్రంగా విశ్లేషించే డాక్యుమెంటరీగా ఇది నిలవలేకపోయింది. టైసన్ వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూపించడంలో సక్సెస్ అయిన దర్శకుడు, వివాదాల వెనుక ఉన్న అసలు నిజాలను లోతుగా తవ్వడంలో మాత్రం కొద్దిగా వెనకబడ్డారనే చెప్పాలి.
ప్లస్‌లు:
మైక్ టైసన్ వ్యక్తిత్వంలోని రకరకాల విభిన్న కోణాలు
అరుదైన పాత బాక్సింగ్ ఫుటేజ్, ఆసక్తికరమైన ఇంటర్వ్యూలు
కుటుంబ సభ్యులు, తోటి బాక్సర్లు పంచుకున్న నిజమైన అనుభవాలు
ఒకే కథనంలో టైసన్ విజయాలను, ఆయన జీవితంలోని విషాదాలను చూపించడం
మైనస్‌లు:
ఇప్పటికే అందరికీ తెలిసిన విషయాలనే మళ్లీ మళ్లీ చెప్పడం
సాదాసీదా కథనం, దర్శకత్వంలో పెద్దగా కొత్తదనం లేకపోవడం
వివాదాస్పద అంశాలపై లోతైన, నిష్పాక్షిక విశ్లేషణ లోపించడం
నాలుగు ఎపిసోడ్ల నిడివికి సరిపడా కొత్త సమాచారం లేకపోవడం
ఫైనల్ గా…:
రింగ్‌లో మైక్ టైసన్ ఎంత శక్తిమంతుడైన ప్రత్యర్థో, తన జీవిత కథను చెప్పేటప్పుడు అంతే సంక్లిష్టమైన వ్యక్తి. ఆయనలోని భావోద్వేగాలు, బలహీనతలు, విజయాలు, వివాదాలను దగ్గరగా చూడాలనుకునేవారికి ఈ డాక్యుసిరీస్ కొంతవరకు ఆకట్టుకుంటుంది. అయితే, టైసన్ గురించి ఇప్పటికే పూర్తిగా తెలిసినవారికి మాత్రం ఇది పెద్దగా కొత్త అనుభూతిని ఇవ్వదు. ఆయన జీవితంపై ప్రత్యేక ఆసక్తి ఉన్నవారు ఒకసారి చూడొచ్చు. కానీ ఒక పూర్తిస్థాయి విశ్లేషణాత్మక డాక్యుమెంటరీని ఆశించి చూస్తే మాత్రం కాస్త నిరాశ చెందే అవకాశం ఉంది.
ఎక్కడ చూడవచ్చు?
నెట్‌ఫ్లిక్స్ లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








