భువనేశ్వర్ కుమార్ చాప్టర్ ముగిసినట్లే: అశ్విన్..!
ఐపీఎల్ 2026 లో అద్భుత ప్రదర్శనతో ఏకంగా 28 వికెట్లు పడగొట్టి, సుదీర్ఘ విరామం తర్వాత భారత టీ20 జట్టులోకి పునరాగమనం చేసిన సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కు(Bhuwaneswar Kumar) భవిష్యత్తులో మళ్లీ అవకాశాలు రావడం కష్టమేనని టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భువీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, అతడికి ఇక భారత జట్టు తలుపులు మూసుకుపోయినట్లేనని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్లో అభిప్రాయపడ్డారు.
న్యూజిలాండ్ పర్యటనలో భువనేశ్వర్ కుమార్ ప్రదర్శన తీవ్ర నిరాశాజనకంగా సాగిందని అశ్విన్ విశ్లేషించారు. ఐపీఎల్లో చెలరేగిన ఫామ్‌కు, ఇక్కడ కనబరిచిన ప్రదర్శనకు ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉందని పేర్కొన్నారు. సిరీస్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో భువీ కేవలం ఒకే ఒక్క వికెట్ సాధించడమే కాకుండా, ఓవర్‌కు 11.50 పరుగుల చొప్పున భారీగా పరుగులు సమర్పించుకున్నాడని గుర్తుచేశారు. రన్స్ ఇవ్వడం పక్కన పెడితే.. ఐపీఎల్లో బౌలింగ్ చేసినప్పటి కంటే ఈ సిరీస్‌లో భువీ రన్-అప్ స్పీడ్, బౌలింగ్ ఇంటెన్సిటీ, వేగం చాలా తక్కువగా కనిపించాయని, అతడు పూర్తి ఫిట్నెస్ ట్రైనింగ్‌తో ఈ సిరీస్‌కు రాలేదనే భావన కలిగిస్తోందని అశ్విన్ పాయింట్ అవుట్ చేశారు.
ఇవి కూడా చదవండి
ఇలాంటి పరిస్థితుల్లో సెలెక్టర్లు కూడా ప్రత్యామ్నాయాల వైపు చూస్తారని అశ్విన్ స్పష్టం చేశారు. యువ ఆటగాళ్లయితే పది అవకాశాలు ఇవ్వొచ్చు కానీ, అనుభవజ్ఞుడైన ఆటగాడు జట్టులోకి తిరిగి వచ్చినప్పుడు ఇలాంటి ప్రదర్శన ఇస్తే కష్టమేనని అన్నారు. ఇదే తరుణంలో, గడిచిన ఏడాదిన్నరగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న మరో సీనియర్ పేసర్ మహమ్మద్ షమీకి ప్రస్తుతం భువీ కంటే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అశ్విన్ పేర్కొన్నారు. బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ ఆడుతున్న షమీ, ప్రస్తుతం భువీ కంటే చాలా మంచి రిథమ్‌లో బౌలింగ్ చేస్తున్నాడని కొనియాడారు. డిసెంబర్లో శ్రీలంకతో జరగబోయే స్వదేశీ టీ20 సిరీస్ నేపథ్యంలో అశ్విన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.







