పాట సూపర్ హిట్.. సింగర్ ఎవరని సెర్చ్ చేస్తే మైండ్ బ్లాక్!
ఒక పాట ప్లే అయింది. మొదటి లైన్ వినగానే నచ్చేసింది. మెలోడీ అయితే నెక్స్ట్ లెవల్! ఆ వాయిస్‌లో ఏదో మ్యాజిక్ ఉంది. పాట అయిపోయినా ఆ గొంతు మాత్రం మైండ్‌లో రిపీట్ అవుతూనే ఉంది. వెంటనే స్పాటిఫైలోనో, యూట్యూబ్‌లోనో ఆ పాట కోసం సెర్చ్ చేస్తారు. ఏ సినిమాలోది? ఏ ఆల్బమ్‌లో వచ్చింది? సింగర్ ఎవరబ్బా? అంటూ ఆరా తీస్తారు. ఆ సింగర్ ఫొటో చూడాలని, అతడి ఇతర పాటలు కూడా వినాలని అనుకుంటారు. కానీ అక్కడే అసలు ట్విస్ట్ ఎదురైతే? ఆ గొంతు వెనుక ఒక మనిషి కాదు కదా.. అసలు మనిషే లేడు అని తెలిస్తే? వినడానికి షాకింగ్‌గా ఉన్నా ఇప్పుడు మ్యూజిక్ వరల్డ్‌లో ఇలాంటి సీన్ నడుస్తోంది. దక్షిణ కొరియాలో ఒక AI పాట ఏకంగా మ్యూజిక్ చార్టుల్లో రెండో స్థానానికి దూసుకెళ్లింది. మనుషులు పాడిన పాటలతో పోటీపడుతూ మ్యూజిక్ లవర్స్‌ను ఫిదా చేస్తోంది. మరి ఈ AI సింగర్ స్టోరీ ఏంటి?
సింగర్ లేడు.. అయినా పాటకు ఫుల్ క్రేజ్!
దక్షిణ కొరియాలో ఇప్పుడు ‘Meomuru’ అనే మ్యూజిక్ యాక్ట్ పేరు ట్రెండింగ్‌లో ఉంది. వీళ్లు విడుదల చేసిన ‘Have You Become the Adult You Dreamed Of?’ అనే పాట అక్కడి ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ Melon Top 100 చార్టులో ఏకంగా రెండో స్థానానికి చేరుకుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ పాటలో వినిపించే వాయిస్ ఏ సింగర్దీ కాదు. పూర్తిగా AI జనరేట్ చేసిన వాయిస్! అయినా పాటకు మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
ఈ పాట వెనుక Glorywave అనే ఇద్దరు సభ్యుల మ్యూజిక్ ప్రొడక్షన్ టీమ్ ఉంది. లీ యోంగ్-సోక్, చోయ్ సంగ్-హ్యుక్ అనే వీళ్లకు సంగీత రంగంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. పాట ఐడియా, లిరిక్స్ వీళ్లే రెడీ చేశారు. మెలోడీ, మ్యూజిక్ అరేంజ్మెంట్, వోకల్స్ కోసం Suno అనే AI ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. చివర్లో ఎడిటింగ్, మిక్సింగ్, మాస్టరింగ్ కూడా వీళ్లే చేశారు. అంటే క్రియేటివ్ ఐడియా మనుషులదే.. కానీ పాటకు గొంతు ఇచ్చింది మాత్రం AI అన్నమాట.
AI అని తెలిసినా ప్లే చేస్తున్నారు.. ఇదే అసలు మ్యాజిక్!
ఈ పాట వైరల్ కావడంతో Meomuru సోషల్ మీడియా పేజీల్లో కామెంట్ల వర్షం కురుస్తోంది. అందరూ అడుగుతున్నది ఒకటే.. ‘ఇది నిజంగా AIనా?’ అని. మొదట పాట విన్న చాలామంది సాధారణ సింగర్ పాడాడనే అనుకున్నారు. కానీ అసలు విషయం తెలిసిన తర్వాత కొందరు షాకయ్యారు. మరికొందరు మాత్రం పాట బాగుంటే చాలు, ఎవరు పాడారన్నది ఎందుకు? అంటున్నారు.
