ట్రంప్ చేసిన ఒక్క విజ్ఞప్తి.. రిపబ్లికన్లకు ఎన్నికల్లో కొత్త చిక్కులు!
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఎదురవుతున్న సవాళ్లకు కారణం ప్రత్యర్థి డెమొక్రాట్ల వ్యూహాలు మాత్రమేనా? లేక సొంత పార్టీకి మద్దతు కూడగట్టాలనే ప్రయత్నంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయమే ఇప్పుడు ఆ పార్టీకి కొత్త తలనొప్పిగా మారిందా? ఆ నిర్ణయంతో… సొంత పార్టీని గెలిపించాలనే ఆరాటంలో ట్రంప్ తనకే రాజకీయ పరీక్ష పెట్టుకున్నారు అంటున్నారు విశ్లేషకులు. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటి..అదే పెద్ద తప్పుగా మారి ఎన్నికల రిజల్ట్ పై ప్రభావం చూపుతోందా…?
అసలు జరిగిన తప్పు ఏమిటి!
సాధారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు, మధ్యంతర ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. అధ్యక్ష ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నాయకుడి పనితీరు, హామీలు, విధానాలపై చర్చ జరుగుతుంది. కానీ మధ్యంతర ఎన్నికల్లో స్థానిక అభ్యర్థులు, వారి నియోజకవర్గ సమస్యలు, కాంగ్రెస్‌లో అధికార సమీకరణాలు కీలక పాత్ర పోషిస్తాయి. అధ్యక్షుడి పార్టీకి చెందిన అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ, ప్రతి స్థానాన్ని అధ్యక్షుడి వ్యక్తిగత ప్రజాదరణతో గెలవలేరు.
ట్రంప్ మాత్రం ఈ తేడాను పక్కన పెట్టి ఎన్నికల ప్రచారాన్ని తన చుట్టూ తిప్పాలని ప్రయత్నించారు. రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్లోనే ఆయన తన మద్దతుదారులను ఉద్దేశించి ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. “నేను కూడా బ్యాలెట్‌పై ఉన్నట్టుగా భావించండి” అని కోరారు. మధ్యంతర ఎన్నికల్లో తన పేరు ఉండదని తెలిసినా, తనను అభ్యర్థిగా ఊహించుకుని రిపబ్లికన్లకు ఓటేయాలని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి
ట్రంప్ ఎందుకు అలా చేశారు?
దీని వెనుక ఒక రాజకీయ లెక్క ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ఓటేసే కొందరు మద్దతుదారులు మధ్యంతర ఎన్నికల సమయంలో అదే ఉత్సాహంతో పోలింగ్ కేంద్రాలకు రావడం లేదని ఆయన భావించారు. అధ్యక్షుడి పేరు బ్యాలెట్‌పై ఉన్నప్పుడు ఓటు వేయడానికి వచ్చే వారు, ఆ పేరు లేని ఎన్నికల్లో అంతగా ఆసక్తి చూపకపోవచ్చని ఆయనకు తెలుసు. అందుకే తన వ్యక్తిగత ఆకర్షణను ఉపయోగించి రిపబ్లికన్ అభ్యర్థుల కోసం కూడా ఓటర్లను బయటకు తీసుకురావాలని చూశారు.
అందుకోసమే పార్టీకి చెందిన అభ్యర్థుల ప్రచారంలో ట్రంప్ స్వయంగా ముందుకు వచ్చారు. ర్యాలీలు, బహిరంగ సభలు, పార్టీ సమావేశాలు.. అన్నింటిలోనూ తనే ప్రధాన ముఖంగా నిలిచారు. ఆయన ఆలోచనలో ఇది బలమైన వ్యూహం. తన అభిమానులు తన కోసం వస్తే, పార్టీ అభ్యర్థులకు కూడా ఓట్లు పడతాయని లెక్క వేశారు. గతంలో తనకు మద్దతుగా నిలిచిన ఓటర్లను మళ్లీ చైతన్యపరచడం ఈ ప్రయత్నం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.
అదే సమస్యగా మారింది!
ఇక్కడే వ్యూహం మరో మలుపు తీసుకుంది. ట్రంప్‌ను ముందుకు తీసుకురావడం వల్ల రిపబ్లికన్ అభ్యర్థులకు ప్రచార వేదిక దొరికింది. కానీ అదే సమయంలో ఎన్నికల చర్చ కూడా వారి స్థానిక సమస్యల నుంచి ట్రంప్ పాలనపైకి మళ్లింది. ఓటర్లు ఇప్పుడు తమ నియోజకవర్గ అభ్యర్థుల గురించి మాత్రమే కాకుండా, అధ్యక్షుడి నిర్ణయాల గురించి కూడా ఆలోచించే పరిస్థితి ఏర్పడింది.
దీంతో ట్రంప్‌పై సంతృప్తిగా ఉన్నవారికి ఆయన ప్రచారం ఉత్సాహాన్నివ్వవచ్చు. కానీ ఆయన పాలనపై అసంతృప్తిగా ఉన్నవారికి మాత్రం అదే ప్రచారం తమ వ్యతిరేకతను ఓటు ద్వారా చూపించే అవకాశంగా కనిపించవచ్చు. అంటే తన అభిమానులను పోలింగ్ కేంద్రాలకు రప్పించాలనే ప్రయత్నంలో, తనను వ్యతిరేకించే ఓటర్లకూ ఒక స్పష్టమైన రాజకీయ లక్ష్యాన్ని ట్రంప్ ఇచ్చినట్టయింది. ఇదే ఆయన వ్యూహంలో ఉన్న అసలు రిస్క్.
ప్రజలకు ఇప్పుడు ఎన్నికలంటే జీవన వ్యయమే ముఖ్యం!
