సత్యవర్తనం విశ్వదర్శనం – డాక్టర్ రమణ వి. వాసిలి
సావిత్రి తొమ్మిదవ పుస్తకం దివ్యజీవనం: ప్రపంచంలో జీవిస్తూ తపశ్శక్తితో, యోగానుభూతితో నిత్యం స్వర్లోక విహారం చేయగలగడం ‘దివ్యజీవనం’ అంటారు శ్రీ శార్వరి. దివ్యజ్ఞానంతో పొందగలిగేది బ్రహ్మత్వస్థితి. ప్రతి యోగి కోరుకునే ఈ స్థితిని అశ్వపతి యోగానుభూతితో సాధించాడు, అధోలోకాలు (అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ), ఊర్ధ్వలోకాలు (భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం) దర్శించాడు, చతుర్దశ భువనాలు దర్శించడమే కాదు, సృష్టి రహస్యాలు తెలుసుకున్నాడు. భౌతికంగా వుంటూనే అనంతసీమలు విహరించాడు. అశ్వపతి మనస్సు, శరీరం, ఆత్మ ఆనందంతో పులకించాయి. శరీరానికి విన్నూత్న కాంతి ఏర్పడ్డది, మనస్సుకు కొత్త తేజస్సు సమకూరింది, ఆత్మకు నూతన తేజస్సు చేకూరింది. ఈ దశలో అందరి యోగుల్లాగా అశ్వపతీ దివ్యానందాన్ని, సచ్చిదానందాన్ని, ఈశ్వరీయతిని పొందాడు.
Aurobindo: The Paradise of the Life-Gods Around him shone a great felicitous Day A luster of some rapturous Infinite, It held in the splendor of its golden laugh Regions of the heart’s happiness set free, Intoxicated with the wine of God, Immersed in light, perpetually divine.
Eternity drew close disguised as Love And laid its hand upon the body of the Time. A little gift comes from the immensities,
But measureless to life its gain of joy; All the untold Beyond is mirrored there.
శార్వరి: గంధర్వ లోకం
ఆయన చుట్టూ మహానందం కాంతిగా విస్తరించింది
మరేదో అవ్యక్త పరమానందం పరవళ్ళు తొక్కింది
ఎటుచూసినా సువర్ణ రోచిస్సుల మందస్మితాలు
హృదయానందం స్వేచ్ఛగా ఎల్లెడలా పరచుకుంది
అశ్వపతి అమృత్ సేవనంతో మత్తెక్కినట్లు
దివ్యత్వంలో, వెలుగులో, తేజస్సులో మునిగిపోయాడు.
ఈశ్వరీయత “ప్రేమ” రూపంలో అతనిని చేరింది
అదే లోకంలోని తన శరీరానికి ఆలంబనం అయింది
పరంలోని మహాసంపదలు ఏకొద్దిగా మన కందినా
అవి అందించే ఆనందం మహాద్ఫుతంగా వుంటుంది
ఆ చిరు ఆనందంలోనే బ్రహ్మానందం ప్రతిబింబిస్తుంది.
Aurobindo: The Kingdom and Godheads of the Little Mind
This too must now be overpassed and left,
As all must be until the highest is gained
In whom the world and self grow true and one:
Till that is reached our journeying cannot cease.
శార్వరి: మనోమయ లోకాలు
ఈ సర్వాన్ని ఇక్కడే వదిలి ముందుకు సాగిపోవాలి
ఈ మహాజగత్తు ఆత్మ ఒక్కటిగా రాణించి
లయించే పరబ్రహ్మను చేరేవరకు ఇవి అవసరం
ఆ గమ్యం చేరేవరకు మన ప్రయాణం సాగవలసిందే.
కాలాతీతమైనది, అమరమైనది బ్రహ్మస్థితి. దివ్యజీవనంతో పొందగలిగే ఈ బ్రహ్మస్ధితి నిత్యానుభూతమైనది. ఈ దివ్యజీవనం అందరికీ సాధ్యమయ్యేది కాదు, అందుకు గొప్ప సంకల్పం, పట్టుదల, అంకితభావం, ఎంతో కృషి, అనంతమైన సాధన అవసరం. విశ్వప్రేమతో విశ్వాత్మలుగా పరిణితి చెందిన వారు పరమాత్మ సన్నిధిలో సదానంద జీవులుగా మనగలుగుతారు.
