తెలంగాణలో ఉచిత బస్సు పథకం సూపర్ సక్సెస్!
తెలంగాణలో మహిళలకు ఉచిత రవాణా స్కీం అమలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ‘మహాలక్ష్మి’ పేరిట అమలు చేస్తున్న ఈ ఉచిత బస్సు పథకం, మహిళల జీవితాల్లో ఆర్థిక భద్రతను, సామాజిక సాధికారతను పెంపొందిస్తున్నట్లు తాజా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. డిసెంబర్ 2023లో ప్రారంభమైన ఈ పథకం, కేవలం ప్రయాణ ఖర్చులను తగ్గించడమే కాకుండా మహిళల జీవన ప్రమాణాలను, ప్రయాణపు అలవాట్లను పూర్తిగా మార్చివేసిందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
విజయవాడ, న్యూఢిల్లీకి చెందిన స్కూల్స్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సమగ్ర అధ్యయనం నిర్వహించారు. దీని ప్రకారం ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం వల్ల మహిళల సగటు ప్రయాణ ఖర్చు ఏకంగా 68.1 శాతం తగ్గిందని తేలింది. అంతకుముందు ప్రయాణాల కోసం గణనీయమైన మొత్తాన్ని వెచ్చించిన మహిళలు, ఇప్పుడు ఆ మొత్తాన్ని తమ కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, ఆరోగ్య రక్షణ కోసం వెచ్చిస్తున్నారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత టీజీఎస్ఆర్టీసీ బస్సులపై మహిళలు ఆధారపడటం భారీగా పెరిగింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల వాటా గతంలో సుమారు 43.8 శాతం ఉండగా, అది ఇప్పుడు 71.2 శాతానికి ఎగబాకింది. అలాగే ఈ పథకం పుణ్యమా అని మహిళల సగటు ప్రయాణ దూరం 7.5 కి.మీ నుండి 8 కి.మీకి పెరిగింది.
ఉచిత ప్రయాణ సౌలభ్యం కేవలం ఆఫీసులు లేదా కాలేజీలకే పరిమితం కాలేదు. మహిళల వ్యక్తిగత, సామాజిక జీవన శైలిపై కూడా ఇది సానుకూల ప్రభావం చూపిస్తున్నట్టు అధ్యయనం తేల్చింది. బంధువుల ఇళ్లకు వెళ్లడం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి ప్రయాణాలు సుమారు 22.8 శాతం మేర పెరిగాయి. ఆసుపత్రులు, వైద్య సేవల కోసం చేసే ప్రయాణాలు 15.5 శాతం పెరిగినట్లు అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. దీనివల్ల మహిళలు చిన్నపాటి ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యం పొందగలుగుతున్నారు. వివిధ ఆదాయ వర్గాలను పరిశీలిస్తే, నెలకు రూ. 20,000 లోపు ఆదాయం ఉన్న కుటుంబాల మహిళల ప్రయాణ ఖర్చులు సుమారు 73 శాతం వరకు తగ్గాయి. స్టడీ ప్రకారం విద్యార్థులు, నిరుద్యోగ మహిళలు, గృహిణులు ఈ పథకం ద్వారా అత్యధిక లబ్ది పొందుతున్నారు.
మహాలక్ష్మి పథకం అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మరిన్ని మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు, మురికివాడలకు అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రద్దీ వేళల్లో మరిన్ని బస్సులను అందుబాటులోకి తేవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా, రాత్రి వేళల్లో మహిళల భద్రత కోసం బస్ స్టాప్‌లలో లైటింగ్ సౌకర్యం, సీసీ కెమెరాలు, మహిళా కండక్టర్ల సేవలను మరింత పటిష్టం చేయడం ద్వారా ఈ పథకం ఫలాలు ప్రతి మహిళకు మరింత సురక్షితంగా అందుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.








