ఓట్లవేటలో అమెరికన్ నేతలు.. ఓటర్ల ప్రసన్నానికి పాట్లు..!
ఎన్నికలు.. ఎన్నికలే..ఏదేశంలోనైనా ఎన్నికల సమయంలో ఓటరు మహాశయుడే రారాజు. ఆయనను ప్రసన్నం చేసుకుని ఓటు పట్టేందుకు నేతలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇదే సీన్.. ఇప్పుడు అమెరికా మధ్యంతర ఎన్నికల్లోనూ సాక్షాత్కారమవుతోంది. ముఖ్యంగా భారత ఓటర్లను ఆకట్టుకునేందుకు డెమొక్రాట్ అభ్యర్థులు.. ఆలయాల సందర్శనతోపాటు వారికి అలవాటైన, ఇష్టమైన పనులు చేసి.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
నవంబర్ 3వ తేదీన అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల ముందస్తు ఓటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓటర్లను, మరీ ముఖ్యంగా భారతీయ అమెరికన్లను (Indian Americans) ఆకట్టుకునేందుకు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జేమ్స్ తలారికో.. డాలస్ శివారు ప్రాంతమైన ఇర్వింగ్లో ఒక ఇండియన్ రెస్టారంట్లో దోశలు వేశారు (Dishing Dosas). బంగాళదుంప కూరతో స్టంఫింగ్ చేసి, అరటి ఆకు పరిచిన పళ్లెంలో వడ్డించడంతో.. అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టారు. ఇర్వింగ్లో భారత అమెరికన్ల జనాభా ఎక్కువే.
ఇక, యూఎస్ సెనెటర్ కోరీ బ్రూకర్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. మరోసారి గవర్నర్ పదవికి పోటీ చేస్తోన్న కనెక్టికట్ గవర్నర్ నెడ్ లామోంట్ కూడా ఈ పండగ వేడుకలకు హాజరయ్యారు. ఇంకొందరు అగ్రరాజ్య నేతలు బాప్స్ స్వామినారాయణ్, అక్షర్ధామ్ వంటి ఆలయాలను సందర్శిస్తున్నారు. ఎన్నికల్లో ఒక్క ఓటుతోనే గెలుపోటములు మారిపోయే అవకాశం ఉండటంతో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఏ ప్రయత్నాలనూ వదలట్లేదు.
ఈ మధ్యంతర ఎన్నికల్లో (US Midterm) అధికార రిపబ్లికన్ పార్టీకి ప్రతికూల పవనాలే వీస్తున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి. ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థపై ఓటర్లలో ఉన్న ఆందోళనలు ఈ సారి ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయి. అయితే ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఏ పార్టీ దగ్గరా స్పష్టమైన ప్రణాళిక లేదని అమెరికన్లు భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి భారీ ఎన్నికల ప్రభంజనం (ఎలక్టోరల్ వేవ్) కనిపించడం లేదని పలు సర్వేలు అంచనా వేశాయి.








