షారుఖ్ ‘డంకీ’ని తలపించే రియల్ స్టోరీ.. అమెరికా వెళ్లే దారిలో కిడ్నాప్, రూ.కోటి డిమాండ్!
రాత్రి వేళ.. చుట్టూ చీకటి. తెలియని వాతావరణం.
అక్కడ చేతులు కట్టేసి, కళ్లకు గంతలు కట్టి ఉన్న ముగ్గురు. తమను ఎవరు బంధించారో తెలియదు. బయటకు వెళ్లే దారి కనిపించడం లేదు. ఇంతలో ఒకరు ఫోన్ చేసారు. అవతలివైపు వాళ్ళు ఏదో చెప్తున్నారు. కానీ ఇక్కడ నుంచి ఓ కఠినమైన స్వరం.. “మీ వాళ్లు ప్రాణాలతో తిరిగి రావాలంటే రూ.కోటి ఇవ్వాల్సిందే!”. ఆ మాట వినగానే ఆ ముగ్గురు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అవును మీ ఊహ కరెక్టే వాళ్ళు ముగ్గురూ కిడ్నాప్ అయ్యారు.
అవును…ఇది అందరిలాంటి కథ కాదు. అమెరికాలో కొత్త జీవితం ప్రారంభించాలనే ఆశతో లక్షల రూపాయలు ఖర్చుపెట్టి బయలుదేరి మధ్యలో కిడ్నాప్ అయిన వారి కథ. అమెరికా వెళ్లే దారిలో కిడ్నాప్ ఏంటి అంటారా..అయితే మొత్తం కథనం చదవాల్సిందే!
షారుఖ్ ఖాన్ ‘డంకీ’ గుర్తుందా? ఇక్కడ అంతకు మించిన ట్విస్ట్!
విదేశాల్లో స్థిరపడాలనే కల.. వీసా తిరస్కరణలు.. అక్రమ మార్గాల్లో సరిహద్దులు దాటే ప్రయాణం.. దాని వెనుక దాగి ఉన్న ప్రమాదాలు! షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమాలో దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ ఈ అంశాలను భావోద్వేగభరితంగా చూపించారు. కానీ గుజరాత్‌కు చెందిన ఈ ముగ్గురి విషయంలో మాత్రం అమెరికా ప్రయాణం మధ్యలోనే భయంకరమైన మలుపు తిరిగింది.
అసలేం జరిగింది?
గుజరాత్‌కు చెందిన ముగ్గురు కజిన్స్ మమతా ఛవ్డా (30), రుత్విక్ జాన్సారి (23), మయూరి సోలంకి (27) . వీరు గుజరాత్‌లోని మెహసానా, గాంధీనగర్ ప్రాంతాలకు చెందినవారు. అమెరికాకు వెళ్లేందుకు అక్రమ వలస మార్గాన్ని ఏర్పాటు చేస్తామని ఏజెంట్లు హామీ ఇవ్వడంతో వీరు ఈ ప్రయాణానికి సిద్ధమయ్యారు.
మమత భర్త చిరాగ్కుమార్ విద్యార్థి వీసాపై అమెరికాకు వెళ్లాడు. అతడి వద్దకు చేరుకోవాలని మమత ప్రయత్నించినప్పటికీ, ఆమె వీసా దరఖాస్తులు ఆరుసార్లు తిరస్కరణకు గురైనట్లు సమాచారం. దీంతో అమెరికా చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాలని ఆమె కుటుంబం నిర్ణయించింది. ఈ క్రమంలో మమతతో పాటు ఆమె ఇద్దరు బంధువులు కూడా ప్రయాణానికి సిద్ధమయ్యారు.
ముగ్గురినీ అమెరికాకు చేరుస్తామని ఏజెంట్లు ఒక్కొక్కరి నుంచి రూ.75 లక్షలు వసూలు చేయాలని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. మొత్తం రూ.2.25 కోట్లు ఖర్చయ్యే ఈ ప్రయాణం కోసం కుటుంబం ఇప్పటికే రూ.60 లక్షలు చెల్లించినట్లు సమాచారం. ఒక్కొక్కరి నుంచి రూ.20 లక్షల చొప్పున తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
.సెప్టెంబర్ 20, 21 తేదీల్లో గుజరాత్ నుంచి బయలుదేరిన ముగ్గురు.. జైపూర్ సహా పలు ప్రాంతాల మీదుగా, మధ్యప్రాచ్యంలోని ట్రాన్సిట్ పాయింట్ల గుండా ఇథియోపియాకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఉత్తర అమెరికాకు వెళ్లాల్సి ఉంది. కానీ వారి ప్రయాణం కిడ్నాప్‌తో విషాదకరమైన మలుపు తిరిగింది.
కెనడా చేరుకున్నారని చెప్పారు.. కానీ నిజం వేరు!
సెప్టెంబర్ 22న మమత తన తండ్రి కిరీట్ చౌహాన్‌తో చివరిసారిగా మాట్లాడింది. ఆ తర్వాత ముగ్గురూ కెనడా చేరుకున్నారని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో వారు మొదట హ్యాపీగా ఊపిరి పీల్చుకున్నారు.
కానీ అసలు పరిస్థితి వేరేలా ఉంది. ముగ్గురినీ అడిస్ అబాబాలోని ఓ నిర్జన ఇంట్లో బంధించారు. కళ్లకు గంతలు కట్టి, చేతులు కట్టేసి నిర్బంధించారు. ఎదురుతిరిగిన రుత్విక్‌పై దాడి చేసారు. తాము కెనడాలో ఉన్నామని కుటుంబ సభ్యులకు చెప్పాలని కిడ్నాపర్లు వారిని బలవంతం చేసారు.