అయితే కొందరు మొదట ఈ పాటను బాగానే ఎంజాయ్ చేశారు.ఇది AI వాయిస్ అయి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.మెలోడీలు పాత పాటలను గుర్తుకు తెస్తున్నాయని, లిరిక్స్‌లో కొత్తదనం లేదని అభిప్రాయపడ్డారు.
కానీ Gen Z ఆలోచన కాస్త డిఫరెంట్‌గా ఉంది. ఈ పాట AIతో తయారైందని తెలిసినా నచ్చడం మాత్రం ఆగలేదు. పాట క్యాచీగా ఉందా? వినడానికి బాగుందా? మనసుకు కనెక్ట్ అవుతుందా? ఇవే తనకు ముఖ్యమని చెబుతున్నారు. పైగా తాను కూడా AI మ్యూజిక్ టూల్స్‌తో ప్రయోగాలు చేస్తుంటానని చెప్తున్నారు. అంటే సింగర్ అవ్వాలంటే తప్పనిసరిగా మైక్ ముందు నిలబడి పాడాల్సిన రోజులు క్రమంగా మారుతున్నాయన్నమాట.
ఇక సింగర్ అవ్వాలంటే గొంతు ఉండాల్సిన అవసరం లేదా?
ఒకప్పుడు పాట తయారుచేయాలంటే సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్, రికార్డింగ్ టీమ్.. ఇలా చాలామంది అవసరమయ్యేవారు. స్టూడియో ఖర్చులు, మ్యూజిక్ ప్రొడక్షన్ అంటూ పెద్ద ప్రాసెస్ ఉండేది. కానీ ఇప్పుడు AI టూల్స్ ఆ గేమ్నే మార్చేస్తున్నాయి. పాటలు రాయడం వచ్చి పాడటం రాకపోయినా ఓకే. కంపోజింగ్ తెలియకపోయినా పర్లేదు. మీకు వచ్చిన ఐడియాను AIకి వివరించి ప్రాంప్ట్స్ ఇస్తే చాలు.. అది మెలోడీ నుంచి వోకల్స్ వరకు పాటను తయారుచేసి ఇచ్చేస్తుంది.
దీంతో టాలెంట్ ఉన్నా సరైన అవకాశాలు రాక ఇబ్బంది పడుతున్నవాళ్లకు కొత్త డోర్ ఓపెన్ అవుతోంది. డబ్బు లేక స్టూడియోకు వెళ్లలేని వాళ్లు కూడా తమ పాటలను ప్రపంచానికి పరిచయం చేయొచ్చు. కానీ ఇదే సమయంలో ప్రొఫెషనల్ సింగర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, మ్యూజిక్ ప్రొడ్యూసర్లకు కొత్త టెన్షన్ మొదలైంది. రేపు ప్రతి ఒక్కరూ AIతో పాటలు తయారుచేస్తే తమ పరిస్థితి ఏంటి? తమ ఉపాధికి దెబ్బ పడుతుందా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
వర్చువల్ సింగర్లు ఓకే.. ఇప్పుడు AI సింగర్లు కూడా!
దక్షిణ కొరియాలో వర్చువల్ ఆర్టిస్టుల హవా ఇప్పటికే ఉంది. PLAVE అనే ఐదుగురు సభ్యుల బాయ్ బ్యాండ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. వీళ్లు అభిమానులకు కనిపించేది యానిమేటెడ్ క్యారెక్టర్ల రూపంలోనే. మోషన్ క్యాప్చర్, ఫేషియల్ ట్రాకింగ్ టెక్నాలజీతో నిజమైన వ్యక్తుల కదలికలను వర్చువల్ పాత్రలకు కనెక్ట్ చేస్తారు. అయితే పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం, అభిమానులతో ఇంటరాక్ట్ అవ్వడం మాత్రం నిజమైన మనుషులే చేస్తారు.
