ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుపై కొత్త ఎఫ్ఐఆర్!
తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. విచారణలో భాగంగా హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో గతంలో నమోదైన కేసు ఇప్పుడు సిద్దిపేటకు బదిలీ అయింది. సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఇందులో బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావును ఏ1గా పేర్కొనడం కలకలం రేపుతోంది.
2023 ఎన్నికల సమయంలో తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారంటూ చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి డిసెంబర్ 1, 2024న పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. అప్పట్లో దీనిపై కేసు నమోదైంది. తాజాగా ఈ కేసును స్థానిక విచారణ నిమిత్తం సిద్దిపేట పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. అయితే పాత ఎఫ్ఐఆర్తో పోలిస్తే తాజా రికార్డులో సెక్షన్ల పరిధిని గణనీయంగా పెంచారు. కేవలం నిఘా కోణమే కాకుండా, మోసం, డిజిటల్ దుర్వినియోగానికి సంబంధించిన తీవ్రమైన సెక్షన్లను పోలీసులు పొందుపరిచారు.
కొత్త ఎఫ్ఐఆర్లో వంచన, మోసం, నేరపూరిత ఫోర్జరీ, విశ్వాసద్రోహంతో పాటు, ఐటీ చట్టంలోని సెక్షన్ 66సి, 66డి లను అదనంగా చేర్చారు. ఈ కేసులో ఏ1గా హరీశ్ రావు పేరు ఉండగా, ఏ2గా మాజీ డీసీపీ రాధాకిషన్ రావును చేర్చినట్లు సమాచారం. గతంలోనూ ఈ కేసు చుట్టూ అనేక న్యాయపరమైన పోరాటాలు జరగాయి. ఇప్పుడు సిద్దిపేట కేంద్రంగా విచారణ ప్రారంభం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ పరిణామం రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ నాయకులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని.., అక్రమ కేసులను తెరపైకి తెస్తున్నారని మండిపడుతోంది. అసెంబ్లీ ఎన్నికల నాటి ఘటనలను ప్రస్తావిస్తూ మూడేళ్ల తర్వాత మళ్లీ ఈ కేసును కొత్త ప్రాంతానికి మార్చి తీవ్రమైన సెక్షన్లు మోపడం వెనుక రాజకీయ ప్రేరేపిత ఉద్దేశాలు ఉన్నాయని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
మరోవైపు నిఘా వ్యవస్థలను దుర్వినియోగం చేసి ప్రత్యర్థుల వ్యక్తిగత గోప్యతను భగ్నం చేశారన్న ఆరోపణలను నిరూపించేందుకు దర్యాప్తు సంస్థలు ఈ కేసును లోతుగా పరిశీలిస్తున్నాయి. స్థానిక రాజకీయాలకు కేంద్రమైన సిద్దిపేటలో ఈ కేసు నమోదు కావడంతో, రాబోయే రోజుల్లో ఇది తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. న్యాయస్థానాలు ఈ కేసును ఏ విధంగా పరిశీలిస్తాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.








