2,000 కోట్ల రామాయణం.. కాస్తా ఇప్పుడు రూ.500 కోట్లుగా మారిపోయిందేంటి?
సినిమాల బడ్జెట్లందు భారీ చిత్రాల లెక్కలు వేరయా..
ఆడితే ఒక లెక్క.. ఆడకపోతే మరో లెక్కయా!
పెద్ద సినిమాల బడ్జెట్ లెక్కలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సినిమా విడుదలకు ముందు ఒక అంకె వినిపిస్తుంది. విడుదలయ్యాక మరో లెక్క తెరపైకి వస్తుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు అంచనాలను అందుకోకపోతే బడ్జెట్ లెక్కలు కూడా దానికి తగినట్లుగా మారిపోతుంటాయి. పెట్టుబడి ఎంత పెట్టారనే దానికంటే.. సినిమా ఎంత వసూలు చేసిందనే దాన్ని బట్టి బడ్జెట్ గురించి కొత్త కొత్త లెక్కలు పుట్టుకొస్తుంటాయి. ఇప్పుడు బాలీవుడ్ భారీ చిత్రం రామాయణ విషయంలోనూ ఇదే జరుగుతోందా?
నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ నటించిన రామాయణ విడుదలకు ముందు నుంచే బడ్జెట్ విషయంలో భారీ అంచనాలు సృష్టించింది. ఈ సినిమాను దాదాపు రూ.2,000 కోట్లతో నిర్మిస్తున్నారని, రెండు భాగాలకు కలిపి మొత్తం రూ.4,000 కోట్లు ఖర్చు చేస్తున్నారని బాలీవుడ్ మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా రామాయణ నిలవబోతోందనే చర్చ కూడా సాగింది. కానీ సినిమా విడుదలైన తర్వాత బాక్సాఫీస్ లెక్కలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇప్పుడు బడ్జెట్ అంకెలు కూడా మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
మొదట రూ.2,000 కోట్లుగా ప్రచారం చేసిన ఒక్కో భాగం బడ్జెట్ ఇప్పుడు రూ.1,400 కోట్లు, రూ.1,200 కోట్లకు తగ్గిందంటూ సోషల్ మీడియాలో కొత్త లెక్కలు కనిపిస్తున్నాయి. మరికొందరైతే చివరకు ఈ సినిమా బడ్జెట్ రూ.500 కోట్లు మాత్రమేనని చెప్పే స్థాయికి వస్తున్నారని సెటైర్లు వేస్తున్నారు. అసలు సినిమా నిర్మాణానికి ఎంత ఖర్చు చేశారు? ప్రచారానికి ఎంత పెట్టారు? రెండు భాగాల బడ్జెట్ ఎంత? అనే విషయాలపై మాత్రం స్పష్టత కనిపించడం లేదు.
మొదట రూ.2,000 కోట్లు.. ఇప్పుడు కొత్త లెక్కలేంటి?
నిజానికి రామాయణ బడ్జెట్‌పై మొదటి నుంచీ రకరకాల అంచనాలు ఉన్నాయి. తొలుత రూ.500 కోట్ల ప్రాజెక్టుగా మొదలైందని, ఆ తర్వాత నిర్మాణ స్థాయి, సాంకేతిక హంగులు, విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా బడ్జెట్ భారీగా పెరిగిందని కథనాలు వచ్చాయి. చివరకు రెండు భాగాలకు కలిపి రూ.4,000 కోట్లు ఖర్చవుతాయని ప్రచారం జరిగింది. అంటే ఒక్కో భాగానికి రూ.2,000 కోట్లు అన్నమాట. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూ.1,200 కోట్ల లెక్కలో నిర్మాణ వ్యయం రూ.1,200 కోట్లు కాగా, ప్రచారానికి మరో రూ.800 కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. మరోవైపు రూ.1,400 కోట్ల అంకె కూడా ప్రచారంలో ఉంది.
ఇక బాక్సాఫీస్ వసూళ్ల విషయంలోనూ ఇదే గందరగోళం కొనసాగుతోంది. సినిమా మొదటి రోజు రూ.60 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే సినిమా స్థాయి, విడుదలకు ముందు ఏర్పడిన హైప్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఓపెనింగ్ సరిపోలేదని కొందరు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మొదటి నాలుగు రోజులతో పోలిస్తే ఐదో రోజైన సోమవారం కలెక్షన్లలో గణనీయమైన పెరుగుదల కనిపించినప్పటికీ, భారీ పెట్టుబడిని రికవరీ చేయడానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందనే చర్చ జరుగుతోంది.
కలెక్షన్లు తగ్గితే బడ్జెట్ కూడా తగ్గించేస్తారా?
ఇంతటితో ఆగకుండా, కొందరు నెటిజన్లు నిర్మాతలకు అనుకూలంగా ఎక్కువ కలెక్షన్లు చూపించేందుకు ట్రేడ్ వర్గాలకు డబ్బులు చెల్లిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. అయితే వీటికి ఎలాంటి ఆధారాలు లేవు. మరోవైపు థియేటర్లలో ప్రేక్షకుల రద్దీని ప్రత్యక్షంగా చూశామని, అందుకే ఎక్కువ వసూళ్ల లెక్కలు కూడా నిజమేనని కొందరు వాదిస్తున్నారు.
బడ్జెట్ విషయంలో జరుగుతున్న మార్పులపై మాత్రం నెటిజన్లు సెటైర్లతో విరుచుకుపడుతున్నారు. రూ.2,000 కోట్ల పెట్టుబడితో ఒక్కో భాగాన్ని నిర్మించినట్లు ప్రచారం చేసినప్పుడు, ఇప్పుడు వసూళ్లను బట్టి బడ్జెట్ లెక్కలు ఎందుకు మారుతున్నాయనే ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు.
మొత్తానికి రామాయణ చుట్టూ ఇప్పుడు కథ కంటే బడ్జెట్ లెక్కలే ఎక్కువ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఒకవైపు భారీ పెట్టుబడి ప్రచారం.. మరోవైపు బాక్సాఫీస్ వసూళ్లపై వివాదం.. ఇంకోవైపు రోజుకో కొత్త బడ్జెట్ అంకె. ఇంతకీ రామాయణ అసలు బడ్జెట్ ఎంత? నిర్మాతలు స్పష్టత ఇస్తే తప్ప ఈ గందరగోళానికి తెరపడేలా లేదు.
— సూర్య ప్రకాష్ జోశ్యుల