కొద్దిరోజుల తర్వాత బాబా ఖాన్ అని తనను తాను పరిచయం చేసుకున్న వ్యక్తి వాట్సాప్ ద్వారా కుటుంబ సభ్యులను సంప్రదించాడు. ముగ్గురి విడుదల కోసం రూ.కోటి చెల్లించాలని డిమాండ్ చేశాడు.
ఇప్పటికే ప్రయాణం కోసం రూ.60 లక్షలు ఖర్చు చేసిన కుటుంబానికి మరో కోటి రూపాయలు సమకూర్చడం అసాధ్యంగా మారింది. దీంతో వారు గుజరాత్ పోలీసులను ఆశ్రయించారు.
రూ.కోటి నుంచి రూ.15 లక్షలకు.. అయినా వెనక్కి తగ్గని పోలీసులు!
ఇన్స్పెక్టర్ ఏ.ఎం. గెహ్లోట్ నేతృత్వంలోని పోలీసు బృందం కిడ్నాపర్లతో చర్చలు ప్రారంభించింది. వలస నెట్‌వర్క్‌తో సంబంధాలున్నట్లు భావిస్తున్న ఓ స్థానిక మధ్యవర్తి సహాయాన్ని కూడా తీసుకుంది.
బాధితుల కుటుంబం ఇప్పటికే తమ ఆర్థిక వనరులన్నీ ఖర్చు చేసిందని పోలీసులు వివరించారు. దీంతో రూ.కోటి డిమాండ్ రూ.15 లక్షలకు తగ్గినట్లు సమాచారం. అయినప్పటికీ, ఆ మొత్తాన్ని కూడా చెల్లించలేమని పోలీసులు స్పష్టం చేశారు.
చర్చలు కొనసాగుతున్న సమయంలో ఓ దశలో అనుమానిత కిడ్నాపర్ ఆగ్రహంతో ఫోన్ కట్ చేశాడు. బాధితుల కుటుంబానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ముగ్గురు క్షేమంగా తిరిగివస్తారా? కిడ్నాపర్లు వారిని విడిచిపెడతారా? అనే ఉత్కంఠ నెలకొంది.
సెప్టెంబర్ 30.. ఒక్క వీడియో కాల్‌తో మారిన కథ!
ఉత్కంఠకు తెరదించుతూ సెప్టెంబర్ 30న కుటుంబ సభ్యులకు వీడియో కాల్ వచ్చింది. స్క్రీన్‌పై ముగ్గురూ కనిపించారు. వారు ప్రాణాలతో ఉన్నారు. కిడ్నాపర్లు తమను విమానాశ్రయం సమీపంలో విడిచిపెట్టి, భారత్‌కు తిరిగి వెళ్లేందుకు టికెట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
అక్టోబర్ 1న తెల్లవారుజామున సుమారు 2 గంటలకు ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ ET 640 విమానంలో ముగ్గురూ ముంబై చేరుకున్నారు. అక్కడి నుంచి గుజరాత్‌కు వెళ్లి మెహసానా జిల్లాలోని లాంఘ్నాజ్ పోలీస్ స్టేషన్లో అధికారులను కలిశారు.
వారి విడుదల కోసం కుటుంబ సభ్యులు ఎలాంటి రాన్సమ్ చెల్లించలేదని పోలీసులు తెలిపారు. ఇథియోపియా అధికారులు సహకరించారని, అడిస్ అబాబాలోని భారత రాయబార కార్యాలయం కూడా స్థానిక అధికారులతో సంప్రదింపులు జరిపిందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇది ఒక్క కుటుంబం ఎదుర్కొన్న ప్రమాదమేనా?
ఈ కిడ్నాప్ వెనుక అమెరికా ప్రయాణాన్ని ఏర్పాటు చేసిన అదే నెట్వర్క్ ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వడోదరకు చెందిన భర్గవ్ పటేల్ అనే ఏజెంట్ అనుమానితుడిగా తెరపైకి వచ్చాడు. బాబా ఖాన్ పేరుతో ఫోన్ చేసిన వ్యక్తి అసలు గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదే తరహాలో మెహసానా జిల్లాలోని కడి ప్రాంతానికి చెందిన వంశ్ అనే యువకుడు కూడా ఇథియోపియాలో కిడ్నాప్‌కు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. అతడి విడుదల కోసం కుటుంబ సభ్యులు రూ.40 లక్షలు చెల్లించినట్లు సమాచారం.
అమెరికాలో స్థిరపడాలనే ఆశతో కొందరు ఆస్తులు అమ్ముకుంటున్నారు. మరికొందరు అప్పులు చేస్తున్నారు. కుటుంబాల జీవితకాల పొదుపును ఏజెంట్ల చేతిలో పెడుతున్నారు. కానీ అక్రమ వలస మార్గంలో ప్రయాణం మొదలైన తర్వాత వారి భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారు? హామీ ఇచ్చిన ఏజెంట్లు ప్రమాదం ఎదురైనప్పుడు ఎక్కడ ఉంటారు?
షారుఖ్ ఖాన్ ‘డంకీ’లో అమెరికా ప్రయాణం ఒక కలను వెంబడించే కథ. ఈ ముగ్గురి జీవితాల్లో అదే కల కిడ్నాప్, రూ.కోటి డిమాండ్, ప్రాణభయంగా మారింది. వాళ్లు తిరిగి ఇంటికి చేరుకున్నారు. కానీ ఇలాంటి ప్రమాదకరమైన మార్గాల్లో బయలుదేరే ప్రతి ఒక్కరికీ ఆ అదృష్టం దక్కుతుందా?
—సూర్య ప్రకాష్ జోశ్యుల








