అంతరిక్షంలోనూ మనోళ్లదే హవా.. AIని అక్కడికే తీసుకెళ్లిన భారతీయ స్టార్టప్‌లు!
ఒకప్పుడు అంతరిక్షం అనగానే అమెరికా, రష్యా, చైనా వంటి దేశాల పేర్లే వినిపించేవి. ఉపగ్రహాలు తయారు చేయడం, వాటిని రాకెట్ల ద్వారా అంతరిక్షంలోకి పంపించడం అంటే ప్రభుత్వాల వల్లే సాధ్యమయ్యే వ్యవహారంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఒకప్పుడు ప్రభుత్వాల ఆధిపత్యంలో ఉన్న అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ కంపెనీలు అడుగుపెడుతున్నాయి. అందులోనూ భారతీయ స్టార్టప్‌లు తమదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నాయి.
దీనికి తాజా ఉదాహరణ SpaceX చేపట్టిన Transporter-18 మిషన్. ఈ రాకెట్లో భారతదేశానికి చెందిన మూడు స్టార్టప్‌లు రూపొందించిన టెక్నాలజీలు అంతరిక్షంలోకి వెళ్లాయి. వీటిలో ఒకటి భూమిపై మన కంటికి కనిపించని వేడిని కూడా గుర్తించగలదు. మరొకటి ఉపగ్రహంలోనే AIని ఉపయోగించి లెక్కలు వేస్తుంది. ఇంకొకటి ఇతర దేశాల కంపెనీలు, యూనివర్సిటీలు తమ ప్రయోగాలను అంతరిక్షంలో పరీక్షించుకునేందుకు అవకాశం కల్పిస్తుంది.
ఇక్కడ ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే..
ఈ మూడు సంస్థలూ ఒకే రకమైన టెక్నాలజీతో పనిచేయడం లేదు. ఒక్కొక్కటి అంతరిక్ష వ్యాపారంలోని ఒక్కో సమస్యకు పరిష్కారం చూపిస్తున్నాయి. అహ్మదాబాద్‌కు చెందిన SatLeo Labs, హైదరాబాద్‌కు చెందిన TakeMe2Space, Dhruva Space సంస్థలు ఈ ప్రయోగాల్లో భాగమయ్యాయి. భారత అంతరిక్ష రంగాన్ని ప్రోత్సహిస్తూ, నియంత్రించే IN-SPACe నుంచి వీటికి అనుమతులు లభించాయి.
IN-SPACe ఛైర్మన్ పవన్ గోయెంకా కూడా ఈ ప్రయోగాన్ని భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఒక గొప్ప రోజుగా అభివర్ణించారు. ఒకే రాకెట్లో థర్మల్ ఇమేజింగ్, అంతరిక్షంలో AI కంప్యూటింగ్, ఇతర కంపెనీలకు ఉపగ్రహ వేదిక కల్పించే టెక్నాలజీలు ప్రయాణించడం నిజంగానే ప్రత్యేకమైన విషయం. అసలు ఈ మూడు స్టార్టప్‌లు ఏం చేస్తున్నాయి? వాటి టెక్నాలజీ రేపు మన జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాగలదు?
కంటికి కనిపించని వేడిని కూడా గుర్తించే టెక్నాలజీ!
ముందుగా SatLeo Labs రూపొందించిన TAPAS-1 గురించి తెలుసుకోవాలి. ఇది సాధారణ కెమెరా కాదు. భూమిపై ఉన్న ప్రాంతాల నుంచి వెలువడే వేడిని గుర్తించి సమాచారంగా మారుస్తుంది. ఉదాహరణకు ఒక పొలంలో పంటకు నీటి కొరత ఏర్పడినా, అది బయటకు కనిపించేలోపే మొక్కల ఉష్ణోగ్రతల్లో మార్పులు రావచ్చు. వాటిని ఈ థర్మల్ సెన్సర్లు గుర్తించగలవు. దీంతో పంట దెబ్బతినకముందే రైతులు అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది. అడవుల్లో కార్చిచ్చును గుర్తించడం, నగరాల్లో ఎక్కడ వేడి ఎక్కువగా ఉందో తెలుసుకోవడం, పారిశ్రామిక ప్రాంతాలను పర్యవేక్షించడం వంటి పనులకూ ఇది ఉపయోగపడుతుంది.
