జేమ్స్ ఆండర్సన్ కెరీర్‌కు షాకింగ్ ఎండ్..?
ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఫాస్ట్ బౌలర్, లెజెండ్ జేమ్స్ ఆండర్సన్(James Anderson) క్రికెట్ కెరీర్ ఊహించని విధంగా ముగింపు దశకు చేరుకుంది. కౌంటీ క్రికెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న లాంక్షైర్ (Lancashire) క్లబ్ సంచలన నిర్ణయం తీసుకుంది. 2027 కౌంటీ ఛాంపియన్షిప్ కోసం ఆండర్సన్‌కు కాంట్రాక్ట్ పొడిగింపు ఇవ్వకూడదని ఆ జట్టు యాజమాన్యం నిర్ణయించినట్లు బ్రిటిష్ మీడియా వెల్లడించింది. ఈ తాజా పరిణామంతో 44 ఏళ్ల ఈ దిగ్గజ పేసర్ త్వరలోనే ఆట నుంచి పూర్తిగా రిటైర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నిజానికి 2026 సీజన్లో ఆండర్సన్ వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన చేశాడు. కేవలం 17.68 సగటుతో ఏకంగా 50 వికెట్లు పడగొట్టి తనలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపించుకున్నాడు. కానీ, ఆండర్సన్ నేతృత్వంలోని లాంక్షైర్ జట్టు మాత్రం చరిత్రలోనే అత్యంత దారుణమైన ప్రదర్శనను నమోదు చేసింది. డివిజన్-2 పాయింట్ల పట్టికలో కింద నుంచి రెండో స్థానంలో నిలిచింది. దీంతో జట్టులో సమూల మార్పులు చేయాలని భావిస్తున్న యాజమాన్యం, ఆండర్సన్‌ను పక్కనబెట్టేందుకు మొగ్గు చూపింది.
ఇవి కూడా చదవండి
అయితే, ఆండర్సన్ మాత్రం 2027 లో కూడా ఆడాలని ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆండర్సన్ ముందున్న ఏకైక మార్గం రిటైర్మెంట్ ప్రకటించడం లేదా వేరే ఏదైనా కౌంటీ క్లబ్ తరఫున ఆడటం. జేమ్స్ ఆండర్సన్ కెరీర్లో ఇలాంటి పరిస్థితి ఎదురవడం ఇది రెండోసారి. గతంలో 2024 లో ఇంగ్లాండ్ అంతర్జాతీయ టెస్ట్ జట్టు కూడా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా యువకులకు అవకాశం ఇవ్వాలని భావించి పక్కనబెట్టడంతో ఆండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇప్పుడు కౌంటీ క్రికెట్లోనూ అదే సీన్ రిపీట్ అవుతోంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆండర్సన్ (704 వికెట్లు) మూడో స్థానంలో ఉన్నాడు, అలాగే ఫాస్ట్ బౌలర్ల విభాగంలో ఆండర్సన్ నంబర్ వన్. సుదీర్ఘ ఫస్ట్-క్లాస్ కెరీర్లో 315 మ్యాచ్‌ల్లో ఏకంగా 1,193 వికెట్లు పడగొట్టి అసాధారణమైన రికార్డును సొంతం చేసుకున్నాడు.