అతీంద్రియ స్థితిలో ఆత్మ చైతన్యాన్ని శ్రీ శార్వరి ఇలా వివరిస్తారు:
సామాన్య మాధుర్యాలే అసామాన్య మహత్వాలవుతాయి. ఆధ్యాత్మిక మహత్తులు సంతరించుకున్న మానవాత్మ
అకస్మాత్తుగా ఆధ్యాత్మిక మహత్తులు సంతరించుకుని బాధలన్నింటినీ మహత్తర సుఖాలుగా మార్చుకుంటుంది. స్వర్గ నరకాల మధ్య భేదాన్ని నివారించుకుంటుంది.
ఈ ఆత్మ చైతన్యాన్ని శ్రీ అరవిందులు ఆంగ్లంలో ఇలా చెబుతారు:
Sweet common things turned into miracles:
Overtaken by the spirit’s sudden spell
Smitten by a divine passion’s alchemy,
Pain’s self compelled transformed to potent joy
Curing the antithesis twixt heaven and hell.
దివ్యజీవనంలో ఆత్మ:
ప్రతి దృశ్యం నుండి, ప్రతి శబ్దం నుండి ఆధ్యాత్మిక శక్తిని గ్రహించి, ప్రజ్ఞతో ఈశ్వరుని చేరడానికి ప్రయత్నిస్తుంది. -శార్వరి
It drew from sight and sound spiritual power,
Made sense a road to reach the intangible. – Aurobindo
పరంలోని మహాసంపదలు ఏకొద్దిగా మన కందినా
అవి అందించే ఆనందం మహాధ్భుతంగా వుంటుంది
ఆ చిరు ఆనందంలోనే బ్రహ్మానందం ప్రతిబింబిస్తుంది. -శార్వరి
A little gift comes from the Immensitudes,
But measureless to life it’s gain of joy;
All the untold Beyond is mirrored there. – Aurobindo
అశ్వపతి చేరదలచింది స్వర్గం కాదు. కాలరాహిత్యంలో కడపటి అంచుకు, ఆధ్యాత్మిక శిఖరాలు చేరుకోవాలన్నది ఆయన లక్ష్యం. ప్రాపంచికమైన, భౌతికమైన, ప్రాకృతికమైన ‘మాయ’ పొరల్ని తెరల్ని దాటి, ప్రజ్ఞ ఒక్కటే జీవుని ‘సత్య’పథంలో నడిపిస్తుంది. ఆత్మజ్ఞానంతో తనకు తాను తెలుసుకున్నవి తప్ప ఒకరు చెప్పే సందేశాలు రేపటికి సందేహాలవుతుంటాయి. పరిమిత జ్ఞానంతో చేసే బోధలు, తత్వాలు, ధర్మాలు కాలదోషం పడతాయేతప్ప దివ్యజీవనానికి పనికి రావు. ఏదో సాధించినట్లు అనిపించినా సాధించేది ఏమీ ఉండదు. మనస్సు కోరుకునే ప్రాపంచిక సుఖసంతోషాలు వదులుకోవడం సులభం కాదు కానీ మనస్సును మించినది ఆత్మ, ఆత్మశక్తి. భౌతికానికి హద్దులుంటాయి గాని ఆత్మ దర్శించలేనిది, సాధించలేనిది ఉండదు. పరప్రజ్ఞతో పరమ సత్యాన్ని తెలుసుకుని, పరమాత్మను చేరుకోవాలి. అందుకు ధ్యానం, సాధన అవసరం. మనలోని అజ్ఞానాన్ని గుర్తించి, తొలగించాలి. పూర్ణశూన్యం నుంచి చేసే ఆలోచనలు ఇందుకు దోహదపడతాయి. మనలో నిద్రస్తున్న జ్ఞానాన్ని నిద్ర లేపాలి. జ్ఞానం మన ముంగిటకు పిలవని పేరంటంగా రాదు. బాహ్య ప్రపంచంలో వుంటూనే దాన్ని మనం గుర్తించాలి, అది మన అంతరాత్మలో నిద్రాణమైవుంటుంది.