ఇవి కూడా చదవండి
ఒక ప్రైవేట్ భారతీయ సంస్థ రూపొందించిన తొలి కమర్షియల్ థర్మల్ ఇమేజింగ్ పేలోడ్గా TAPAS-1ను పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఇది ప్రయోగాత్మక దశలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ఉపగ్రహాలను పంపించి ఒక నెట్వర్క్ ఏర్పాటు చేయాలని SatLeo Labs లక్ష్యంగా పెట్టుకుంది. రోజుకు రెండుసార్లు ఒకే ప్రాంతాన్ని పరిశీలించేలా, 10 మీటర్ల కంటే మెరుగైన రిజల్యూషన్‌తో చిత్రాలను అందించాలని భావిస్తోంది. ఈ సంస్థ ఇప్పటికే 5.5 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. అహ్మదాబాద్, తుమకూరులో పట్టణ ఉష్ణోగ్రతలు, వాయు కాలుష్య పర్యవేక్షణకు పైలట్ ప్రాజెక్టులు కూడా చేపట్టింది.
భూమికి డేటా పంపకుండానే అంతరిక్షంలో AI!
హైదరాబాద్‌కు చెందిన TakeMe2Space రూపొందించిన MOI-1A ఈ మిషన్‌లో మరో ప్రత్యేక ఆకర్షణ. సాధారణంగా ఉపగ్రహాలు భూమిని ఫొటోలు తీసి, భారీ మొత్తంలో డేటాను భూమిపై ఉన్న కేంద్రాలకు పంపిస్తాయి. అక్కడే కంప్యూటర్లు ఆ సమాచారాన్ని విశ్లేషిస్తాయి. అయితే డేటా పరిమాణం పెరుగుతున్న కొద్దీ దాన్ని భూమికి పంపించడం కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారుతోంది. ఈ సమస్యకు TakeMe2Space కొత్త పరిష్కారం చూపిస్తోంది. డేటాను అంతరిక్షంలోనే విశ్లేషించి, అవసరమైన ఫలితాలను మాత్రమే భూమికి పంపించడం దీని ప్రత్యేకత.
MOI-1Aలో Nvidia Orin NX ప్రాసెసర్లను అమర్చారు. కస్టమర్లు తమ AI మోడళ్లను ఉపగ్రహంలోకి అప్లోడ్ చేయవచ్చు. ఉదాహరణకు ఒక వ్యవసాయ సంస్థకు పంటల పరిస్థితి తెలుసుకోవాలంటే.. వేలాది ఉపగ్రహ చిత్రాలను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా, ఉపగ్రహంలోనే AI వాటిని విశ్లేషించి పంట ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని పంపిస్తుంది. అయితే ఇది భారీ AI డేటా సెంటర్ కాదు. 50 కిలోల కంటే తక్కువ బరువు, సుమారు 150 వాట్ల విద్యుత్ సామర్థ్యంతో పనిచేసే చిన్న ఎడ్జ్ కంప్యూటింగ్ ఉపగ్రహం మాత్రమే.
ఈ మిషన్ కోసం ఇప్పటికే 23 మంది కస్టమర్లను సంస్థ సంపాదించింది. అమెరికాకు చెందిన Little Place Labs కూడా వారిలో ఉంది. అయితే ఈ ప్రయాణంలో సంస్థకు ఎదురుదెబ్బలు కూడా తగిలాయి. 2026 జనవరిలో ఇస్రో PSLV-C62 ద్వారా ప్రయోగించిన MOI-1 రాకెట్ వైఫల్యంతో కోల్పోయింది. ఇప్పుడు MOI-1A దానికి ప్రత్యామ్నాయంగా అంతరిక్షంలోకి వెళ్లింది. భవిష్యత్తులో ఆరు ఉపగ్రహాలతో నెట్వర్క్ ఏర్పాటు చేయడంతో పాటు, 2028 చివర్లో మరో రెండు భారీ ఉపగ్రహాలను ప్రయోగించాలని కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
సొంత ఉపగ్రహం లేకపోయినా అంతరిక్షంలో ప్రయోగాలు చేయొచ్చు!
