అమెరికాలో ఇండియన్స్ ఓట్లు తక్కువే.. కానీ ట్రంప్‌కు మాత్రం వాళ్లే పెద్ద టెన్షనా?
అమెరికాలో దాదాపు 34 కోట్ల మంది జనాభా ఉంటే.. అందులో భారతీయ అమెరికన్లు ఎంతమంది ఉంటారు? అక్షరాలా 60 లక్షల లోపే! అంటే మొత్తం జనాభాలో కేవలం 1.5 శాతం మాత్రమే. కానీ అమెరికా రాజకీయాల్లో వీళ్లకు ఉన్న ఇంపార్టెన్స్ మాత్రం ఈ సంఖ్యతో పోలిస్తే చాలా ఎక్కువ. ఎన్నికలు వచ్చాయంటే చాలు.. డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఇద్దరూ ఈ కమ్యూనిటీ ఓట్లపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు. అసలు ఇంత చిన్న ఓటు బ్యాంక్ కోసం అమెరికా రాజకీయ పార్టీలు ఎందుకంత ఆసక్తి చూపిస్తున్నాయి? వాళ్ల ఓట్లు నిజంగానే ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలవా?
2026 అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఇదే ఆసక్తికరమైన చర్చ. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు భారతీయ అమెరికన్ల జీవితాలపై ప్రభావం చూపిస్తున్నాయి. హెచ్-1బీ వీసాలు, గ్రీన్ కార్డులు, ఉద్యోగ అవకాశాలు, అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థుల భవిష్యత్తు.. ఇలా ఎన్నో అంశాలు ఈ ఎన్నికలతో ముడిపడి ఉన్నాయి. అందుకే ఈసారి భారతీయ అమెరికన్ల ఓటింగ్ సరళి రాజకీయ పార్టీలకు చాలా కీలకంగా మారింది.
జనాభాలో 1.5 శాతమే.. కానీ అమెరికాకు వీళ్ల వల్ల భారీ ఆదాయం!
అమెరికాలో భారతీయుల సంఖ్య 60 లక్షల లోపే ఉండొచ్చు. కానీ అక్కడి ఆర్థిక వ్యవస్థలో వాళ్ల కంట్రిబ్యూషన్ మాత్రం చాలా ఎక్కువ. టెక్ కంపెనీల నుంచి ఆసుపత్రుల వరకు, బిజినెస్ నుంచి యూనివర్సిటీల వరకు ఇండియన్స్ ఎక్కడ చూసినా కనిపిస్తారు. అందుకే జనాభా తక్కువైనా ఆర్థికంగా వీళ్ల ఇంపాక్ట్ పెద్దదే.
యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం అంచనాల ప్రకారం.. అమెరికా జనాభాలో కేవలం 1.5 శాతం ఉన్న భారతీయ అమెరికన్లు అక్కడి మొత్తం ఆదాయపు పన్ను ఆదాయంలో దాదాపు 6 శాతం వాటా అందిస్తున్నారు. అంతేకాదు, ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.1 కోట్ల నుంచి 1.2 కోట్ల అమెరికన్ ఉద్యోగాలకు మద్దతు ఇస్తున్నారు.
ఇక అమెరికాలో భారతీయ విద్యార్థుల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2024-25 విద్యా సంవత్సరంలో 3.63 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు అక్కడి యూనివర్సిటీల్లో చదువుతున్నారు. అంతర్జాతీయ విద్యార్థులను అత్యధికంగా పంపిస్తున్న దేశంగా భారత్ మొదటి స్థానంలో ఉంది. అమెరికాలో విదేశాల్లో జన్మించిన వారిలో భారతీయులు రెండో అతిపెద్ద కమ్యూనిటీగా ఉన్నారు.
హెచ్-1బీ వీసాల విషయంలోనూ ఇండియన్లదే హవా. 2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికా జారీ చేసిన హెచ్-1బీ వీసాల్లో ఏకంగా 71 శాతం భారతీయులకే వచ్చాయి. అందుకే అమెరికాలో వీసా రూల్స్ మారినా, ఉద్యోగ నిబంధనలు మారినా ముందుగా ప్రభావితమయ్యేది భారతీయులే. ఈ విషయం రాజకీయ పార్టీలకు కూడా బాగా తెలుసు.
ట్రంప్ పార్టీకి షాకిస్తున్న ఇండియన్ అమెరికన్ ఓటర్లు?