మన వివేకానికి అందినదే యదార్థం అనుకుంటాం. ఈ బాహ్య ప్రపంచం, కనిపించే వాస్తవాలే పరమసత్యం అనుకుంటాం. సహజంగా మన వివేకం కూడా ప్రాపంచిక విషయాలకే ప్రాధాన్యం ఇస్తుంది. కాని యోగి తన సాధనతో, ప్రజ్ఞతో ఇంద్రియాలకు అతీతమైన సమాధి స్థితి పొందగలుగుతాడు.
శార్వరి: మహోన్నత సత్యలోకాలకు పయనించ గలిగిన యోగికి, ఆత్మే చీకటి నుండి వెలుగులోకి బాట ఏర్పరుస్తుంది, అందని పరమాత్మను అందేటట్లు చేస్తుంది.
Aurobindo: A candidate for a higher suzerainty,
A passage she cut through from Night to Light,
And searched for an ungrasped Omniscience.
ప్రకృతిలో కనిపించే సుందర దృశ్యాలు, చిత్రాలు
అన్నీ ఈశ్వర లీలలకు, ప్రజ్ఞకు తార్కాణాలు. అందుకే, ‘అంతా ఈశ్వరమయం’ అంటారు.
Aurobindo: The Kingdom and Godheads of the Greater Mind
There ceased the limits of the labouring Power.
But being and creation cease not there.
For Thought transcends the circles of moral mind,
It is greater than its earthly instrument:
The godhead crammed into mind’s narrow space
Escapes on every side into some vast
That is a passage to infinity.
శార్వరి: మహర్లోకాలు
ఒక శక్తితో పరిశ్రమించడం ఆపైన సాధ్యపడదు.
జీవుడు, సృష్టి అంతటితో ఆగిపోయినట్లు కాదు.
దివ్యభావన మానవమేధను అతిక్రమిస్తుంది
భౌతిక పరికరాలన్నింటిని మించినది అది
మనస్సులోని ఇరుకు జాగాలలో దివ్యత్వం చొరబడుతుంది
అలా ప్రవేశించి అన్నివైపులనుండి శూన్యంలోకి
మహారోదసిలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తుంది.
అనవరతమైన మార్పే ప్రగతికి సంకేతం.
పరిపక్వమైన జ్ఞానికే భగవంతుడు కనిపిస్తాడు.
మానవుడు ఎంత శక్తివంతుడైన ప్రతిసృష్టి చేయలేడు.
బుద్ధి, జ్ఞానం వలన సత్యం కనిపించదు. కేవలం ఆత్మకు మాత్రమే అవగతమవుతుంది. మన మనస్సు చిన్న చిన్న విషయాలనే ఆలోచిస్తుంది. సంపూర్ణమైన ఆత్మజ్ఞానంతో సత్యం బోధపడుతుంది.
దీన్నే అరవిందులు: For nothing is known while aught remains concealed;
The Truth is known only when all is seen.
స్థిరసంకల్పంతో, సమర్పణాభావంతో ఉన్నవారే లక్ష్యాన్ని చేరుకుంటారు. ఇటువంటి వారిలోకి పరప్రజ్ఞ అనేక మార్గాల్లో ప్రవేశిస్తుంది అంటారు శ్రీ శార్వరి.
సృష్టి ఒక అద్భుతమైతే, జీవనం ఒక పరమాద్భుత చైతన్య స్రవంతి. అందునా దివ్యజీవనం అన్ని లోకాల జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. ఆత్మచైతన్యం పొందిన మనిషికి పరమాత్ముని ప్రతి సంకల్పం, ప్రతి చర్య అణువణువునా కనిపిస్తాయి, ఆలోచించగల మనస్సుకు వాటి విలువలు తెలుస్తాయి. ఎన్ని మహిమలు, మహత్కార్యాలు చేసినా ఆర్జించే జ్ఞానం ఒక్కటే. దివ్యజీవనం ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం.
భౌతిక రూపాలులేని ఆత్మలతో ఆత్మలే సంభాషిస్తాయి.
ఎన్నెన్ని రూపాలు ధరించినా అంతరాత్మ ఒక్కటే.
సృష్టించబడినదంతా తిరిగి లయించిపోతుంది.
