‘నాకోసం ఒక్క స్పై గర్ల్‌ను పంపరేంటి?’: టెలీగ్రామ్ యాప్ CEO !
ఒక బిలియనీర్ వ్యక్తిగత సంబంధం ఇప్పుడు అంతర్జాతీయ గూఢచర్యం చర్చకు దారితీస్తే.. మరో బిలియనీర్ మాత్రం అదే విషయాన్ని జోక్‌గా మార్చేశారు. ఎన్విడియా బాస్ జెన్సన్ హువాంగ్ చుట్టూ నడుస్తున్న ఎఫైర్, చైనా స్పై ఆరోపణలపై టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
గూఢచార సంస్థలు తమకు నచ్చిన మహిళల ద్వారా శక్తిమంతమైన వ్యక్తులకు దగ్గరవుతాయనే ఆరోపణల నేపథ్యంలో.. తనకు మాత్రం ఇప్పటివరకు ఏ దేశం నుంచి కూడా ఓ స్పై గర్ల్ ఎందుకు రాలేదని ఆయన సెటైర్ వేశారు. ఈ జోక్‌తో అందరూ నవ్వుతారని అనుకున్నారో ఏమో కానీ, నెటిజన్లు మాత్రం ఆయన్ను గట్టిగానే నిలదీస్తున్నారు. మహిళలను డేటింగ్ ఆప్షన్లుగా చూపించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఆసియా అమ్మాయిలంటే ఇష్టం లేకపోతే స్పై ఏజెన్సీలు పట్టించుకోవా?
జెన్సన్ హువాంగ్ వ్యవహారంపై సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ వస్తున్న సమయంలో పావెల్ దురోవ్ కూడా తనదైన శైలిలో స్పందించారు. ఆసియా మహిళలపై ఆసక్తి లేని సీఈఓలకు గూఢచార సంస్థల నుంచి డేటింగ్ అవకాశాలు తక్కువగా ఉంటాయంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. అంతేకాదు, ఫ్రాన్స్, రష్యా, ఇరాన్ దేశాల గూఢచార సంస్థలు తనకు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ‘హనీపాట్’ ప్రయత్నం చేయలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
“ఆసియా అమ్మాయిలపై ఆసక్తి లేని సీఈఓలకు స్పై ఏజెన్సీల నుంచి డేటింగ్ ఆప్షన్లు తక్కువగా రావడం అన్యాయం. మరి ఫ్రాన్స్, రష్యా, ఇరాన్ దేశాల హనీపాట్లు ఎక్కడ?” అంటూ ఎక్స్‌లో రాశారు. ఆ తర్వాత మరో అడుగు ముందుకేసి, తన దగ్గరకు ఒక్క స్పై గర్ల్‌ను కూడా పంపలేదని, అసలు ఆ దేశాల నిఘా సంస్థలు ప్రయత్నిస్తున్నాయా లేదా అని ప్రశ్నించారు. ఫ్రాన్స్‌ను మాత్రం మినహాయించాలని, అక్కడి నిర్ణయాధికారులకు అమ్మాయిలపై ఆసక్తి ఉండదని మరో సెటైర్ వేశారు.
ఇక్కడ దురోవ్ ఉపయోగించిన ‘హనీపాట్’ అనే పదానికి గూఢచర్య ప్రపంచంలో ప్రత్యేకమైన అర్థం ఉంది. ఒక వ్యక్తికి దగ్గరవ్వడానికి ప్రేమ, ఆకర్షణ లేదా డేటింగ్ను సాధనంగా ఉపయోగించుకుని, ఆ తర్వాత అతడి దగ్గరున్న రహస్య సమాచారాన్ని సేకరించే వ్యూహాన్ని హనీపాట్ అంటారు. జెన్సన్ హువాంగ్‌పై వచ్చిన ఆరోపణలను ఉద్దేశించే దురోవ్ ఈ పదాన్ని ఉపయోగించారు.
జోక్ అనుకున్నారు.. కానీ మహిళలను కించపరిచారంటూ విమర్శలు!
దురోవ్ పోస్ట్ చూసిన నెటిజన్లు మాత్రం ఆయన హాస్యాన్ని పెద్దగా ఆస్వాదించలేదు. వేర్వేరు దేశాలకు చెందిన మహిళలను గూఢచార సంస్థలు పంపించే డేటింగ్ ఆప్షన్లుగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గూఢచర్య ఆరోపణలు చిన్న విషయం కాదని, వాటిని ఇలా సరదాగా తీసుకోవడం కూడా సరికాదని అభిప్రాయపడ్డారు.
ఒక యూజర్ ఆయన వ్యాఖ్యలను ‘క్రింజ్’ అంటూ కొట్టిపారేయగా, మరొకరు రష్యాతో దురోవ్‌కు ఉన్న సంబంధాలనే ప్రస్తావించారు. రష్యా ప్రభుత్వంతోనే మీకు సంబంధాలున్నప్పుడు, ఆ దేశం మీ దగ్గరకు హనీపాట్ను ఎందుకు పంపిస్తుందని ప్రశ్నించారు. ఇరాన్ మహిళల ప్రస్తావనపైనా కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరాన్ మహిళలకు కూడా గౌరవం ఉందని, వారిని మీ డేటింగ్ జోకుల్లో భాగం చేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు.
మరికొందరు అయితే దురోవ్‌కు ఇప్పటికే మంచి భాగస్వామి ఉన్నప్పటికీ, ఇంకా ఫ్రాన్స్, రష్యా, ఇరాన్ దేశాల నుంచి స్పై గర్ల్స్ కోసం ఎదురుచూస్తున్నారా అంటూ వ్యంగ్యంగా స్పందించారు. మొత్తానికి ఓ సరదా పోస్ట్‌గా మొదలైన వ్యవహారం మహిళల పట్ల ఆయన వైఖరిపై చర్చకు దారితీసింది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







