H-1B వీసాలపై ఆంక్షలు: మనవాళ్ళనే కాదు, అమెరికాను కూడా భారీగా దెబ్బతీస్తాయా?
అమెరికా వెళ్లి చదువుకోవాలి.. అక్కడే మంచి జాబ్ కొట్టాలి.. డాలర్లలో సంపాదించాలి.. లైఫ్ సెటిల్ చేసుకోవాలి! మాగ్జిమం ఇండియన్ యూత్ కు ఇదొక డ్రీమ్. ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్నవాళ్లకు H-1B వీసా అంటే గేమ్ ఛేంజర్. కానీ ఇప్పుడు అమెరికాలో పరిస్థితులు చూస్తుంటే ఈ డ్రీమ్‌కు బ్రేకులు పడేలా ఉన్నాయి. ట్రంప్ ప్రభుత్వం విదేశీ ఉద్యోగులపై ఆంక్షలు పెంచే దిశగా అడుగులు వేస్తుండటంతో భారతీయ టెక్ ఉద్యోగులు, విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. ఈ విషయమై అక్కడి భారతీయ ప్రవాసుల సంస్థ ఇండియాస్పోరా ఏమంటోంది, భారతీయులను అమెరికాకు రాకుండా అడ్డుకుంటే నష్టపోయేది ఇండియన్స్ మాత్రమే కాదట! అమెరికా కూడా భారీగా దెబ్బతింటుందని చెప్పటం వెనక అసలు విషయం ఏమిటి..
H-1B ఉద్యోగులు లేకపోతే అమెరికా సిస్టమ్ నడుస్తుందా?
అమెరికాలోని టెక్ కంపెనీల్లో భారతీయుల హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాఫ్ట్వేర్, AI, డేటా సైన్స్.. ఇలా ఎన్నో కీలక విభాగాల్లో ఇండియన్ ప్రొఫెషనల్స్ పనిచేస్తున్నారు. కేవలం ఐటీ మాత్రమే కాదు.. ఆసుపత్రుల్లో వైద్యులుగా, స్కూళ్లలో టీచర్లుగా కూడా భారతీయులు సేవలు అందిస్తున్నారు.
అమెరికాలో స్థానికంగా నిపుణులు దొరకని ప్రాంతాల్లో విదేశీ ఉద్యోగులే కీలకంగా మారుతున్నారు. అలాంటప్పుడు భారతీయులను దూరం చేసుకుంటే అమెరికాకే నష్టం అంటోంది ఇండియాస్పోరా. ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ జోషిపురా చెప్పేదాని ప్రకారం.. భారతీయ H-1B ఉద్యోగులు అమెరికాను ప్రపంచంలోనే ఇన్నోవేషన్ హబ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. వాళ్ల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు బిలియన్ల డాలర్ల ప్రయోజనం కలిగింది. అలాంటి వాళ్లను వెళ్లగొడితే పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు సమస్యలు తప్పవని ఆయన హెచ్చరిస్తున్నారు.
లక్ష డాలర్ల ఫీజు.. కంపెనీలకు ఇది మామూలు షాక్ కాదు!
ఇప్పటివరకు ఒక భారతీయ ఉద్యోగిని అమెరికాకు తీసుకెళ్లాలంటే కంపెనీలు కొన్ని ఖర్చులు భరించేవి. కానీ ఇప్పుడు ప్రతిపాదిస్తున్న నిబంధనలు చూస్తుంటే కంపెనీలకు కూడా దిమ్మతిరిగేలా ఉంది. టెక్నాలజీ, హెల్త్‌కేర్ రంగాల్లో H-1B పిటిషన్లకు లక్ష డాలర్లకు పైగా ఫీజులు విధించే ప్రతిపాదనలు ఉన్నాయి.
ఒక్క ఉద్యోగి కోసం ఇంత భారీ మొత్తం ఖర్చు చేయాల్సి వస్తే కంపెనీలు ఏం చేస్తాయి? అదే స్థానంలో అమెరికాలోనే ఉద్యోగిని వెతుక్కునే ప్రయత్నం చేయొచ్చు. దీంతో విదేశీ ఉద్యోగులకు అవకాశాలు తగ్గిపోతాయి. అంటే టాలెంట్ ఉన్నా సరే.. కంపెనీలకు ఖర్చు ఎక్కువైతే ఉద్యోగం వచ్చే ఛాన్స్ తగ్గినట్టే!
H-1B లాటరీకి గుడ్‌బై చెబితే ఫ్రెషర్ల పరిస్థితి ఏంటి?
ఇప్పటివరకు H-1B వీసా కోసం లాటరీ విధానం ఉండేది. అర్హత ఉన్నవాళ్లలో లాటరీ ద్వారా కొందరికి అవకాశం దక్కేది. కానీ ఇప్పుడు ఈ విధానాన్ని మార్చి ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది.
వినడానికి ఇది బాగానే అనిపించొచ్చు. ఎక్కువ జీతం ఇచ్చే ఉద్యోగులకు ప్రాధాన్యం అంటే స్కిల్‌కు విలువ ఇచ్చినట్టే కదా అనిపించవచ్చు. కానీ అసలు సమస్య ఇక్కడే ఉంది. అమెరికాలో కెరీర్ మొదలుపెట్టాలని చూస్తున్న ఫ్రెషర్లకు ప్రారంభంలో ఎక్కువ జీతాలు రావడం అంత ఈజీ కాదు. అనుభవం తక్కువగా ఉండటంతో వాళ్లకు వీసా దక్కే అవకాశాలు కూడా తగ్గిపోవచ్చు. అంటే సీనియర్లకు ఓకే కానీ, కొత్తగా కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్లకు మాత్రం ఇది బ్యాడ్ న్యూస్!
