ఏపీ తీరప్రాంత పోర్టుల్లో డేంజర్ సిగ్నల్స్..!
అర్నబ్ తుఫాన్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్ కు మురుసు తుఫాన్ రూపంలో మరో ముప్పు ఆందోళన కలిగిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి ‘మురసు'(Murusu) తుపానుగా మారిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం తీవ్ర అప్రమత్తమైంది. తుపాను ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో విపత్తు నిర్వహణ శాఖ మరియు వాతావరణ శాఖ అధికారులు అత్యంత ప్రమాదకర హెచ్చరిక సంకేతాలను జారీ చేశారు.
తుపాను తీవ్రతను బట్టి వివిధ పోర్టుల్లో ప్రమాద హెచ్చరికల స్థాయిని పెంచారు. ముఖ్యంగా గుంటూరు/బాపట్ల జిల్లా పరిధిలోని నిజాంపట్నం పోర్టులో అత్యంత ప్రమాదకరమైన 10వ నంబర్ హెచ్చరికను అధికారులు ప్రకటించారు. అలాగే కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం పోర్టులో 9వ నంబర్ ప్రమాద హెచ్చరికను, నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టులో 8వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. విశాఖపట్నం, కాకినాడ, గంగవరం సహా రాష్ట్రంలోని మిగిలిన ప్రధాన పోర్టులలో ప్రస్తుతానికి 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలను కొనసాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మురసు తుపాను తీరానికి అతి సమీపంలోకి దూసుకువస్తుండటంతో తీర ప్రాంతాల్లో గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సముద్రం తీవ్ర అలజడిగా మారడంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని తీరప్రాంత జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం అధికారిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను సిద్ధం చేస్తోంది.







