గిగ్ వర్కర్ల బోర్డు ఏర్పాటు చేసి.. గుర్తింపు కార్డులు ఇస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
నాడు రాహుల్ హామీ… గిగ్ వర్కర్ల సంక్షేమానికి దేశంలోనే ప్రత్యేక చట్టం
గిగ్ కార్మికులకు రూ.5 లక్షల జీవిత బీమా.. ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల ఆరోగ్య బీమా
ప్రత్యేక బోర్డు ఏర్పాటు.. గుర్తింపు కార్డులు, ప్రత్యేక నంబర్లతో కార్మికులకు గుర్తింపు
రాహుల్ గాంధీ చేతుల మీదుగా చట్టం అమలుకు శ్రీకారం
నిఖిల్ డే తదితరుల సహకారంతో చట్టం రూపకల్పన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ః నాటి నుంచి నేటి వరకు దేశ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో గాంధీ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గిగ్ వర్కర్ల సంక్షేమం, భద్రత కోసం భారత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలోకి తీసుకొచ్చిందని వెల్లడించారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక గిగ్ వర్కర్ల చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. నవంబర్ 14న మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఈ చట్టం అమలుకు శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. హైదరాబాద్ లో జయభేరి గ్రౌండ్ లో జరిగిన గిగ్ వర్కర్స్ సభలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధుల సభలో సీఎం ప్రసంగించారు. 2023లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సుమారు 4 వేల కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మండుటెండలు, మంచుకొండలను లెక్కచేయకుండా గ్రామాలు, గూడేలు, తండాలు, మారుమూల ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమయ్యారని గుర్తు చేశారు. ఈ యాత్రలో కేవలం రాజకీయ అంశాలకే పరిమితం కాకుండా పేదలు, కార్మికులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకున్నారని చెప్పారు. వారి కష్టాలను వింటూ, వారి హక్కుల కోసం గొంతుకగా నిలిచారని వివరించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఆనాడు హైదరాబాద్‌కు వచ్చినప్పుడు గిగ్ వర్కర్లు రాహుల్ గాంధీని కలిసి తమ సమస్యలను వివరించారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రోజంతా కష్టపడుతున్నప్పటికీ వారికి సరైన ఆదాయ భద్రత లేదని, ప్రమాదాలు జరిగినప్పుడు కుటుంబాలకు అండగా నిలిచే వ్యవస్థ లేదని, తమ హక్కులకు చట్టబద్ధమైన గుర్తింపు కావాలని కోరారని తెలిపారు. వారి సమస్యలను శ్రద్ధగా విన్న రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిగ్ వర్కర్ల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఆ రోజు ఇచ్చిన హామీని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చిందని స్పష్టం చేశారు.
రూ.5 లక్షల జీవిత బీమా.., రూ.10 లక్షల ఆరోగ్య బీమా
గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి గిగ్ వర్కర్‌కు రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించామని, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించే ఏర్పాటు చేశామని వివరించారు. ప్రమాదాలు, అనారోగ్య సమస్యల సమయంలో కార్మికులతోపాటు వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమన్నారు. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి, వారికి గుర్తింపు కార్డులు, ప్రత్యేక గుర్తింపు నంబర్లు అందించే విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఇప్పటివరకు అసంఘటిత రంగంలో పనిచేస్తూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్న కార్మికులకు ఈ చట్టం ద్వారా ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. వారి హక్కులు, సంక్షేమం, ఆదాయ భద్రతకు అవసరమైన వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. గిగ్ వర్కర్లకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని తమ ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకుందని రేవంత్‌రెడ్డి వివరించార. గాంధీ కుటుంబం మాట ఇస్తే దానిని నిలబెట్టుకుంటుందని, ఆ కుటుంబ వారసుడిగా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని ఆయన సమక్షంలోనే అమలు చేయడం సంతోషంగా ఉందన్నారు. గిగ్ వర్కర్ల సమస్యలను గుర్తించి, వారి హక్కుల కోసం ప్రత్యేక చట్టం తీసుకురావడానికి ఆయన అందించిన ప్రోత్సాహం మరువలేనిదని చెప్పారు. ఈ చట్టం రూపకల్పన, అమలు ప్రక్రియలో నిఖిల్ డే తదితరులు ఎంతో సహకారం అందించారని ముఖ్యమంత్రి తెలిపారు. ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు ఆశించకుండా వారు అందించిన సహకారం అభినందనీయమన్నారు. గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన రక్షణ కల్పించడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. గిగ్ వర్కర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చిన ప్రభుత్వం.. ఇకపై కూడా వారి సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ చట్టం ద్వారా కార్మికులకు అందాల్సిన ప్రయోజనాలు క్షేత్రస్థాయిలో అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గిగ్ వర్కర్ల తరఫున రాహుల్ గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.







