ఐదు అధ్యాయాల్లో ఐదు కథలు.. బ్రాడ్ పిట్నే ఫిదా చేసిన టరంటినో స్క్రీన్‌ప్లే వెనుక అసలు మ్యాజిక్ ఇదే!
కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు కథలో తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. కానీ ఇంకొన్ని సినిమాలు మాత్రం అసలు కథను ఎలా చెబుతున్నారనే ఆసక్తితో కట్టిపడేస్తాయి. క్వెంటిన్ టరంటినో తెరకెక్కించిన ‘Inglourious Basterds’ అలాంటి సినిమానే. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యం, నాజీలపై ప్రతీకారం, రక్తపాతం, డార్క్ హ్యూమర్.. ఇవన్నీ ఒక ఎత్తయితే, ఈ కథను టరంటినో చెప్పిన విధానం మరో ఎత్తు. అందుకే సినిమా విడుదలై ఇన్నేళ్లు గడిచినా దాని గురించి చర్చలు ఆగడం లేదు.
తాజాగా ఈ సినిమా గురించి బ్రాడ్ పిట్ చెప్పిన విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఒక స్టార్ హీరోగా తనకు ఎన్నో కథలు వినిపించి ఉండొచ్చు. కానీ ‘ఇన్గ్లోరియస్ బాస్టర్డ్స్’ విషయంలో మాత్రం టరంటినో రాసిన స్క్రీన్‌ప్లే చదివినప్పుడే ఆయనకు ఏదో ప్రత్యేకత కనిపించిందట. ముఖ్యంగా కథను ఐదు అధ్యాయాలుగా విభజించి, ఒక్కో పాత్ర జీవితాన్ని ఒక్కో కోణంలో పరిచయం చేస్తూ చివరకు అన్నింటినీ ఒకే చోట కలిపిన విధానం పిట్‌ను బాగా ఆకట్టుకుందట.
కథను చెప్పే విధానమే ఈ సినిమా అసలైన బలం!
సాధారణంగా ఒక సినిమా స్క్రీన్‌ప్లేలో కథ ఒక క్రమంలో ముందుకు వెళ్తుంది. ఒక సంఘటన తర్వాత మరో సంఘటన జరుగుతుంది. కానీ టరంటినోకు అలాంటి రూల్స్‌తో పెద్దగా పనిలేదు. ప్రేక్షకులకు ఏం చూపించాలి, ఎంతసేపు చూపించాలి, ఎప్పుడు మరో కథలోకి తీసుకెళ్లాలి అనే విషయంలో ఆయనది ప్రత్యేకమైన శైలి. ‘ఇన్గ్లోరియస్ బాస్టర్డ్స్’లో అదే కనిపిస్తుంది. ఐదు అధ్యాయాలుగా కథను విభజించి, ఒక్కో భాగంలో ఒక్కో పాత్రను, వారి నేపథ్యాన్ని పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతారు.
ఈ స్క్రీన్‌ప్లే చదువుతున్నప్పుడు తనకు ఒక నవల చదువుతున్న అనుభూతి కలిగిందని బ్రాడ్ పిట్ చెప్పారు. ఒక అధ్యాయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఇంకా తగ్గకముందే టరంటినో మరో అధ్యాయంలోకి వెళ్లిపోతారని, అక్కడ మరో ప్రపంచాన్ని పరిచయం చేస్తారని వివరించారు. అయినా ప్రేక్షకులు మొదటి కథను మర్చిపోకుండా, అన్ని కథలను చివరకు అద్భుతంగా కలపడం తనకు చాలా నచ్చిందని తెలిపారు.
ప్రతీకారం అనే అంశం కూడా ఈ సినిమాకు తనను దగ్గర చేసిందని పిట్ చెప్పడం విశేషం. ముఖ్యంగా అమెరికన్ ప్రేక్షకులకు రివెంజ్ కథలంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుందని, ఈ సినిమాలో ఆ అంశాన్ని టరంటినో చాలా విభిన్నంగా చూపించారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
హిట్లర్‌ను చంపడానికి బయలుదేరిన సైనికులు.. కానీ ఇది నిజమైన చరిత్ర కాదు!
