ఓవర్సీస్లో సగం టార్గెట్ కూడా దాటని ‘రణబాలి’, ఎక్కడ దెబ్బ పడింది
విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘రణబాలి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర తొలి వారం పూర్తి చేసుకుంది. సినిమా విడుదలకు ముందు పెద్దగా హైప్ లేకపోవడం, ప్రమోషన్లు ఆశించిన స్థాయిలో వర్కవుట్ కాకపోవడం, విడుదలయ్యాక మిక్స్డ్ టాక్ రావడం.. ఇలా మొదట్లో సినిమాకు అనుకూలంగా ఏమీ కనిపించలేదు. దీనికి తోడు ‘జైలర్ 2’తో పోటీ కూడా ఎదురైంది. అయినప్పటికీ, మొదటి వారం ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు సాధించింది.
మొదట్లో ఉన్న అంచనాలతో పోలిస్తే ఈ వసూళ్లు పర్వాలేదనే చెప్పాలి. అయితే, ఈ లెక్కల్లో ఒక చిన్న మెలిక ఉంది. ఇండియాలో సినిమా నిలకడగా వసూళ్లు సాధిస్తుంటే, ఓవర్సీస్లో మాత్రం ఆశించిన ఫలితం కనిపించడం లేదు.
రణబాలి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ వివరాలు
తొలి ఏడు రోజుల్లో సినిమా సాధించిన గ్రాస్ వసూళ్లు ఇలా ఉన్నాయి.
– తెలుగు రాష్ట్రాలు: రూ.45.5 కోట్లకు పైగా
– ఇతర భారతీయ ప్రాంతాలు: రూ.6.5 కోట్లు
– భారత్‌లో మొత్తం: రూ.52 కోట్లు
– ఓవర్సీస్: రూ.11.25 కోట్లు
– ప్రపంచవ్యాప్తంగా: సుమారు రూ.63.5 కోట్లు
విడుదలకు ముందు పెద్దగా బజ్ లేకపోయినా, సినిమా చూసిన మాస్ ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్, దసరా సెలవులు వసూళ్లకు కలిసొచ్చాయి. మొదట్లో ఉన్న సందేహాలను పక్కనపెడితే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినిమా బాగానే నెట్టుకొస్తోందని చెప్పొచ్చు.
రూ.75 కోట్ల టార్గెట్.. ఇంకా ఎంత దూరమంటే!
ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.63.5 కోట్ల గ్రాస్ వసూళ్లు రావడంతో, ‘రణబాలి’ తన బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయిన రూ.75 కోట్లకు దగ్గరగా వచ్చినట్లు కనిపిస్తోంది. అంటే లక్ష్యంలో దాదాపు 85 శాతం చేరుకుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి.
గ్రాస్ కలెక్షన్లు, డిస్ట్రిబ్యూటర్ల చేతికి వచ్చే షేర్ రెండూ ఒకటి కాదు. కాబట్టి రూ.63.5 కోట్లు వచ్చాయంటే పెట్టుబడి అంతా వెనక్కి వచ్చేసినట్లుగా భావించలేం. అయినా సరే, తొలి వారం వసూళ్లను చూస్తే దేశీయ మార్కెట్లో సినిమా పెట్టుబడిని రికవరీ చేసుకునే దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
ఓవర్సీస్లో మాత్రం లెక్క తప్పింది!
ఇక్కడే ‘రణబాలి’కి అసలు సమస్య ఎదురవుతోంది. ఇండియాలో వసూళ్లు కొంత ఆశాజనకంగా ఉన్నా, విదేశాల్లో మాత్రం సినిమా అనుకున్నంతగా ప్రభావం చూపలేకపోయింది. ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే సుమారు 2.75 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు రావాల్సి ఉండగా, తొలి వారం ముగిసేసరికి వచ్చింది కేవలం 1.2 మిలియన్ డాలర్లే. అంటే అక్కడ రావాల్సిన వసూళ్లలో సగం కూడా ఇంకా రాలేదు.
ప్రీమియర్ల నుంచే బలహీనమైన ఆరంభం లభించడంతో, ఆ తర్వాత సినిమా వసూళ్లు కూడా ఆశించిన స్థాయిలో పుంజుకోలేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లు కనిపిస్తున్నప్పటికీ, ఓవర్సీస్ మార్కెట్ మాత్రం సినిమాకు పెద్ద మైనస్‌గా మారింది.
రెండో వీకెండ్లో ఏం జరుగుతుందో!
ఇప్పుడు అందరి దృష్టి రెండో వీకెండ్‌పైనే ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు ఎంతవరకు నిలబడతాయన్నది కీలకం. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన కొనసాగితే దేశీయ మార్కెట్లో బ్రేక్ ఈవెన్‌కు చేరుకోవడానికి అవకాశం ఉంటుంది.
అదే సమయంలో ఓవర్సీస్లోనూ వసూళ్లు కొంత పుంజుకుంటే సినిమా మొత్తం లెక్క మెరుగుపడుతుంది. కానీ రెండో వీకెండ్లోనే వసూళ్లు పడిపోతే మాత్రం మిగిలిన లోటును భర్తీ చేయడం అంత సులభం కాదు.
ఏదైమైనా…
మొత్తానికి ‘రణబాలి’ కలెక్షన్స్ కథ ఇప్పుడు ఆసక్తికరమైన మలుపులో ఉంది. మొదట్లో ఉన్న తక్కువ హైప్, మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని ఫస్ట్ వీక్‌లో రూ.63.5 కోట్ల గ్రాస్ సాధించడం మంచి విషయమే. కానీ ఆ వసూళ్లను పూర్తి స్థాయి విజయంగా మార్చుకోవాలంటే ఇంకా కొంత దూరం ప్రయాణించాల్సి ఉంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








