ఎమ్మెల్సీ పోరులో కవిత పార్టీ.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని అందరూ భావించారు. అయితే ఈ పోరులోకి… కవిత నేతృత్వంలోని తెలంగాణ రక్షణ సేన కూడా అడుగుపెట్టడం సరికొత్త సమీకరణాలకు తెరలేపింది. వరంగల్- ఖమ్మం- నల్గొండ, హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి కవిత సంచలనం రేపారు. దీంతో కవిత పార్టీ పోటీ ఎవరికి లాభం చేకూరుస్తుంది.. ఎవరికి నష్టం చేకూరుస్తుంది.. అనే అంచనాలు మొదలయ్యాయి.
రెండు కీలక గ్రాడ్యుయేట్ స్థానాల్లోనూ బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను కవిత బరిలోకి నిలిపారు. వరంగల్- ఖమ్మం- నల్గొండ స్థానానికి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్, హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ స్థానానికి ఆకాష్ కొల్లూరును బరిలోకి దించుతున్నట్టు కవిత వెల్లడించారు. మరోవైపు, అధికార కాంగ్రెస్ పార్టీ ఈ రెండు స్థానాలనూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను ఖరారు చేసింది. సామాజిక న్యాయం, పట్టభద్రుల సమస్యలు, నిరుద్యోగం అంశాలను కవిత ప్రధాన అజెండాగా మలుచుకుంటున్నారు.
దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, ‘సామాజిక న్యాయం’ అనే బలమైన అస్త్రాన్ని కవిత లేవనెత్తుతున్నారు. రెండు సీట్లను అగ్రకులాలకే కేటాయించడం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభ్యర్థుల వ్యక్తిగత పరిచయాలు, అధికార యంత్రాంగం అండ వంటివి కాంగ్రెస్కు అదనపు బలాన్ని ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
బీఆర్ఎస్ ను వీడి సొంత కుంపటి పెట్టుకున్న కవిత ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం బీఆర్ఎస్ను అత్యంత కలవరపెడుతున్న అంశం. ఒకప్పుడు బీఆర్ఎస్కు వెన్నెముకగా నిలిచిన యువత, పట్టభద్రులు, ఉద్యోగ వర్గాల్లో కవితకు ఇప్పటికీ కొంత పట్టు ఉంది. ఒకవేళ ఆమె పార్టీ ఆ వర్గాల ఓట్లను చీల్చడంలో విజయవంతమైతే, అది నేరుగా బీఆర్ఎస్ సంప్రదాయ ఓటు బ్యాంకుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ఉనికిని చాటుకోవడానికి కవిత గట్టిగా ట్రై చేస్తున్నారు. ఇది సక్సెస్ అయితే, భవిష్యత్తులో బీఆర్ఎస్ కు మరిన్ని ఇబ్బందులు తప్పవనే ఆందోళన ఆ పార్టీ వర్గాల్లో ఉంది.
అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా కవిత పార్టీ తన సత్తా ఏంటో తెలుసుకునేందుకు వీలవుతుంది. అభ్యర్థులు గెలిచేంత సీన్ లేకపోయినా, ఎంతోకొంత శాతం ఓట్లను పొందవచ్చు. తద్వారా తదుపరి పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది. ప్రధాన పార్టీల విధానాలపై అసంతృప్తిగా ఉన్న తటస్థ ఓటర్లకు ఇదొక కొత్త ప్రత్యామ్నాయంగా కనిపించవచ్చు. ఇక కవిత పార్టీ చీల్చే ఓట్లు ప్రధానంగా బీఆర్ఎస్ కు నష్టం కలిగించే అవకాశాలున్నాయి. అదే సమయంలో బీసీ క్యాండిడేట్లను బరిలోకి దించడంతో, కాంగ్రెస్ పార్టీని అభిమానించే బీసీ వర్గాలు.. ఇటువైపు మళ్లే అవకాశాలున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి కూడా ఇబ్బందికరమే.