ఈ గ్రూప్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. వీళ్ల ఆల్బమ్ ‘HYPERDRIVE’ Billboard Top Album Sales చార్టులో టాప్ ప్లేస్ దక్కించుకుంది. గత ఏడాది సియోల్‌లోని 18 వేల మంది కెపాసిటీ ఉన్న Gocheok Sky Domeలో నిర్వహించిన షో కూడా హౌస్‌ఫుల్ అయింది. అంటే స్క్రీన్‌పై కనిపించే క్యారెక్టర్ నిజమైన మనిషి కాకపోయినా ఫ్యాన్స్ మాత్రం ఫుల్‌గా కనెక్ట్ అవుతున్నారు.
అమెరికాలోనూ Xania Monet అనే AI R&B ఆర్టిస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈమె పాటల్లో వాయిస్‌ను Suno AI జనరేట్ చేస్తుండగా, లిరిక్స్‌ను అమెరికన్ కవి, డిజైనర్ టెలిషా ‘నిక్కీ’ జోన్స్ రాస్తున్నారు. గత ఏడాది Hallwood Mediaతో మల్టీ మిలియన్ డాలర్ల డీల్ కూడా కుదుర్చుకుంది. Billboard చార్టుల్లోనూ స్థానం సంపాదించింది. అయితే ఈ ట్రెండ్‌పై అందరూ హ్యాపీగా లేరు. గ్రామీ అవార్డు విజేత విక్టోరియా మోనెట్ సహా పలువురు సింగర్లు AI ఆర్టిస్టుల వల్ల నిజమైన కళాకారుల అవకాశాలు, ఆదాయం దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
AI పాటలతో కొత్త తలనొప్పి.. కాపీరైట్ ఎవరిది?
AIతో పాటలు తయారుచేయడం ఒక ఎత్తయితే.. వాటికి హక్కులు ఎవరికి చెందుతాయన్నది మరో పెద్ద సమస్యగా మారింది. ఒక పాటను AI తయారుచేస్తే దానికి ఓనర్ ఎవరు? లిరిక్స్ రాసిన వ్యక్తా? AIకి ప్రాంప్ట్స్ ఇచ్చిన వ్యక్తా? పాటను తయారుచేసిన ప్లాట్ఫామా? ఈ ప్రశ్నల దగ్గరే మ్యూజిక్ ఇండస్ట్రీలో అసలు రచ్చ మొదలైంది.
అమెరికాలో Suno సంస్థపై Universal Music Group, Sony Music Entertainment వంటి పెద్ద మ్యూజిక్ కంపెనీలు కేసులు వేశాయి. తమ అనుమతి లేకుండా కాపీరైట్ ఉన్న పాటలను AI మోడళ్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఉపయోగించారని వాటి ఆరోపణ. ఈ వివాదంలో సై, BTS వంటి కొరియన్ స్టార్ల పాటలు కూడా అనుమతి లేకుండా ఉపయోగించిన రికార్డింగ్స్‌లో ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి.
మరోవైపు ఎల్విస్ ప్రెస్లీ పాటలు, పేరు, రూపానికి సంబంధించిన హక్కులు కలిగిన Authentic Brands Group సంస్థ కూడా AI డెవలపర్ Anthropicపై దావా వేసింది. ఎల్విస్‌కు చెందిన 274 పాటలను అనుమతి లేకుండా ఉపయోగించారన్నది ఆరోపణ. అంటే AI ఎంత ఫాస్ట్‌గా పాటలు తయారుచేస్తున్నా, వాటి వెనుక ఉన్న అసలు కళాకారుల హక్కుల విషయంలో మాత్రం పెద్ద వివాదమే నడుస్తోంది.
AI పాటలకు కాపీరైట్ ఇవ్వాలా? కొరియాలోనూ కన్ఫ్యూజన్!
దక్షిణ కొరియా కాపీరైట్ చట్టాల ప్రకారం ఒక సృజనాత్మక రచనకు రక్షణ లభించాలంటే అందులో మనిషి సృజనాత్మక పాత్ర ఉండాలి. కానీ AI పాటల్లో మనిషి ఎంతవరకు పనిచేశాడు? యంత్రం ఎంతవరకు క్రియేట్ చేసింది? అన్నది తేల్చడం కష్టంగా మారింది.
Meomuru పాటను రూపొందించిన Glorywave టీమ్ కూడా తమ పాటను Korea Music Copyright Association (KOMCA)లో నమోదు చేయలేదు. సాధారణ పాటల రచన, మ్యూజిక్ అరేంజ్‌మెంట్‌కు వచ్చే రాయల్టీలను కూడా తాము పొందడం లేదని వెల్లడించింది.
