చార్లెట్ లో ఘనంగా బతుకమ్మ సంబురాలు.. భారీగా పాల్గొన్న మహిళలు
నార్త్ కరోలినా, షార్లెట్, : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు అగ్రరాజ్యం అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం షార్లెట్ నగరంలో ఘనంగా నిర్వహించారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ షార్లెట్ ఏరియా (TAGCA), హిందూ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు.
TAGCA సంస్థ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూ సెంటర్ ఆఫ్ షార్లెట్ ప్రాంగణంలో నిర్వహించిన ‘ఫస్ట్ ఎవర్ బతుకమ్మ సంబరాలు’ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ వేడుకల్లో మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి తెలంగాణ సంప్రదాయాన్ని చాటిచెప్పారు. బతుకమ్మ పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.

TAGCA అధ్యక్షుడు దిలీప్ తోటకూరి, సంస్థ ట్రస్టీలు, నిర్వాహకుల ఆధ్వర్యంలో కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ పోటీలు, చీరల రాఫిల్ వంటి ప్రత్యేక కార్యక్రమాలు వేడుకలకు మరింత ఆకర్షణగా నిలిచాయి. విజేతలకు బహుమతులు అందించేలా ఏర్పాట్లు చేశారు.
విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఈ వేడుకలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళలు, చిన్నారులు, తెలుగు కుటుంబాల భాగస్వామ్యంతో బతుకమ్మ సంబరాలు విజయవంతమయ్యాయి. ఈ వేడుకలు తెలుగు వారిలో ఐక్యతను, సాంస్కృతిక అనుబంధాన్ని మరింత బలోపేతం చేశాయి.









