ప్రజలు ఆందోళన చెందవద్దు.. సరిపడా నిలువలు ఉన్నాయి : మంత్రి ఉత్తమ్
తెలంగాణ రాష్ట్రంలో బియ్యం ధరల పెరుగుదలను అరికట్టేందుకు, పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. మార్కెట్లో బియ్యం కొరత సృష్టించి, అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు ఉంటాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సాధారణంగా ప్రజలు ఎక్కువగా వినియోగించే బీపీటీ రకం బియ్యం ధరను కిలో రూ.66 ఉండేలా చూడటానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. పౌరసరఫరాల ఉన్నతాధికారులు, వ్యాపారులు, రైస్ మిల్లర్లతో సమీక్ష జరిపిన మంత్రి, పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర (Stephen Ravindra), డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ ( Shyam Prasad Lal) అమలు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ చర్యలను పరిశీలించారు.
హైదరాబాద్ ( Hyderabad), రంగారెడ్డి (Ranga Reddy), మేడ్చల్ జిల్లాల్లోని ప్రధాన మార్కెట్లలో నిర్వహించిన దాడుల్లో అక్రమ నిల్వలు, అధిక ధరలకు అమ్మడం వంటి ఉల్లంఘనలపై ఇప్పటివరకు 12 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్లో ధరలు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో బియ్యం నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. ధరలు పెరుగుతాయనే భయంతో అవసరానికి మించి కొనుగోలు చేయవద్దని సూచించారు.