నిజానికి KOMCA గత ఆగస్టులో AI సాయంతో తయారైన పాటలను కూడా నమోదు చేసుకునేందుకు గైడ్‌లైన్స్ తీసుకొచ్చింది. పాట తయారీలో మనిషి సృజనాత్మక పాత్ర గణనీయంగా ఉండాలని షరతు పెట్టింది. కానీ సంగీత కళాకారుల నుంచి అభ్యంతరాలు రావడంతో, చట్టపరమైన స్పష్టత లేకపోవడంతో కేవలం 22 రోజులకే ఆ గైడ్‌లైన్స్‌ను వెనక్కి తీసుకుంది. అంటే AI పాటలు హిట్ అవుతున్నాయి కానీ వాటికి చట్టపరమైన గుర్తింపు ఎలా ఇవ్వాలన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదు.
రేపు AI సింగర్లకే ఫ్యాన్ క్లబ్స్ వస్తాయా?
వర్చువల్ సింగర్ల ప్రయోగం దక్షిణ కొరియాలో దాదాపు మూడు దశాబ్దాల క్రితమే మొదలైంది. 1998లో Adam అనే వర్చువల్ సింగర్‌ను భారీ ప్రచారంతో పరిచయం చేశారు. అప్పట్లోనే దాదాపు రెండు లక్షల ఆల్బమ్‌లు అమ్ముడయ్యాయి. కానీ 3D గ్రాఫిక్స్ తయారీ ఖర్చులు, అప్పటి టెక్నాలజీ పరిమితుల కారణంగా ఆ ప్రయోగం ఎక్కువకాలం నిలబడలేదు. ఏడాది తిరక్కుండానే Adam చార్టుల నుంచి మాయమయ్యాడు.
కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ChatGPT, Gemini వంటి AI సేవలు మన రోజువారీ జీవితంలోకి వచ్చేశాయి. వర్చువల్ పాత్రలతో కూడా మనుషులు భావోద్వేగంగా కనెక్ట్ అవుతున్నారని Ewha Womans University ప్రొఫెసర్ యూ సుంగ్-చుల్ అభిప్రాయపడుతున్నారు. PLAVE విజయం కూడా అదే విషయాన్ని నిరూపిస్తోందని చెబుతున్నారు. అయితే AI సింగర్లు నిజమైన గాయకులను పూర్తిగా రీప్లేస్ చేస్తారని ఆయన అనుకోవడం లేదు. భవిష్యత్తులో AI మ్యూజిక్కు ప్రత్యేకమైన జానర్ ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు.
సంగీత విమర్శకుడు కిమ్ సంగ్-హ్వాన్ మాత్రం ఒక ముఖ్యమైన పాయింట్ చెబుతున్నారు. AIతో పాటలు తయారుచేయడం ఈజీ అయిపోయిందని, అందులో క్రియేటివిటీని పక్కన పెట్టకూడదని అంటున్నారు. ఒక పాట వెనుక ఉన్న అసలు ఐడియా మనిషిదా? అందులో అతడి సృజనాత్మకత ఎంత ఉంది? అన్నదే ముఖ్యమని చెబుతున్నారు.
ఫైనల్‌గా …
మ్యూజిక్ వరల్డ్‌లో కొత్త గేమ్ మొదలైంది. ఇప్పటివరకు సింగర్ల మధ్య పోటీ ఉండేది. ఇప్పుడు మనిషి గొంతుకు, AI గొంతుకు మధ్య పోటీ మొదలైంది. రేపు AI సింగర్లకు ఫ్యాన్ పేజీలు, ఫ్యాన్ వార్స్, భారీ మ్యూజిక్ షోలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అసలు ప్రశ్న ఒక్కటే.. మీకు నచ్చిన పాటను పాడింది మనిషా, AIనా అన్నది ముఖ్యం అనుకుంటారా? లేక పాట నచ్చితే చాలు అనుకుంటారా?
—-సూర్య ప్రకాష్ జోశ్యుల