ఈసారి ఎన్నికల్లో అసలు ఆసక్తికరమైన విషయం ఇదే. భారతీయ అమెరికన్లలో చాలామంది డెమొక్రాట్ల వైపు మొగ్గు చూపుతున్నట్లు తాజా సర్వేలు చెబుతున్నాయి.
AAPI Data, APIAVote కలిసి నిర్వహించిన సర్వే ప్రకారం.. సెనేట్ ఎన్నికల్లో 66 శాతం మంది భారతీయ అమెరికన్లు డెమొక్రాటిక్ అభ్యర్థులకు మద్దతు ఇస్తామని చెప్పారు. రిపబ్లికన్లకు ఓటేస్తామని చెప్పినవారు 22 శాతం మాత్రమే. ప్రతినిధుల సభ ఎన్నికల్లోనూ 66 శాతం మంది డెమొక్రాట్లకు, 18 శాతం మంది రిపబ్లికన్లకు మద్దతు తెలిపారు.
ఇవి కూడా చదవండి
కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్, YouGov నిర్వహించిన మరో సర్వేలోనూ ఇదే ట్రెండ్ కనిపించింది. 1,000 మంది భారతీయ అమెరికన్ల అభిప్రాయాలను సేకరించగా, ఓటు హక్కు ఉన్న అమెరికా పౌరుల్లో 62 శాతం మంది తమ నియోజకవర్గంలో డెమొక్రాటిక్ అభ్యర్థికి ఓటేస్తామని చెప్పారు. రిపబ్లికన్లకు మద్దతు ఇస్తామని చెప్పినవారు 19 శాతం మాత్రమే. మరో 12 శాతం మంది ఇంకా డెసిషన్ తీసుకోలేదు.
ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. 2026 జనవరిలో డెమొక్రాట్లకు మద్దతు 57 శాతంగా ఉండేది. అక్టోబర్ నాటికి అది 62 శాతానికి పెరిగింది. అదే సమయంలో రిపబ్లికన్లకు మద్దతు 25 శాతం నుంచి 19 శాతానికి పడిపోయింది. అంటే కొన్ని నెలల్లోనే ఓటర్ల అభిప్రాయాల్లో మార్పు కనిపిస్తోంది.
అయితే ఇండియన్ అమెరికన్లందరూ డెమొక్రాట్లకే సపోర్ట్ చేస్తారని అనుకోవద్దు. సర్వేలో 46 శాతం మంది తమను డెమొక్రాట్లుగా, 19 శాతం మంది రిపబ్లికన్లుగా, 26 శాతం మంది ఇండిపెండెంట్లుగా చెప్పుకున్నారు. అంటే ఈ కమ్యూనిటీలోనూ అన్ని రకాల రాజకీయ అభిప్రాయాలు ఉన్నాయి.
కాలిఫోర్నియా, టెక్సాస్‌లో ఇండియన్స్ ఓట్లే గేమ్ ఛేంజరా?
ఇండియన్ అమెరికన్ల ఓట్లకు ఇంత ఇంపార్టెన్స్ రావడానికి మరో రీజన్ వాళ్లు నివసిస్తున్న ప్రాంతాలు. కాలిఫోర్నియా, న్యూజెర్సీ, టెక్సాస్, జార్జియా, మిషిగన్, న్యూయార్క్ వంటి రాష్ట్రాల్లో భారతీయ అమెరికన్ల జనాభా ఎక్కువగా ఉంది.
కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్లలో వీళ్ల వాటా చాలా ఎక్కువ. ఉదాహరణకు కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెస్ నియోజకవర్గంలో ఏకంగా 18.2 శాతం మంది భారతీయ అమెరికన్లే ఉన్నారు. న్యూజెర్సీలోని 6వ నియోజకవర్గంలో 11.3 శాతం, టెక్సాస్‌లోని 3వ నియోజకవర్గంలో 9 శాతం మంది ఉన్నట్లు అంచనా.
ఇప్పుడు ఒకసారి లెక్క చూడండి. ఒక నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థుల మధ్య గెలుపు తేడా కొన్ని వేల ఓట్లు మాత్రమే ఉంటే.. అక్కడ 10 నుంచి 18 శాతం వరకు ఉన్న ఇండియన్ అమెరికన్ ఓటర్లు ఎంత ఇంపాక్ట్ చూపించగలరో అర్థం చేసుకోవచ్చు. అందుకే అభ్యర్థులు ఈ కమ్యూనిటీని ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు.
ఆసియా ఓటర్ల పవర్ కూడా పెరుగుతోంది!
