పాకిస్థాన్ ముక్కలు కాబోతోందా? ఎవరి గేమ్ ప్లాన్ ఇది?
ఒక దేశంలో ప్రజలు ఆర్థిక కష్టాలతో అల్లాడుతున్నప్పుడు పాలకులు ఏం చేస్తారు..ఏం చేయాలి? ఉద్యోగాలు కల్పించాలి. ధరలను అదుపులో పెట్టాలి. ఆసుపత్రులు, పాఠశాలలను మెరుగుపరచాలి. అప్పుల ఊబి నుంచి దేశాన్ని బయటపడేయాలి. కానీ పాకిస్థాన్‌లో మాత్రం అందుకు వ్యతిరేకంగా జరుగుతోంది. అధికారమే కేంద్రంగా పాకిస్దాన్ ని ముక్కలు చేయాలనే ఆలోచన జరుగుతోంది. గత కొంతకాలంగా దేశంలోని నాలుగు ప్రావిన్సులను చిన్న చిన్న ప్రాంతాలుగా విభజించాలనే ప్రతిపాదన వార్తల్లో నిలిచింది.
ఈ ఆలోచన వెనుక ఉన్నది ప్రజలు ఎన్నుకున్న నాయకుడు కాదు.. దేశ రాజకీయాలపై విస్తృత ప్రభావం కలిగిన సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్. ఈ ప్రతిపాదన నిజంగా అమలైతే పాకిస్థాన్ రాజకీయ ముఖచిత్రమే మారిపోయే అవకాశం ఉంది. అయితే, దీని వెనుక అసిమ్ మునీర్ వ్యక్తిగత ఆలోచన ఏమిటి? అసలు పాకిస్దాన్ లో ఏం జరుగుతోంది.
అసిమ్ మునీర్ ఎవరు? ఆయన చేతుల్లో ఇంత అధికారం ఎలా వచ్చింది?
అసిమ్ మునీర్ సాధారణ సైనికాధికారి కాదు. పాకిస్థాన్ సైన్యంలో అనేక కీలక పదవులు నిర్వహించిన ఆయన, సైనిక నిఘా విభాగం (Military Intelligence), దేశ విదేశీ నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI)లకు నాయకత్వం వహించారు. 2022 నవంబర్‌లో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు. అనంతరం ఆయనకు ఫీల్డ్ మార్షల్ హోదా లభించింది.
మొదటి నుంచీ పాకిస్థాన్‌లో సైన్యం పాత్ర చరిత్రాత్మకంగా చాలా కీలకం. దేశ భద్రత, భారత్‌తో సంబంధాలు, విదేశాంగ విధానం వంటి అంశాల్లో సైన్యం ప్రభావం దశాబ్దాలుగా కొనసాగుతోంది. పౌర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ, కీలక నిర్ణయాల్లో సైనిక నాయకత్వం మాటకు అధిక ప్రాధాన్యం ఉంటుందనే విమర్శలు ఉన్నాయి.
అసిమ్ మునీర్ హయాంలో ఈ ప్రభావం మరింత బలపడింది. 2025లో చేసిన రాజ్యాంగ మార్పుల ద్వారా ఆయనకు మూడు సాయుధ దళాలపై కమాండ్‌కు సంబంధించిన విస్తృత అధికారాలు కల్పించబడ్డాయి. ఆయన పదవీకాలం 2030 వరకు కొనసాగేందుకు మార్గం ఏర్పడింది.
పాకిస్థాన్‌ను ఎందుకు విభజించాలనుకుంటున్నారు?
ప్రస్తుతం పాకిస్థాన్‌లో నాలుగు ప్రధాన ప్రావిన్సులు ఉన్నాయి. అవి పంజాబ్, సింధ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్థాన్. వీటిలో పంజాబ్ అత్యధిక జనాభా కలిగిన ప్రాంతం. సింధ్ కూడా దేశ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలో కీలకమైన స్థానాన్ని కలిగి ఉంది.
ది ఎకనామిస్ట్ నివేదిక ప్రకారం, అసిమ్ మునీర్ ఈ నాలుగు ప్రావిన్సులను 12 నుంచి 15 చిన్న ప్రావిన్సులుగా విభజించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పైకి చూస్తే ఈ ప్రతిపాదనలో తప్పేమీ లేదనిపించవచ్చు. పెద్ద ప్రావిన్సులను పాలించడం కష్టంగా ఉందని, చిన్న ప్రాంతాలు ఏర్పడితే ప్రజలకు ప్రభుత్వ సేవలు త్వరగా అందుతాయని వాదించవచ్చు. కానీ అసలు ఆలోచన వేరే ఉందని అంటున్నారు విశ్లేషకులు.
అసిమ్ మునీర్‌కు అడ్డుగా ఉన్నవి పెద్ద ప్రావిన్సులేనా?