ట్రంప్ ప్రచారంలో వలసలు, సరిహద్దు భద్రత, అమెరికా ప్రయోజనాలు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినా.. ఓటర్ల రోజువారీ జీవితంలో మరో సమస్య బలంగా కనిపిస్తోంది. పెట్రోల్ ధరలు, ఆహార పదార్థాల ఖర్చు, ద్రవ్యోల్బణం, ఉద్యోగాల పరిస్థితి. ఎన్నికల సమయంలో ప్రజలు తమ జేబుపై పడుతున్న భారాన్ని ముందుగా లెక్క వేస్తారు. రాజకీయ ప్రసంగాలకంటే నెలవారీ ఖర్చులు తమకు ఎక్కువగా గుర్తొస్తాయి.
ఇరాన్‌తో యుద్ధం, ఇంధన ధరల పెరుగుదల, ఆర్థిక పరిస్థితులపై అసంతృప్తి కూడా రిపబ్లికన్ల ప్రచారానికి సవాలుగా మారాయి. ట్రంప్ పాలనలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని ఆశించిన ఓటర్లలో కొందరికి ఇప్పుడు అదే స్థాయిలో సంతృప్తి లేదని సర్వేలు సూచిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రిపబ్లికన్ అభ్యర్థులు తమ నియోజకవర్గ సమస్యలపై మాట్లాడాల్సిన చోట, ట్రంప్ పాలనను సమర్థించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
లాటినో ఓటర్లలో మార్పు.. రిపబ్లికన్లకు మరో సంకేతం
2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతు ఇచ్చిన లాటినో ఓటర్లలో కూడా ఇప్పుడు అసంతృప్తి సంకేతాలు కనిపిస్తున్నాయి. వలసలపై కఠిన చర్యలు, ఆర్థిక పరిస్థితులు, జీవన వ్యయం వంటి అంశాలు ఈ మార్పుకు కారణాలుగా చర్చకు వస్తున్నాయి. ప్యూ రీసెర్చ్ సెంటర్ అక్టోబర్ 2026 సర్వే ప్రకారం, లాటినో ఓటర్లలో ట్రంప్ పనితీరును ఆమోదిస్తున్నవారు 24 శాతం మాత్రమే ఉన్నారు. అంతేకాదు, 2024లో ట్రంప్‌కు ఓటేసిన లాటినో ఓటర్లలోనూ ఆయన పనితీరుపై మద్దతు తగ్గినట్లు సర్వే వెల్లడించింది.
ఇది రిపబ్లికన్లకు ముఖ్యమైన విషయం. ఎందుకంటే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతిచ్చిన ప్రతి ఓటరు మధ్యంతర ఎన్నికల్లోనూ అదే విధంగా పార్టీకి అండగా నిలుస్తారని చెప్పలేం. ట్రంప్‌ను ఇష్టపడినప్పటికీ, ఆయన ప్రభుత్వంలోని కొన్ని విధానాలపై అసంతృప్తిగా ఉన్న ఓటర్లు ఉండవచ్చు. అలాంటి వారిని తిరిగి ఆకర్షించడానికి స్థానిక అభ్యర్థులు ప్రయత్నించాల్సి ఉంటుంది. కానీ ఎన్నికల ప్రచారం మొత్తం ట్రంప్ చుట్టూ తిరిగితే, ఆ అభ్యర్థులకు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే అవకాశం తగ్గుతుంది.
ట్రంప్ మెడకు చుట్టుకున్నది ఇదేనా?
ట్రంప్ తన పేరు బ్యాలెట్‌పై ఉన్నట్టుగా భావించి ఓటేయాలని కోరడం వెనుక పార్టీకి ఓటర్లను సమీకరించాలనే ఉద్దేశం ఉంది. కానీ ఆ విజ్ఞప్తి మరో ప్రభావాన్ని కూడా తీసుకొచ్చింది. రిపబ్లికన్లకు ఓటేయడం అంటే ట్రంప్ పాలనకు మద్దతు ఇవ్వడమే అన్న భావనను బలపరిచింది. అదే సమయంలో ఆయన విధానాలపై అసంతృప్తి ఉన్నవారికి రిపబ్లికన్ అభ్యర్థులను వ్యతిరేకించడం ద్వారా అధ్యక్షుడికి తమ సందేశం పంపే అవకాశం కల్పించింది.
అయితే దీనినే రిపబ్లికన్ల సమస్యలన్నింటికీ ఏకైక కారణంగా చెప్పలేం. ఆర్థిక పరిస్థితులు, వలస విధానాలు, విదేశాంగ నిర్ణయాలు, స్థానిక అభ్యర్థుల బలం వంటి అంశాలూ ఎన్నికలపై ప్రభావం చూపుతాయి. అయినప్పటికీ ట్రంప్ తనను తానే ఈ ఎన్నికల కేంద్రంగా నిలబెట్టుకోవడం వల్ల పార్టీ అభ్యర్థులపై పడాల్సిన రాజకీయ దృష్టి అధ్యక్షుడి పనితీరుపైకి మళ్లింది.
తన అభిమానులను ఉత్సాహపరిచేందుకు ట్రంప్ వేసిన అడుగు.. ఇప్పుడు ఆయనపై ఉన్న ప్రజాభిప్రాయాన్ని కూడా ఎన్నికల చర్చలోకి తీసుకొచ్చింది. రిపబ్లికన్లకు అసలు సవాలు ప్రత్యర్థులను ఎదుర్కోవడమే కాదు.. ట్రంప్‌పై ఉన్న మద్దతు, వ్యతిరేకత మధ్య తమ అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడం కూడా!
—- సూర్య ప్రకాష్ జోశ్యుల