కేవలం ఇండియన్ అమెరికన్లే కాదు.. అమెరికాలోని మొత్తం ఆసియా అమెరికన్ ఓటర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. 2026 నాటికి అక్కడ ఓటు హక్కు ఉన్న ఆసియా అమెరికన్, పసిఫిక్ ఐలాండర్ ఓటర్లు సుమారు 1.6 కోట్ల మంది ఉన్నట్లు అంచనా. 2022 తర్వాత కొత్తగా ఓటు హక్కు పొందినవారు 16 లక్షల మంది.
2020 నుంచి 2024 మధ్య ఆసియా అమెరికన్ ఓటర్ల సంఖ్య 19 శాతం పెరిగింది. అదే సమయంలో అమెరికా మొత్తం ఓటర్ల సంఖ్యలో పెరుగుదల కేవలం 3 శాతం మాత్రమే. అంటే అమెరికా ఎన్నికల్లో ఆసియా కమ్యూనిటీ ప్రభావం వేగంగా పెరుగుతోందన్నమాట.
ఓటింగ్ విషయంలోనూ వీళ్ల పార్టిసిపేషన్ పెరిగింది. 2014 మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ఆసియా అమెరికన్ల పోలింగ్ శాతం 27 శాతంగా ఉండగా, 2018లో 40 శాతానికి చేరింది. 2022లోనూ అదే స్థాయిలో కొనసాగింది. అయితే ఇవి మొత్తం ఆసియా అమెరికన్ కమ్యూనిటీకి సంబంధించిన గణాంకాలు. భారతీయ అమెరికన్లకు మాత్రమే సంబంధించినవి కావు.
హెచ్-1బీ నుంచి గ్రీన్ కార్డ్ వరకు.. ఎన్నికలతో ఇండియన్స్‌కు ఏంటి సంబంధం?
ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఒక ఇండియన్ టెకీని తీసుకోండి. అతని హెచ్-1బీ వీసా రూల్స్ మారితే పరిస్థితి ఏంటి? గ్రీన్ కార్డ్ కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేస్తున్న కుటుంబానికి కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులకు వీసా నిబంధనలు కఠినమైతే వాళ్ల భవిష్యత్తు ఏమవుతుంది?
ఇవన్నీ పొలిటికల్ న్యూస్‌లా కనిపించినా.. లక్షలాది భారతీయ కుటుంబాల పర్సనల్ లైఫ్‌ను టచ్ చేసే విషయాలు. అందుకే అమెరికాలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? కాంగ్రెస్‌లో ఎవరికి మెజారిటీ వస్తుంది? అనే అంశాలను భారతీయ అమెరికన్లు కూడా చాలా సీరియస్‌గా చూస్తున్నారు.
అయితే అమెరికాలో నివసించే ప్రతి భారతీయుడికి ఓటు హక్కు ఉండదు. అక్కడి పౌరసత్వం ఉన్నవారు మాత్రమే ఫెడరల్ ఎన్నికల్లో ఓటు వేయగలరు. కాబట్టి 60 లక్షల లోపు ఉన్న మొత్తం భారతీయ అమెరికన్ జనాభాను ఓటర్ల సంఖ్యగా చూడకూడదు.
చిన్న ఓటు బ్యాంక్.. కానీ రాజకీయ పార్టీలకు పెద్ద తలనొప్పి!
ఒక విషయం మాత్రం క్లియర్. అమెరికా ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్లు ఒంటరిగా ఫలితాలను డిసైడ్ చేయలేరు. కానీ గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాల్లో వాళ్ల ఓట్లు గేమ్ ఛేంజర్ అయ్యే అవకాశం ఉంది. అందుకే డెమొక్రాట్లు తమకు ఉన్న మద్దతును నిలబెట్టుకోవాలని చూస్తుంటే, రిపబ్లికన్లు తిరిగి భారతీయ అమెరికన్ల నమ్మకాన్ని గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
అమెరికా జనాభాలో 1.5 శాతం మాత్రమే ఉన్న ఇండియన్స్.. ఇప్పుడు అక్కడి రాజకీయ పార్టీలకు ఇంత కీలకంగా మారడం చిన్న విషయం కాదు. ఓట్ల సంఖ్య తక్కువైనా, వాళ్లను నిర్లక్ష్యం చేస్తే ఎన్నికల లెక్కలు మారిపోవచ్చనే విషయం అమెరికా రాజకీయ నాయకులకు బాగా అర్థమైంది!
—- సూర్య ప్రకాష్ జోశ్యుల