లయించిపోయినవే తిరిగి ప్రాణం పోసుకుంటాయి.
పరచైతన్యప్రజ్ఞతో అశ్వపతి ఆత్మ అన్ని భువనాలు సంచరించింది. ‘యోగాత్మ’తో గంధర్వ లోకాలు, మనోమయ లోకాలు, మహర్లోకాలు, సత్యలోకాలు దర్శించాడు. చివరకు నిశ్చల, నిర్వికల్ప సమాధిని చేరాడు.
“అశ్వపతి తన ఆత్మగత నిశబ్ద ప్రశాంతిని దాటి
పరమ నిర్మలమైన భావాతీత స్థితిని చేరాడు
భూ ప్రపంచానికి అతీతమైన శక్తుల్ని దర్శించాడు
పరబ్రహ్మ సచ్చిదానంద లోకాలు తిరిగాడు
సృష్టిలోవున్న అన్నింటి ఆంతర్య శిఖరాలు మెట్టి
విశ్వ పరిణామానికి పరబ్రహ్మ సూత్రాన్ని తెలుసుకున్నాడు”.
పరచైతన్యప్రజ్ఞతో మాయాప్రపంచాన్ని, భౌతిక హద్దుల్ని అధిగమించాడు. ‘ఇహానికి-పరానికి’ మధ్యనున్న ‘మాయ’ని గుర్తించాడు. చివరకు, ‘మానసాత్మే విశ్వాత్మ’గా గుర్తించాడు. పరలోక ప్రజ్ఞతో అశ్వపతి ప్రజ్ఞాభాస్కరుడయ్యాడు, కాలాతీతుడయ్యాడు.
మానవజాతి ప్రతినిధిగా అశ్వపతి పొందిన అనుభవాలు, సాధించిన విజయాలు వాస్తవానికి శ్రీ అరవిందులవి. పూర్ణయోగ ఆవిష్కర్తగా, అర్ధశతాబ్దం పాటు సాధకుడిగా, అరవిందులు సాధించినది అనితరసాధ్యమైన యోగానుభవం. మరోపక్క క్షణమాత్ర సంకల్పంతో అతీంద్రియస్థితిని చేరుకోగల యోగపుంగవులు శ్రీ శార్వరి. వెరసి ఇరువురుది దివ్యజీవనం. అదే ఇరువురు యోగానూయులకు పంచియిచ్చిన వరం.
సావిత్రి ‘ముగింపు’లేని మహాకావ్యం – జీవకావ్యం అంటారు శ్రీ శార్వరి. సత్యాన్వేషణకు, పరాన్వేషణకు ముగింపు ఉండదు. ఈ అన్వేషణ సృష్టాది నుండి అనంతంగా సాగుతూనే వుంది. అన్వేషణ ‘తపస్సు’గా మారి యుగాలుగా కొనసాగుతోంది. వేదఋషులు నుండి నేటి వాదప్రియుల వరకు ఆత్మ జిజ్ఞాస ఒక్కటే, మారలేదు.
Aurobindo: The Heavens of the Ideal
Always the Ideal beckoned from afar.
Awakened by the touch of the unseen,
Deserting the boundary of things achieved,
Aspired the strong discoverer, tireless Thought,
Revealing at each step a luminous world.
శార్వరి: సత్యసాయుజ్యం
సత్యం ఎప్పుడూ సుదూరంగా కనిపించి కవ్విస్తుంది.
అగోచర పరమాత్మ స్పర్శతోనే సత్యం జాగృతమవుతుంది
మనం పొందిన విషయాల సరిహద్దుల్ని చెరిపేసి
అవిశ్రాంతంగా సృష్ట్యాదిని అన్వేషిస్తూపోతే
అడుగడుగునా ఒక తేజోలోకం అనిపిస్తుంది.
Aurobindo: In the Self of Mind
At last there came a bare indifferent sky
Where Silence listened to the Cosmic Voice,
But answered nothing to a million calls;
The soul’s endless question met with no response.
శార్వరి: మనసాత్మ
చివరకు నిశ్చల, నిర్వికల్ప సమాధిని చేరాడు
అక్కడ నిశ్శబ్దం నుండి విశ్వనాధాన్ని వినవచ్చు.
