ఎఫైర్ ఒక్కటే కాదు: షాకిస్తున్న ఆలిస్ హువాంగ్ చీకటి రహస్యాలు!
బిలియన్ల డాలర్ల విలువైన చిప్స్.. దేశాలు దాటుతున్న రహస్య సర్వర్లు.. తెర వెనుక నడుస్తున్న అంతర్జాతీయ ఒప్పందాలు.. ఒకవైపు అమెరికా నిఘా.. మరోవైపు చైనా గూఢచర్య ఆరోపణలు!
ఈ వ్యవహారంలో అసలు కీలక పాత్రధారి ఎవరో తెలుసుకునేలోపే ఓ మహిళ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. ఆమె ఆలిస్ హువాంగ్. Nvidia నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక AI చిప్స్ చుట్టూ మొదలైన అనుమానాలు, ఆమె నిర్వహించిన మెగాస్పీడ్ వ్యాపారం, అనూహ్యంగా పెరిగిన కంపెనీ ఆస్తులు.. ఒక్కొక్కటిగా కొత్త ప్రశ్నలను తెరపైకి తెస్తున్నాయి.
అమెరికా ఆమెను చైనా గూఢచారిగా అనుమానిస్తోంది. సింగపూర్ మాత్రం పోలీసుల విచారణలో తప్పుడు సమాచారం ఇచ్చారన్న కారణంతో ఆమెకు తమ దేశంలోకి ప్రవేశం లేకుండా చేసింది. కానీ ఈ కథలో అసలు ట్విస్ట్ ఇంకా మిగిలే ఉంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన AI టెక్నాలజీ చుట్టూ సాగిన ఈ వ్యవహారంలో ఎవరు ఏం పొందారు? ఆలిస్ హువాంగ్ వెనుక ఉన్న అసలు వ్యాపార ప్రయోజనాలేంటి?
చైనా గూఢచారి ఆరోపణలు.. Nvidiaతో వ్యక్తిగత సంబంధాలు!
ఆలిస్ హువాంగ్ పేరు ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయిలో చర్చకు రావడానికి కారణం ఆమెకు ఉన్న వ్యాపార సంబంధాలు మాత్రమే కాదు. Nvidia సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణలు కూడా ఈ వ్యవహారాన్ని మరింత సంచలనంగా మార్చాయి. అంతేకాదు, అమెరికా నిఘా వర్గాలు ఆమె చైనా కోసం పనిచేసిన వ్యక్తిగా అనుమానిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది.
ఇక్కడే అమెరికా భద్రతా సంస్థలకు మరో కోణం కనిపించింది. ప్రపంచంలో అత్యంత కీలకమైన AI చిప్స్ తయారు చేస్తున్న Nvidia అధినేతకు దగ్గరగా ఉన్న వ్యక్తికి, మరోవైపు చైనా వ్యాపార వర్గాలతో సంబంధాలు ఉంటే.. అది కేవలం వ్యక్తిగత వ్యవహారంగా చూడాలా? లేక అమెరికా సాంకేతిక ప్రయోజనాలకు సంబంధించిన భద్రతా సమస్యగా పరిగణించాలా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.
Nvidia చిప్స్ నుంచి మెగాస్పీడ్ బిలియన్ల వ్యాపారం వరకు!
ఈ కథలో అత్యంత కీలకమైన పేరు మెగాస్పీడ్. సింగపూర్‌లో నమోదైన ఈ క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సెంటర్ కంపెనీకి ఆలిస్ హువాంగ్ గతంలో సీఈఓగా, చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. కంపెనీపై కీలక నియంత్రణ కలిగిన వ్యక్తుల్లో ఆమె కూడా ఒకరు. Nvidia నుంచి భారీ మొత్తంలో అధునాతన AI చిప్స్ కొనుగోలు చేసిన సంస్థగా మెగాస్పీడ్ పేరు తెరపైకి రావడంతో అమెరికా అధికారుల దృష్టి దీనిపై పడింది.
