ఐపీఎల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ట్రేడింగ్..!
ఐపీఎల్(IPL Auction) మినీ వేలానికి ముందే క్రికెట్ ప్రపంచం షాక్ అయ్యే రేంజ్లో ఒక సంచలన ట్రేడింగ్ దాదాపు ఖరారైంది. ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్‌కు మారుతుండగా, పంజాబ్ కింగ్స్ కీలక పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ముంబై ఇండియన్స్ గూటికి చేరుకోబోతున్నాడు. ఈ మేరకు ఇరు ఫ్రాంచైజీల మధ్య ట్రేడింగ్ ఒప్పందం పూర్తయినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. బీసీసీఐ (BCCI) అధికారిక ముద్ర పడటమే ఇక తరువాయి. రోహిత్ శర్మ స్థానంలో ముంబై కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా, కేవలం రెండు సీజన్లకే ముంబై ఫ్రాంచైజీని వదిలి వెళ్లడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ సంచలన డీల్ వెనుక పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ తీసుకున్న మైండ్ గేమే ప్రధాన కారణమని తెలుస్తోంది. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీతో సుదీర్ఘ అనుబంధం ఉండి, టీ20ల్లో ఇండియా లీడింగ్ వికెట్ టేకర్‌గా ఎదిగిన అర్ష్‌దీప్‌ను వదులుకోవడం ఓనర్లకు అంత సులువైన నిర్ణయం కాదు. కానీ, టీమ్‌లో సాలిడ్ ఆల్‌రౌండర్ అవసరాన్ని గుర్తించిన కెప్టెన్, కోచ్‌లు హార్దిక్ పాండ్యా కోసం ఈ ట్రేడింగ్‌కు మొగ్గు చూపారు. విశేషం ఏంటంటే.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ కింద ఒక సాధారణ ప్లేయర్‌గా ఆడటానికి హార్దిక్ పాండ్యా కూడా పూర్తి సంతోషంగా ఒప్పుకున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.
ఎలాంటి కెప్టెన్సీ బాధ్యతలు లేకుండా ఫ్రీగా ఆడితే హార్దిక్ పాత ఫామ్‌ను అందుకోవడం సులువవుతుందని పంజాబ్ భావిస్తోంది. మరోవైపు ముంబై ఇండియన్స్ గూటికి అర్ష్‌దీప్ సింగ్ రాకతో ఆ జట్టు బౌలింగ్ విభాగం మరింత పవర్‌ఫుల్‌గా మారనుంది. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న అర్ష్‌దీప్ రాక కోసం ముంబై యాజమాన్యం కూడా హార్దిక్‌ను వదులుకోవడానికి సిద్ధపడింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో గత మూడు సీజన్లలో ముంబై ఇండియన్స్ రెండుసార్లు ప్లే-ఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేక ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలోనే ముంబై టీమ్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
గాయాల కారణంగా గత ఐపీఎల్ సీజన్ తర్వాత హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు ఎలాంటి కాంపిటీటివ్ క్రికెట్ ఆడలేదు. అయినప్పటికీ అతని ఆల్‌రౌండ్ సత్తాను నమ్మి పంజాబ్ కింగ్స్ ఈ భారీ రిస్క్ చేస్తోంది. నవంబర్ 17 వరకు ప్లేయర్ రిటెన్షన్ గడువును బీసీసీఐ పొడిగించడంతో, ఈ లోపు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి అధికారికంగా ప్రకటించనున్నారు. డిసెంబర్ 16న గోవాలో జరగబోయే మినీ వేలానికి ముందే ఈ ట్రేడింగ్ జరగడం ఐపీఎల్ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. పంజాబ్ కింగ్స్ ఈ ట్రేడింగ్‌తో పాటు మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరాలను కూడా వేలానికి ముందే రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.







