రివ్యూ: ఫాంటాసి అండ్ ఎమోషనల్ డ్రామా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ 2.5/5
నిర్మాణ సంస్థ : ఆర్కా మీడియా వర్క్స్
నటీనటులు: ఫాహద్ ఫాజిల్, సారా పాలేకర్, సౌరభ్ సచ్‌దేవా, వెంకటేష్ కాకుమాను,
సుబ్బరాజు, శశాంక్, మహేష్ మంజ్రేకర్ తదితరులు..
సంగీతం: కాల భైరవ, సినిమాటోగ్రఫి: బ్రాడ్ ఫ్రాన్సిస్
ఎడిటర్: ప్రవీణ్ ఆంథోని, సమర్పకుడు: SS రాజమౌళి
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ
దర్శకత్వం: శశాంక్ యేలేటి
విడుదల తేది :02.10.2026
నిడివి : 2 ఘంటల 37నిముషాలు
‘పుష్ప’ ఫేం ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ (Don’t Trouble The Trouble). నేడు అక్టోబర్ 2 న, గాంధీ జయంతి కానుకగా ఈ చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలోకి విడుదలైంది. దిగ్దర్శకుడు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి(S S Rajamouli) సమర్పణలో, ఆయన కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ,(S S Karthikeya) ‘బాహుబలి’ వంటి విజువల్ వండర్ తీసిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘ఆర్కా మీడియా వర్క్స్'(ARKA MEDIA WORKS) అధినేతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడంతో సినిమాపై టాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ఫహాద్ ఫాజిల్ లాంటి గ్రేట్ యాక్టర్ ఉండటం, రాజమౌళి, జూనియర్ ఎన్టీర్(Jr NTR) లతో భారి లెవల్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయడంతో ప్రేక్షకులు ఎన్నో అంచనాలతో థియేటర్లకు వెళ్లారు. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో తెలుసుకుందాం !
కథ :
‘సూరి’ (ఫహద్ ఫాజిల్) అనే ఒక అనాథ యువకుడు తన ఫ్రెండ్ తో కలిసి ఉంటాడు. వృత్తిరీత్యా అంబులెన్స్ డ్రైవర్ అయినప్పటికీ, ఈజీ మనీకి అలవాటు పడి ఇల్లీగల్ పనులు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఆ ఏరియా డాన్ అస్లాం భాయ్ (మహేశ్ మంజ్రేకర్)ను మోసం చేసి ఒక పందెంలో డబ్బు సంపాదిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న డాన్. రెండు నెలల్లో రూ. 25 లక్షలు వెనక్కి ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరిస్తాడు. ఆ డబ్బు కోసం పిల్లలను కిడ్నాప్ చేయాలనే షార్ట్ కట్స్ వెతికే క్రమంలో సూరికి ‘బేబీ దివ్య’ (బేబీ సారా) అనే చిన్నారి పరిచయం అవుతుంది. అమ్మాయిని కిడ్నాప్ చేసి డబ్బులు సంపాదించాలి అనుకుంటాడు సూరి. మరోవైపు దివ్య మాత్రం తాను తన అమ్మానాన్నలను మ్యాజిక్ చేసి మాయం చేసాను అనుకుంటుంది. అలా వాళ్ళిద్దరి ట్రావెల్ నడుస్తున్న సమయంలోనే దివ్య మనిషి కాదు ఆత్మ అని తెలుసుకుంటాడు సూరి. విచిత్రం ఏమిటంటే ఆమె కేవలం సూరికి మాత్రమే కనిపిస్తుంది. ఆ అమ్మాయికి ఉన్న సూపర్ పవర్స్ కూడా వాడుకుంటాడు. అదే సమయంలో వాళ్ళ అమ్మానాన్నలను దివ్యతో కలిపిస్తానని మాటిస్తాడు.అసలు ఈ చిన్నారి నేపథ్యం ఏంటి? ఆమె సూరికి మాత్రమే ఎందుకు కనిపిస్తుంది? ఆమె శక్తులను వాడుకుని సూరి డాన్‌కు డబ్బు కట్టాడా? ఈ క్రమంలో సూరి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఎదురైన ఇబ్బందులు ఏంటి.. దివ్యకు ఏమైంది.. వాళ్ళ అమ్మానాన్నలు ఎక్కడున్నారు అనేది మిగిలిన కథ.
నటీనటుల హావభావాలు :
ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల సత్తా ఉన్న ఫహాద్ ఫాజిల్, ఈ సినిమాలో కూడా తన సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసే ప్రయత్నం చేశాడు. బేబీ సారా తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో, అమాయకపు నటనతో మెప్పించింది. విలన్‌గా నటించిన బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్ తనకు ఇచ్చిన పాత్రను న్యాయం చేశాడు. సౌరభ్ సచ్దేవ్, సుబ్బరాజ్ పర్వాలేదనిపించారు.