2009లో విడుదలైన ‘ఇన్గ్లోరియస్ బాస్టర్డ్స్’ కథ రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఆక్రమిత ఫ్రాన్స్‌లో జరుగుతుంది. నాజీలపై ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో బయలుదేరిన యూదు అమెరికన్ సైనికుల బృందానికి బ్రాడ్ పిట్ పోషించిన లెఫ్టినెంట్ ఆల్డో రైన్ నాయకత్వం వహిస్తాడు. మరోవైపు తన కుటుంబాన్ని నాజీ అధికారి హత్య చేయడంతో అతడిపై పగ తీర్చుకోవాలని ఎదురుచూస్తున్న షోసన్నా డ్రేఫస్ కథ కూడా సమాంతరంగా సాగుతుంది.
ఈ రెండు ప్రపంచాలు చివరకు హిట్లర్‌ను అంతమొందించే ఒక భారీ ప్రణాళిక దగ్గర కలుస్తాయి. ఇక్కడే టరంటినో తనదైన ప్రయోగం చేశారు. నిజమైన చరిత్రలో జరగని సంఘటనను సినిమాలో జరిగేలా చూపిస్తూ, ప్రేక్షకులను ఒక ప్రత్యామ్నాయ చరిత్రలోకి తీసుకెళ్లారు. చరిత్రను యథాతథంగా చూపించాలనే ఆలోచనకు భిన్నంగా, ఒకవేళ అలా జరిగి ఉంటే ఎలా ఉండేదనే ఊహకు తెరతీశారు.
ఈ ప్రయోగమే సినిమాకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 321 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం, కేవలం బాక్సాఫీస్ విజయంతోనే ఆగిపోలేదు. ఎనిమిది ఆస్కార్ నామినేషన్లు దక్కించుకుంది. ఇందులో హాన్స్ లాండా పాత్రలో నటించిన క్రిస్టోఫ్ వాల్ట్జ్కు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఆస్కార్ అవార్డు లభించింది.
టేబుల్ రీడింగ్ నచ్చలేదని హీరోయిన్నే తీసేశారు!
ఈ సినిమా గురించి బ్రాడ్ పిట్ మాట్లాడుతుండగా, మరోవైపు దీని నిర్మాణ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలు కూడా బయటకు వచ్చాయి. జే గ్లెన్నీ రాసిన The Making of Quentin Tarantino’s Inglourious Basterds పుస్తకంలో టరంటినో స్వయంగా వెల్లడించిన విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా షోసన్నా పాత్రలో నటించిన మెలానీ లారెంట్ను మొదట టరంటినో తొలగించారనే విషయం ఆశ్చర్యపరుస్తోంది.
సినిమా షూటింగ్ మొదలయ్యే ముందు నటీనటులందరితో స్క్రిప్ట్ చదివించే టేబుల్ రీడింగ్‌ను టరంటినో చాలా సీరియస్‌గా తీసుకుంటారు. ఆయనకు అది కేవలం స్క్రిప్ట్ చదివే కార్యక్రమం కాదు. తన మనసులో ఊహించుకున్న సినిమా మొదటిసారి నటీనటుల రూపంలో కనిపించే సందర్భం. అందుకే ఆ రోజు కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తారట. అయితే మెలానీ లారెంట్ టేబుల్ రీడింగ్ ఆయన అంచనాలకు ఏమాత్రం తగ్గట్టుగా లేదట. ఆమె తనని చాలా నిరాశపరిచిందని, అందుకే వెంటనే ఆ పాత్ర నుంచి తొలగించానని టరంటినో వెల్లడించారు.
అయితే మెలానీ అంత తేలిగ్గా వెనక్కి తగ్గలేదు. తన ఆరోగ్యం బాగాలేకపోవడం వల్లే ఆ రోజు సరిగ్గా నటించలేకపోయానని టరంటినోకు వివరించారట. అవసరమైతే జర్మనీ నుంచి తిరిగి వచ్చి, హోటల్లో ఉండి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారట. ఆమె చూపించిన పట్టుదల చూసి టరంటినో కూడా మనసు మార్చుకున్నారు. మూడు రోజుల పాటు రిహార్సల్స్‌కు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆమె నటన నచ్చడంతో మళ్లీ షోసన్నా పాత్రను అప్పగించారు.
ఈ విషయంపై టరంటినో మాట్లాడుతూ,… మెలానీ అంటే తనకు చాలా ఇష్టమని, చివరకు ఆమె ఆ పాత్రలో అద్భుతంగా నటించిందని చెప్పారు. నిజానికి ఆ టేబుల్ రీడింగ్ సంఘటనను తాను మళ్లీ గుర్తుచేసుకునేవాడిని కూడా కాదని, సినిమా నిర్మాణం వెనుక జరిగిన ప్రతి విషయాన్ని పుస్తకంలో చేర్చాలని నిర్ణయించుకోవడంతోనే ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నానని వివరించారు.
