ఉత్తర తెలంగాణపై కేటీఆర్ ఫోకస్!
అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టేందుకు, రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉత్తర తెలంగాణ కేంద్రంగా భారీ బహిరంగ సభలు, రైతు గర్జన సదస్సులకు శ్రీకారం చుట్టారు. ఈ నెలలోనే కేటీఆర్ నాలుగు కీలక జిల్లాల్లో పర్యటనలకు ప్లాన్ సిద్ధం చేశారు.
ఉత్తర తెలంగాణలోని అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో రైతు గర్జన సభలు నిర్వహించేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. అందులో భాగంగా ఇవాళ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో భారీ ‘రైతు గర్జన’ సభ చేపట్టారు. నవంబర్ 11న నిర్మల్, నవంబర్ 19న నిజామాబాద్‌లో ఈ సభలు నిర్వహించనున్నారు. చివరగా నవంబర్ 29న కరీంనగర్లో ‘దీక్షా దివస్’ కార్యక్రమం, భారీ రాలీతో ఈ తొలి విడత యాత్ర ముగియనుంది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని బీఆర్ఎస్ గట్టిగా వాదిస్తోంది. పంట నష్టం, సరైన మద్దతు ధర లేకపోవడం, రుణమాఫీ అమలులో నిబంధనల కొర్రీలు, ఉచిత విద్యుత్ కోతలు వంటి సమస్యలతో రైతులు అల్లాడిపోతున్నారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్‌లోనే అక్టోబర్ నెలలో ఆరుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు బీఆర్ఎస్ చెప్తోంది. బాధితుల కుటుంబాలను పరామర్శించి, వారికి పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించేందుకే కేటీఆర్ ఈ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత కొంతమేర డీలా పడిన గులాబీ కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు ఈ రైతు గర్జన సభలు దోహదపడతాయని పార్టీ భావిస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యకు వెళ్లడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టవచ్చని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. కేవలం సభలకే పరిమితం కాకుండా, జిల్లాల వారీగా ముఖ్య నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల సాయి నాయకులతో ప్రత్యేక సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయడం, ప్రజా సమస్యలపై పోరాడేలా శ్రేణులను సమాయత్తం చేయడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం.
ఈ యాత్ర ద్వారా ఉత్తర తెలంగాణలో పార్టీ పట్టును మరింత బిగించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు తీరును నిలదీస్తూ ప్రజల్లో వ్యతిరేకతను కూడగట్టాలని బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. రాబోయే స్థానిక సంస్థలు, ఇతర ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేటీఆర్ చేస్తున్న ఈ రణభేరి రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు నాంది పలకనుందో వేచి చూడాలి.