అమెరికా, చైనా మధ్య AI ఆధిపత్య పోరు తీవ్రంగా సాగుతున్న సమయంలో ఈ చిప్స్‌కు సాధారణ వస్తువులకంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే అత్యాధునిక GPUలు భారీ AI మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి, సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థలను నిర్మించడానికి అవసరం. చైనా సైనిక, వ్యూహాత్మక సామర్థ్యాలను పెంచేందుకు ఉపయోగపడే టెక్నాలజీ కూడా ఇదే కావచ్చన్న ఆందోళనతో అమెరికా వాటి ఎగుమతులపై కఠినమైన నియంత్రణలు విధించింది.
అలాంటి సమయంలో Nvidia చిప్స్ కొనుగోలు చేసిన మెగాస్పీడ్పై అమెరికా అధికారులు అనుమానాలు వ్యక్తం చేయడం చిన్న విషయం కాదు. ఈ సంస్థ అమెరికా ఎగుమతి నియంత్రణలను తప్పించుకుని చైనా కంపెనీలకు అధునాతన చిప్స్ చేరవేసేందుకు సహకరించిందా? కొనుగోలు చేసిన చిప్స్ అసలు ఎక్కడికి వెళ్లాయి? వాటి తుది వినియోగదారులు ఎవరు? అన్న అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
అయితే ఇక్కడ ఒక కీలకమైన తేడా ఉంది. మెగాస్పీడ్ Nvidia నుంచి చిప్స్ కొనుగోలు చేసిందన్న విషయం, ఆలిస్ ఆ వ్యాపారంలో కీలకంగా వ్యవహరించారన్న విషయం ఒకటి. ఆ చిప్స్‌ను చైనాకు అక్రమంగా తరలించడంలో ఆమె వ్యక్తిగతంగా పాల్గొన్నారని నిరూపించడం మరో విషయం. రెండో అంశానికి సంబంధించి తుది నిర్ధారణ ఇంకా వెలువడలేదు.
రెండేళ్లలో 90 రెట్లు పెరిగిన ఆస్తులు.. ఈ లెక్కల వెనుక ఏముంది?
మెగాస్పీడ్ ఆర్థిక గణాంకాలు పరిశీలిస్తే ఈ కథలో మరో ఆసక్తికరమైన అధ్యాయం కనిపిస్తుంది. సింగపూర్ రికార్డుల ప్రకారం 2022లో కంపెనీ మొత్తం ఆస్తుల విలువ కేవలం 75 అమెరికన్ డాలర్లు మాత్రమే. 2023లో అవి 3.29 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. కానీ 2024లో మాత్రం ఏకంగా 298 కోట్ల డాలర్లకు పెరిగాయి. అంటే ఒక్క ఏడాదిలోనే కంపెనీ ఆస్తులు దాదాపు 90 రెట్లు పెరిగాయన్నమాట.
ఆదాయం కూడా ఇదే తరహాలో పెరిగింది. 2023లో దాదాపు శూన్య స్థాయిలో ఉన్న ఆదాయం 2024లో 29.4 కోట్ల డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో అప్పులు కూడా భారీగా పెరిగాయి. 2023లో 2.29 కోట్ల డాలర్లుగా ఉన్న మొత్తం బకాయిలు 2024 నాటికి దాదాపు 300 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి.
ఇంత తక్కువ సమయంలో ఒక కంపెనీ ఆస్తులు, ఆదాయం, అప్పులు ఈ స్థాయిలో పెరగడం సహజంగానే అనేక ప్రశ్నలకు దారితీస్తుంది. మెగాస్పీడ్ వ్యాపారం వెనుక అసలు పెట్టుబడులు ఎవరివి? Nvidia చిప్స్ కొనుగోళ్లకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? కంపెనీ నిర్వహిస్తున్న డేటా సెంటర్లకు సంబంధించిన ఒప్పందాలు ఎవరితో జరిగాయి? ఈ వ్యాపారంలో ఆలిస్ హువాంగ్‌కు ఉన్న ఆర్థిక ప్రయోజనాలేమిటి?
సింగపూర్ మీదుగా వెళ్లిన సర్వర్లు.. అసలు గమ్యం ఎక్కడ?