పంజాబ్‌లో పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N), సింధ్‌లో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) దీర్ఘకాలంగా బలమైన రాజకీయ ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. ఈ ప్రావిన్సులు కేవలం పరిపాలనా ప్రాంతాలు కావు. దేశంలో సైనిక వ్యవస్థకు వెలుపల కూడా రాజకీయ శక్తులు ఉన్నాయని చూపించే కేంద్రాలు.
ఇవి కూడా చదవండి
ఒక పెద్ద ప్రావిన్స్‌కు బలమైన ముఖ్యమంత్రి, రాజకీయ పార్టీ, ప్రజల మద్దతు ఉంటే, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. సైన్యం రాజకీయాల్లో జోక్యం చేసుకుంటోందని భావించినప్పుడు కూడా ఈ నాయకత్వాలు తమ ప్రాంతీయ బలాన్ని ఉపయోగించగలవు. ఇప్పుడు ఆ పెద్ద ప్రావిన్సులను అనేక చిన్న ప్రాంతాలుగా విభజిస్తే ఏం జరుగుతుంది?
ఒకే రాజకీయ పార్టీ ఆధీనంలో ఉన్న పెద్ద ప్రాంతం అనేక చిన్న రాజకీయ కేంద్రాలుగా మారవచ్చు. ప్రతి ప్రాంతానికి వేర్వేరు నాయకత్వాలు ఏర్పడవచ్చు. వాటి రాజకీయ బలం విడిపోవచ్చు. ఒక్కో ప్రాంతం నిధులు, అభివృద్ధి ప్రాజెక్టులు, పరిపాలనా నిర్ణయాల కోసం కేంద్రంపై ఎక్కువగా ఆధారపడాల్సి రావచ్చు.
దీంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించే శక్తి తగ్గే అవకాశం ఉంది. పెద్ద రాజకీయ ప్రత్యర్థిని ఎదుర్కోవడం కంటే, అనేక చిన్న నాయకత్వాలతో విడివిడిగా వ్యవహరించడం అధికారంలో ఉన్నవారికి సులభం కావచ్చు.
ప్రతిపక్షాలను బలహీనపరిచే వ్యూహమా?
పాకిస్థాన్‌లో ప్రతిపక్ష రాజకీయాల పరిస్థితి కూడా ఈ చర్చకు నేపథ్యంగా ఉంది. మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉండటం, ఆయన పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) కార్యకలాపాలపై ఆంక్షలు, రాజకీయ నిరసనలపై చర్యలు వంటి పరిణామాలు దేశంలో ప్రజాస్వామ్య స్వేచ్ఛలపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా నిలిచే రాజకీయ శక్తులను అణచివేస్తున్నారని ఆయన పార్టీ ఆరోపిస్తోంది.
ఈ పరిస్థితుల్లో ప్రావిన్సుల విభజన జరిగితే, ఇప్పటికే ఉన్న రాజకీయ సమీకరణాలు మారవచ్చు. పెద్ద ప్రావిన్సుల రాజకీయ బలం తగ్గితే, అక్కడి పార్టీలకు తమ ఆధిపత్యాన్ని కొనసాగించడం కష్టమవచ్చు. కొత్త ప్రాంతాల్లో కొత్త నాయకత్వాలు ఎదగవచ్చు. వాటి ద్వారా అధికార పంపిణీ, ఎన్నికల రాజకీయాలు కొత్త రూపు తీసుకోవచ్చు.
దేశాన్ని రక్షించాల్సిన సైన్యమే సమస్యలో భాగమైతే?
పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం గురించి చర్చించేటప్పుడు సైన్యం పాత్రను విస్మరించలేం. దేశ రక్షణ కోసం పనిచేయాల్సిన సైన్యం రాజకీయాలు, విదేశాంగ విధానం, ఆర్థిక ప్రయోజనాలపై కూడా విస్తృత ప్రభావం చూపుతోందనే విమర్శలు ఉన్నాయి.
చివరికి.. అసిమ్ మునీర్‌కు కావాల్సింది కొత్త పాకిస్థానా, కొత్త అధికార వ్యవస్థా?
అసిమ్ మునీర్ ప్రణాళికపై ఉన్న ప్రధాన అనుమానం ఇదే. ప్రజలకు మెరుగైన పాలన అందించాలనే లక్ష్యం నిజమైతే, కొత్త ప్రాంతాలకు నిజమైన స్వయంపాలన ఎందుకు ఇవ్వకూడదు? ప్రజలే తమ నాయకులను ఎన్నుకునేలా చేసి, స్థానిక ప్రభుత్వాలకు నిధులు, అధికారాలు ఎందుకు బదిలీ చేయకూడదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించకుండా విభజన ప్రతిపాదనను కేవలం అభివృద్ధి ప్రణాళికగా చూడటం కష్టం.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








