భార్యతో గొడవపై ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కామెంట్స్..!
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్, అతని భార్య బెక్కీ మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతున్నట్లుగా ఉన్న ఒక వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై శుక్రవారం సిడ్నీలో జరిగిన విలేకరుల సమావేశంలో కమిన్స్ స్పందిస్తూ అసలు విషయం బయటపెట్టాడు. తమ వ్యక్తిగత జీవితాన్ని ఇలా బహిరంగంగా చర్చించడం కాస్త విడ్డూరంగా ఉందని పేర్కొన్న కమిన్స్, తామిద్దరం అసలు గొడవ పడలేదని స్పష్టం చేశాడు.
మాజీ సహచర ఆటగాడు ఉస్మాన్ ఖవాజా తన ఆత్మకథ ‘సబర్’ (Sabr)లో 2018 సాండ్‌పేపర్ బాల్ ట్యాంపరింగ్ వివాదంపై చేసిన సంచలన ఆరోపణల గురించి తాము మాట్లాడుకుంటున్నామని, ఖవాజా వ్యాఖ్యలపై తన భార్య బెక్కీ తీవ్ర అసహనం, అసంతృప్తితో ఉందని కమిన్స్ వెల్లడించాడు. 2018 దక్షిణాఫ్రికా పర్యటనలో మైదానంలోకి సాండ్‌పేపర్ తీసుకెళ్లే విషయం కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లియాన్‌లకు ముందే తెలుసని ఖవాజా తన పుస్తకంలో పేర్కొనడాన్ని కమిన్స్ తీవ్రంగా ఖండించాడు.
ఇవి కూడా చదవండి
బాల్ ట్యాంపరింగ్ కుట్రకు తాము సూత్రధారులమని ఖవాజా చెప్పడం పూర్తిగా అర్థరహితమని, గత ఎనిమిదేళ్లుగా తాను చెబుతున్నట్లుగానే ఆ విషయం తనకు అస్సలు తెలియదని కమిన్స్ తేల్చి చెప్పాడు. ఖవాజా తనకు మంచి స్నేహితుడే అయినప్పటికీ, తన పుస్తకంలో సహచర ఆటగాళ్ల జీవితాలు, ప్రతిష్ట, ఆస్ట్రేలియా క్రికెట్ పరువుతో ఎంతో బాధ్యతారహితంగా వ్యవహరించాడని కమిన్స్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఆ చేదు ఘటన ఇప్పటికే ఎంతో మంది ఆటగాళ్లను, వారి కుటుంబాలను మానసికంగా వేధించిందని కమిన్స్ గుర్తు చేశాడు. 15 ఏళ్లుగా కలిసి ఆడిన స్నేహితుడిగా ఖవాజా తన కథను చెప్పుకునే హక్కును తాను గౌరవిస్తానని, కానీ ఇలాంటి సున్నితమైన అంశాలను ఇంత తేలికగా, నిర్లక్ష్యంగా ప్రస్తావించడం సరికాదని కమిన్స్ హితవు పలికాడు. ఖవాజా చేసిన ఈ కొత్త ఆరోపణల వల్ల ఆస్ట్రేలియా క్రికెట్‌పై మరియు అందులోని వ్యక్తులపై తీవ్ర ప్రభావం పడుతోందని కమిన్స్ పేర్కొన్నాడు.