సాంకేతికవర్గం పనితీరు :
కాలభైరవ అందించిన సంగీతం చాలా బాగుంది. ఇందులో పాటలు తక్కువగానే ఉన్నాయి కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రవీణ్ ఆంథోనీ ఎడిటింగ్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఎందుకంటే రెండు గంటల 37 నిమిషాల నిడివి బాగా ఎక్కువైనట్టు అనిపించింది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు కట్ చేసి ఉంటే ఇంకా షార్ప్ గా ఉండేది. సినిమాలో ఉన్న చాలా సాగదీత సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే రిజల్ట్ మెరుగ్గా ఉండేది. బ్రాడ్ ఫ్రాన్సిస్ సినిమాటోగ్రఫీ రిచ్‌గా అద్భుతంగా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి. తొలి సినిమానే అయినా కూడా దర్శకుడు శశాంక్ ఏలేటి మంచి కథను తీసుకున్నాడు.. కాకపోతే దాన్ని మరింత పకడ్బందీగా చెప్పి ఉంటే ఇంకాస్త మంచి సినిమా అయ్యుండేది. నిర్మాణ విలువలు ఆర్కా మీడియా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నతంగా ఉన్నాయి.
విశ్లేషణ :
డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ వినడానికి ఒక చందమామ కథలా ఉంటుంది. అనుకోని ప్రమాదంలో చనిపోయిన ఒక అమ్మాయి ఆత్మగా మారి ఆ తర్వాత వాళ్ళ అమ్మానాన్నల కోసం వెతుక్కోవడమే ఈ సినిమా కథ. కాకపోతే ఆ అమ్మాయి చనిపోయిన విషయం తనకు తెలియదు. ఒక చిన్న లింకు పెట్టి ఆ అమ్మాయి కేవలం హీరోకి మాత్రమే కనిపించేలా దర్శకుడు ఒక లాజిక్ రాసుకున్నాడు.సినిమా మొదటి నుంచి ఆసక్తికరంగానే సాగుతుంది. మొదటి 15 నిమిషాలు హీరో ఎలాంటివాడు.. డబ్బుల కోసం ఎలా మారిపోతుంటాడు అనేది చాలా క్లారిటీగా ఎస్టాబ్లిష్ చేశాడు దర్శకుడు శశాంక్. ఒకసారి కథలోకి వెళ్లిపోయిన తర్వాత అమ్మాయి కథలోకి వచ్చిన తర్వాత వేగం పుంజుకుంటుంది. అమ్మాయి మనిషి కాదు ఆత్మ అని హీరో తెలుసుకోవడానికి ఇంటర్వెల్ వరకు టైం తీసుకున్నాడు దర్శకుడు. అక్కడి నుంచి సెకండాఫ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత కూడా కథ కాస్త నెమ్మదిగానే వెళ్ళింది. అయితే చెప్పే ప్రతి విషయాన్ని చాలా డీటెయిల్ గా చెప్పాలని ముందుగానే ఫిక్స్ అయిపోయిన దర్శకుడు టైం బాగానే తీసుకున్నాడు.
కథలో మెయిన్ ప్లాట్ రివిల్ అయిన తర్వాత.. హీరోకు, ఆ పాపకు మధ్య ఎమోషనల్ బాండింగ్ రాసుకోవడంలో తడబడినట్టు అనిపించింది. ఎలాంటి కాన్ఫ్లిక్ట్ లేకుండానే అప్పటివరకు ఆ పాప మీద ఎలాంటి ప్రేమాభిమానాలు లేని హీరో అకాశ్మత్గా తనకోసం ప్రాణాలు కూడా ఇచ్చేంత బలంగా నిలబడతాడు. ఇలాంటి సన్నివేశాలు క్రియేట్ చేసుకోడానికి ముందు మరికొన్ని బలమైన ఎమోషనల్ సన్నివేశాలు రాసుకుంటే సినిమా మరింత పకడ్బందీగా వచ్చేది. క్లైమాక్స్ పూర్తిగా ఎమోషనల్ గానే రాసుకున్నాడు దర్శకుడు శశాంక్. అప్పటివరకు సినిమా ఎలా ఉన్నా కూడా చివరి 15 నిమిషాలు మాత్రం ప్రాణంగా నిలిచింది. చివర్లో వచ్చిన ట్విస్ట్ కూడా బాగుంది. వీకెండ్ సరదాగా చిన్న పిల్లలతో కలిసి ఫ్యామిలీతో చూడతగ్గ సినిమాగా నిలబడుతుంది.








