కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా.. సీఎం రేవంత్ రెడ్డి
*ప్రభుత్వ బీమా పథకాలన్నీ ఒకే గొడుగు కిందకు.. Revanth Reddy, Indiramma Insurance,
*సిద్దిపేట బహిరంగ సభలో 19న దరఖాస్తు విడుదల
*రాష్ట్రంలోని అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు..
*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు..
హైదరాబాద్: రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా అందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ శాఖల్లో అమలవుతున్న బీమా పథకాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సీఎం సూచించారు. ఇందుకోసం ఈ నెల 19న సిద్ధిపేట బహిరంగ సభలో ఇందిరమ్మ బీమా దరఖాస్తును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందిరమ్మ బీమా, ఇందిరమ్మ చీరల పంపిణీపై జూబ్లీహిల్స్ నివాసంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా పథకం అమలు కావాలని, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బీమా పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల జీవిత బీమా అందనుంది. ఈ బీమా వల్ల ఉపాధి హామీ కూలీలతో పాటు లక్షలాది మంది పేదలు లబ్ధి పొందుతారని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇప్పటికే అమలవుతున్న వివిధ రకాల బీమా పథకాల్లో జీవిత బీమా కింద రెండు లక్షలు, ప్రమాద బీమా కింద పది లక్షల రూపాయల వరకు అందిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఇప్పటికే రాష్ట్రంలో వివిధ శాఖల్లో అమలవుతున్న అన్ని బీమా పథకాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి, వారికి లభిస్తున్న ప్రమాద బీమాను యథాతథంగా అందేలా చూడాలన్నారు. కొన్ని శాఖల్లో ప్రస్తుతం ఉన్న రెండు లక్షల రూపాయల జీవిత బీమాను ఇందిరమ్మ బీమా పరిధిలోకి తీసుకువచ్చి ఐదు లక్షల రూపాయలకు పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి బీమా భద్రత అందుకుంటున్న వారిలో ఏ ఒక్కరినీ కూడా తప్పించడానికి వీల్లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు.
మరోవైపు సిద్ధిపేట బహిరంగ సభలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందాలని సీఎం ఆదేశించారు. చీరలను తక్షణమే అన్ని జిల్లాలకు తరలించాలని సీఎం సూచించారు. ఇందిరమ్మ బీమా, ఇందిరమ్మ చీరల పంపిణీపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఇందిరమ్మ చీరల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
ఇందిరమ్మ బీమా పథకంపై విస్తృతంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బీమా దరఖాస్తులను గ్రామస్థాయిలో అందుబాటులో ఉంచాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు.
సమీక్ష సమావేశంలో సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, సీఎంవో కార్యదర్శి మానిక్ రాజ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్లానింగ్ శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు పాల్గొన్నారు.