మూడో సంస్థ Dhruva Space ఆలోచన మరింత భిన్నంగా ఉంటుంది. ఒక చిన్న కంపెనీ కొత్త సెన్సర్ తయారు చేసిందనుకుందాం. అది అంతరిక్షంలో పనిచేస్తుందో లేదో పరీక్షించాలంటే ప్రత్యేకంగా ఉపగ్రహాన్ని తయారు చేయాలి. రాకెట్లో స్థానం సంపాదించాలి. గ్రౌండ్ స్టేషన్ ఏర్పాట్లు చేసుకోవాలి. ఇవన్నీ భారీ ఖర్చుతో కూడుకున్నవి. Dhruva Space మాత్రం ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తోంది. ఇతర కంపెనీలు తమ పరికరాలను తన ఉపగ్రహంలో అమర్చుకుని అంతరిక్షంలో పరీక్షించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
P-30 అనే ఉపగ్రహ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ సేవలను అందిస్తోంది. LEAP కార్యక్రమం కింద ప్రయోగ పరికరాలను అమర్చడం నుంచి రాకెట్లోకి పంపించడం, గ్రౌండ్ స్టేషన్ సపోర్ట్, మిషన్ నిర్వహణ వరకు కంపెనీ బాధ్యత తీసుకుంటుంది. గతంలో LEAP-1 మిషన్ ద్వారా ఆస్ట్రేలియాకు చెందిన Akula Tech, Esper Satellites సంస్థల పరికరాలను అంతరిక్షంలోకి పంపించింది. ఇప్పుడు LEAP-2లో మరో నాలుగు పేలోడ్లను తీసుకెళ్తోంది. ఫ్రాన్స్‌కు చెందిన Sodern సంస్థ రూపొందించిన HORUS స్టార్ ట్రాకర్ కూడా ఇందులో ఉంది.
Dhruva Space ఇప్పటివరకు సుమారు 24 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. అంతేకాదు, 500 కిలోల సామర్థ్యం కలిగిన ఉపగ్రహ ప్లాట్‌ఫామ్ Project Garud అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ RDI ఫండ్ నుంచి రూ.105 కోట్ల గ్రాంట్ కూడా అందుకుంది. అంటే ఇతరుల ప్రయోగాలకు వేదిక కల్పించడంతో పాటు, భవిష్యత్తులో భారీ ఉపగ్రహ వ్యవస్థలను నిర్మించే దిశగా కూడా అడుగులు వేస్తోంది.
ప్రపంచ అంతరిక్ష మార్కెట్లో భారత్‌కు కొత్త స్థానం!
ఈ మూడు స్టార్టప్‌ల ప్రయోగాలను గమనిస్తే భారత అంతరిక్ష రంగంలో వస్తున్న మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక సంస్థ భూమిపై జరిగే మార్పులను గుర్తిస్తుంటే, మరో సంస్థ అంతరిక్షంలోనే AIతో డేటాను విశ్లేషిస్తోంది. ఇంకొకటి ఇతర కంపెనీలకు అంతరిక్ష ప్రయోగాల కోసం వేదికను అందిస్తోంది. అంటే భారతీయ కంపెనీలు ఇప్పుడు ఉపగ్రహాల తయారీ దగ్గరే ఆగిపోకుండా, అంతరిక్ష వ్యాపారంలోని అన్ని విభాగాల్లోకి ప్రవేశిస్తున్నాయి.
IN-SPACe ఛైర్మన్ పవన్ గోయెంకా వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత్‌లో సుమారు 450 స్పేస్ స్టార్టప్‌లు ఉన్నాయి. వీటిలో దాదాపు 20 సంస్థలు తమ వ్యాపారాలను విస్తరించే స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే Pixxel వంటి భారతీయ కంపెనీలు అంతర్జాతీయ కస్టమర్లను సంపాదించుకుంటున్నాయి. Skyroot వంటి సంస్థలు ప్రైవేట్ రాకెట్ ప్రయోగాల దిశగా ప్రయత్నిస్తున్నాయి.
అయితే భారతీయ స్టార్టప్‌లు ఇంకా SpaceX వంటి విదేశీ రాకెట్లపై ఆధారపడాల్సి వస్తోంది. మన దేశంలోనే ప్రైవేట్ రాకెట్ ప్రయోగ సామర్థ్యం పెరగాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో అంతరిక్షంలోకి పంపిన టెక్నాలజీ అక్కడ సరిగ్గా పనిచేయడం, దాని సేవలకు కస్టమర్లు డబ్బు చెల్లించడం కూడా కీలకం.
ఒకప్పుడు అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపించడమే భారత్‌కు పెద్ద విజయం. ఇప్పుడు భారతీయ కంపెనీలు తయారు చేసిన టెక్నాలజీని ప్రపంచ దేశాలు ఉపయోగించుకునే స్థాయికి ఎదగడం మరో పెద్ద లక్ష్యం. ఆ దిశగా ఈ మూడు స్టార్టప్‌లు వేసిన అడుగు.. భారత ప్రైవేట్ స్పేస్ రంగానికి కొత్త ఆశలు కల్పిస్తోంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