కాని కోటి పిలుపులకైన సమాధానం లభించదు
ఆత్మ అడిగే లక్ష ప్రశ్నలకు వివరణ లభించదు.
సావిత్రి రచన గురించి ముగింపు మాటల్లో శ్రీ శార్వరి ఇలా అంటారు: శ్రీ అరవిందుల రచనలు అర్ధం చేసుకోవడం కష్టం, అందునా ‘సావిత్రి’ మరింత క్లిష్టం. అలాంటి ‘సావిత్రి’ని తెలుగు చేయబూనడం సాహసమే. శ్రీ అరవింద యోగికి సాక్షాత్కరించిన సావిత్రి నాకు జగన్మాత గాయత్రిగా సాక్షాత్కరించింది. సావిత్రి నేను ఏదీ ఆశించి రాసినది కాదు ఒకరి మెప్పు కోసం అంతకంటే కాదు. భృక్త రహిత తారక రాజయోగ సాధకుడిగా, జిజ్ఞాసతో, నా తృప్తి కోసం చేసిన రచన ఇది. ఈ రచన యోగిగా నన్ను ఆధ్యాత్మిక శిఖరాగ్రానికి చేర్చింది.
Aurobindo: The Kingdom of the Greater Knowledge
After a measureless moment of the soul
Again returning to these surface fields
Out of the timeless depths where he had sunk,
He heard once more the slow tread of the hours.
శార్వరి: దివ్యలోకాలు
అత్యద్భుతమైన ఆత్మసంచారానుభవం పొంది
బాహ్య భౌతిక ఆవరణలోకి తిరిగి చేరుకున్నాడు
కాలాతీతమైన రోదసీ శూన్య సాగరాల మునిగి
తిరిగి ఒడ్డుకుచేరి బాహ్య శబ్దాలను వినసాగాడు.
అరవింద సావిత్రి ఒకసారి చదివి అర్థం చేసుకొని, ఆకళింపు చేసుకోగలిగే గ్రంథం కాదు. అలాగే ఒకరు చదివి, ఇది అని చెప్పగలిగేది కాదు. సావిత్రి అంటే యోగజీవనం, యోగఫలం, యోగావిభూతి. భౌతికంగా అవసరం లేనిది, భౌతికానికి అతీతమైనది, మృత్యువు తర్వాతిది, ఆత్మచైతన్యంతో మాత్రమే పొందగలిగేది సాక్షాత్కరింపచేస్తుంది సావిత్రి. ఇది యోగసాధనతో సాధ్యమయ్యే దివ్యజీవనం. ఇది శ్రీ అరవిందులు, శ్రీ శార్వరి యోగసాధకులకు అందించిన అమృతకావ్యం. కవి, పండితులు స్వర్గీయ శ్రీ భుజంగరాయ శర్మ అన్నట్లు సావిత్రి రచనలు ఒకటి మాతృక, మరొకటి అనువాదం అనడం కన్నా, సృష్టికి ప్రతిసృష్టి అనడం సబబుగా వుంటుంది.
Aurobindo: The World-Soul
A covert answer to his seeking came.
In a far shimmering background of mind-space
A glowing mouth was seen, a luminous shaft;
A recluse gate it seemed, musing on joy,
A veiled retreat and escape to mystery.
శార్వరి: విశ్వాత్మ
ఆయన జిజ్ఞాసకు సరైన సమాధానం లభించింది.
మనో శూన్యంలో సుదూరంగా వెలిగే మహా తేజస్సు
నోరు విప్పుకున్నట్లు, ఒక కాంతి యవనిక జారింది
ఆనంద సంగీతంతో ఒక మార్గం కనిపించింది
అదే మహా నిష్క్రమణం, మహా పరనిర్వాణం.
ఎవరు ఏమార్గంలో యోగ సాధన చేసినా, చేస్తున్నా సావిత్రి చదవడం అవసరం. యోగ రహస్యాలకు నిధి సావిత్రి. ఇది చదవడం జిజ్ఞాసపరుల విధి.
Dr. Ramana V. Vasili
Spiritual Foundation
7062 Beringer Dr. S.
Cordova, Tennessee 38018, USA
Cell: 901-387-9646
[email protected]