ఇసబెల్లె హుప్పెర్ట్ విషయంలో మాత్రం టరంటినో వెనక్కి తగ్గలేదు!
మెలానీ లారెంట్‌కు రెండో అవకాశం ఇచ్చిన టరంటినో, మరో ప్రముఖ నటి ఇసబెల్లె హుప్పెర్ట్ విషయంలో మాత్రం అస్సలు రాజీపడలేదు. షోసన్నాకు పారిస్‌లో ఆశ్రయం కల్పించే మేడమ్ అడా మిమియక్స్ పాత్ర కోసం మొదట హుప్పెర్ట్ను ఎంపిక చేశారు. కానీ ఆమె టేబుల్ రీడింగ్‌కు హాజరు కాలేదు. మరోవైపు కాంట్రాక్ట్ విషయంలోనూ సమస్యలు ఎదురయ్యాయి. దీంతో టరంటినో ఆమెను తొలగించి, ఆ పాత్ర కోసం మ్యాగీ చ్యూంగ్ను తీసుకున్నారు.
తన నిర్ణయం గురించి టరంటినో చాలా నిక్కచ్చిగా మాట్లాడారు. ఒక నటుడిని సినిమాలోకి తీసుకున్న తర్వాత అతను టేబుల్ రీడింగ్‌కు రాకపోతే, ఆ నటుడికి ప్రత్యేకంగా ఎలాంటి హక్కులు ఉండవని, తన సినిమాకు సరిపోయే నటుడిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ తనకు ఉందని చెప్పారు. ఒకరి స్థానంలో మరొకరి నటన నచ్చితే వెంటనే నిర్ణయం తీసుకుంటానని కూడా వెల్లడించారు.
అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. మ్యాగీ చ్యూంగ్ నటించిన సన్నివేశాలు కూడా చివరకు సినిమాలో కనిపించలేదు. ఎందుకంటే ఆ సన్నివేశాలు ప్రేక్షకులకు అవసరానికి మించి వివరాలు చెబుతున్నాయని టరంటినో భావించారు. షోసన్నాకు సినిమా థియేటర్ ఎలా వచ్చిందో ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదని, ఆమె దాన్ని తన అత్త నుంచి వారసత్వంగా పొందిందని చెప్పే చిన్న వివరణ సరిపోతుందని నిర్ణయించుకున్నారు.
నటుడి కోసం సినిమా కాదు.. సినిమా కోసం నటుడు!
టరంటినో పని చేసే విధానం చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయనకు నటీనటులపై వ్యక్తిగత అభిమానం ఉండొచ్చు. కానీ ఒక పాత్రకు సరిపోని నటుడిని కేవలం పేరున్న స్టార్ అనే కారణంతో కొనసాగించరు. తనకు కావాల్సిన ప్రపంచంలో ఆ పాత్ర సహజంగా కనిపించాలన్నదే ఆయనకు ముఖ్యం. అందుకే నటీనటుల ఎంపిక విషయంలో ఎలాంటి సెంటిమెంట్లకు తావివ్వనని స్పష్టం చేశారు.
తన సినిమాకు దొరికే అత్యుత్తమ నటీనటులను ఎంపిక చేయడమే తన బాధ్యత అని, పాత్రకు ఎవరు సరిపోతారో వారికే అవకాశం ఇస్తానని ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చాయి.
మొత్తానికి ….
‘ఇన్గ్లోరియస్ బాస్టర్డ్స్’ ప్రత్యేకత కేవలం తెరపై కనిపించే యుద్ధం, ప్రతీకారం, రక్తపాతం మాత్రమే కాదు. కథను ఐదు అధ్యాయాలుగా విభజించిన స్క్రీన్‌ప్లే నుంచి, ఒక్క టేబుల్ రీడింగ్ ఆధారంగా నటీనటులను ఎంపిక చేసిన విధానం వరకు ప్రతి విషయంలోనూ టరంటినో మార్క్ కనిపిస్తుంది. ఒక మంచి సినిమా తీయాలంటే మంచి కథ ఒక్కటే సరిపోదు.. ఆ కథకు సరిపోయే నటీనటులు, దాన్ని చెప్పడానికి ఒక ప్రత్యేకమైన దృష్టికోణం కూడా ఎంత ముఖ్యమో ఈ సినిమా మరోసారి గుర్తుచేస్తుంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