మెగాస్పీడ్పై సింగపూర్ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించడానికి మరో ముఖ్యమైన కారణం సర్వర్ల కొనుగోళ్లు, వాటి ఎగుమతులు. కొన్ని కంపెనీలు కొనుగోలు చేసిన భౌతిక సర్వర్లు సింగపూర్ మీదుగా మలేషియాకు తరలించబడ్డాయి. అయితే ఆ సర్వర్లు సింగపూర్ మార్కెట్లోకి ప్రవేశించలేదు. ఇక్కడే అధికారులకు అనుమానం వచ్చింది.
మలేషియాకు చేరిన తర్వాత ఆ సర్వర్లు మరేదైనా దేశానికి తరలించారా? అలా జరిగితే సింగపూర్ అధికారులకు సమర్పించిన పత్రాల్లో పేర్కొన్న గమ్యస్థానాలు నిజమైనవేనా? అన్న కోణంలో విచారణ సాగింది. ముఖ్యంగా సర్వర్ల అసలు తుది వినియోగదారులు ఎవరు, వాటి ప్రయాణ మార్గంలో ఏమైనా వివరాలు దాచారా అన్నది తెలుసుకోవాలని అధికారులు ప్రయత్నించారు.
ఆలిస్‌కు సింగపూర్ షాక్.. పోలీసుల దగ్గర ఏం దాచారు?
అమెరికా దర్యాప్తు ఒకవైపు కొనసాగుతుండగానే సింగపూర్ అధికారులు ఆలిస్ హువాంగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మెగాస్పీడ్ వ్యవహారంపై విచారణ జరుపుతున్న సమయంలో కంపెనీలో తన అసలు పాత్రను ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపించారని గుర్తించారు. పోలీసులకు తనకు తెలిసినప్పటికీ తప్పుడు సమాచారం ఇచ్చారని సింగపూర్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మళ్లీ సింగపూర్‌లోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు.
అమెరికా కంపెనీ దగ్గరే దొరకని సమాచారం.. సింగపూర్‌కు ఎందుకీ ఇబ్బంది?
ఈ వ్యవహారంలో సింగపూర్ అధికారులు ఎదుర్కొన్న మరో సమస్య అమెరికాకు చెందిన సూపర్‌మైక్రో (Supermicro) కంపెనీ నుంచి అవసరమైన సమాచారం సేకరించడం. మెగాస్పీడ్కు సర్వర్లు సరఫరా చేసిన ఈ సంస్థ నుంచి కీలక వివరాలు కావాలని సింగపూర్ పోలీసులు కోరారు. కానీ కంపెనీ నుంచి పరిమిత స్థాయిలోనే సహకారం లభించిందని సింగపూర్ ప్రభుత్వం వెల్లడించింది.
మెగాస్పీడ్ ఏం చెబుతోంది?
తమపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మెగాస్పీడ్ కూడా స్పందించింది. అమెరికా బ్యూరో ఆఫ్ ఇండస్ట్రీ అండ్ సెక్యూరిటీ నిర్వహించిన తనిఖీలకు తాము సహకరించామని కంపెనీ డైరెక్టర్ టాన్ యోంగ్ పొంగ్ తెలిపారు. ఎగుమతి నియంత్రణ నిబంధనలను తాము అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పష్టం చేశారు.ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే విచారణలకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
అసలు ఆట ఎక్కడ జరిగింది? ఎవరు లాభపడ్డారు?
ఆలిస్ హువాంగ్ చుట్టూ ఉన్న వివాదంలో ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నలు చాలానే ఉన్నాయి. Nvidia నుంచి కొనుగోలు చేసిన చిప్స్ ద్వారా మెగాస్పీడ్ ఎంత వ్యాపారం చేసింది? ఆ చిప్స్ చివరకు ఎవరికి చేరాయి? కంపెనీ ఆస్తులు ఒక్క ఏడాదిలో 90 రెట్లు పెరగడానికి కారణమైన ఒప్పందాలు ఏమిటి? ఈ మొత్తం వ్యవహారంలో ఆలిస్ హువాంగ్‌కు వ్యక్తిగతంగా ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు కలిగాయి? ఇవన్నీ తేలాల్సి ఉంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