జాబ్ పోతే 60 రోజుల్లోనే ప్యాకప్ చేయాలా?
అమెరికాలో H-1B వీసాపై ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి ఉద్యోగం పోయిందనుకోండి. వెంటనే దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం లేకుండా మరో ఉద్యోగం వెతుక్కోవడానికి 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ గడువు చాలామందికి కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి ఒక చిన్న రిలీఫ్‌లా ఉంటుంది.
కానీ ఈ 60 రోజుల అవకాశాన్ని తొలగించాలనే ప్రతిపాదన కూడా ఉంది. అదే జరిగితే ఉద్యోగం పోయిన వాళ్లకు కొత్త కంపెనీ వెతుక్కోవడానికి సమయం తగ్గిపోతుంది. ముఖ్యంగా కుటుంబంతో కలిసి అమెరికాలో ఉంటున్నవాళ్లకు ఇది మరింత పెద్ద టెన్షన్. దీనికి తోడు H-1B ఉద్యోగుల జీవిత భాగస్వాములకు ఇచ్చే H-4 వర్క్ పర్మిట్లను కూడా నిలిపివేయాలనే ప్రతిపాదన ఉంది. అంటే కుటుంబంలో ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ లైఫ్ నడిపించుకునే వాళ్లకు కూడా కష్టాలు మొదలయ్యే అవకాశం ఉంది.
అమెరికాలో చదివే ఇండియన్ స్టూడెంట్స్‌కు మరో షాక్!
అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే భారతీయ విద్యార్థులకు అసలైన టార్గెట్ ఏంటో తెలుసా? మంచి యూనివర్సిటీలో చదవడం, డిగ్రీ పూర్తిచేయడం, ఆ తర్వాత అక్కడే ఉద్యోగం సంపాదించడం. ఈ ప్రయాణంలో OPT, STEM OPT చాలా కీలకం.
ఈ విధానాల ద్వారా అర్హత ఉన్న విదేశీ విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో కొంతకాలం పనిచేసి అనుభవం సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా టెక్నాలజీ, ఇంజినీరింగ్, సైన్స్ రంగాల్లో చదివే వాళ్లకు ఇది మంచి అవకాశం.
కానీ ఇప్పుడు ఈ OPT, STEM OPT అనుమతుల కోసం కూడా 70 వేల డాలర్ల వరకు ఫీజులు విధించే ప్రతిపాదనలు ఉన్నాయని ఇండియాస్పోరా చెబుతోంది. ఇప్పటికే అమెరికా యూనివర్సిటీలకు లక్షలు ఖర్చుపెట్టిన విద్యార్థులకు ఇది మరో భారీ బిల్లు లాంటిదే. చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేసుకుంటూ అప్పులు తీర్చుకుందామనుకునే వాళ్లకు ఇలాంటి నిబంధనలు పెద్ద అడ్డంకిగా మారవచ్చు.
సిలికాన్ వ్యాలీ మాత్రమే కాదు.. అమెరికా చిన్న పట్టణాలకూ ఇండియన్స్ అవసరమే!
H-1B వీసాలపై ఆంక్షలు అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలకే సమస్య అనుకుంటే పొరపాటే. అమెరికాలోని కొన్ని చిన్న పట్టణాల్లో వైద్యులు, టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. అక్కడ స్థానికంగా సరిపడా నిపుణులు దొరకడం లేదు. దీంతో విదేశాల నుంచి వచ్చే ఉద్యోగులపైనే ఆధారపడాల్సి వస్తోంది.
మిసిసిపీ డెల్టా వంటి ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని ఇండియాస్పోరా చెబుతోంది. అలాంటి చోట్ల విదేశీ వైద్యులు, టీచర్లు వెళ్లకపోతే అక్కడి ప్రజలకు అవసరమైన సేవలు అందించడం కూడా కష్టమవుతుంది. అంటే అమెరికా ప్రభుత్వం విదేశీ ఉద్యోగులకు చెక్ పెట్టాలని చూస్తుంటే, మరోవైపు అమెరికాలోని కొన్ని ప్రాంతాలు మాత్రం వాళ్ల కోసం ఎదురుచూస్తున్నాయి.
ఇండియన్స్‌ను ఆపితే అమెరికాకే రివర్స్ పంచ్ పడుతుందా?
ప్రస్తుతం అమెరికాలో ఎన్నికల వేడి పెరుగుతోంది. ఈ సమయంలో విదేశీ ఉద్యోగులు, వలసదారుల అంశం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. స్థానికులకు ఉద్యోగాలు దక్కడం లేదంటే అందుకు విదేశీయులే కారణమని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ ఇండియాస్పోరా మాత్రం ఈ వాదనను తప్పుబడుతోంది. భారతీయ ఉద్యోగులు అమెరికా అవకాశాలను లాక్కోవడం లేదని, అక్కడ అవసరమైన నైపుణ్యాలను అందిస్తూ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతున్నారని చెబుతోంది.
అంతేకాదు, భారతీయ మూలాలున్న ఉద్యోగులను రాజకీయ ప్రయోజనాల కోసం టార్గెట్ చేస్తే అమెరికా-భారత్ సంబంధాలపైనా ప్రభావం పడొచ్చని హెచ్చరిస్తోంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







